ఇల్లు అలకగానే పండగ కాదు
posted on May 31, 2025 @ 12:40PM
కడపలో మహానాడు తో జగన్ పై అన్నీ సాధించేసినట్టేనా?
ఆల్ హ్యాపీస్ అంటూ ఇంట్లో బజ్జుంటే….
ప్రత్యర్థులకు ప్రాణం పోసినట్టే
బాబు భక్తులూ ఒకసారి వెనుదిరిగి చూడండి.. కూటమి ప్రభుత్వం గెలిచిన కొత్తల్లో ప్రస్తుత స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఒక మాట అన్న విషయం గుర్తుందా? జగన్ ఇంకా బతికే ఉన్నాడని.. నిజానికి ఇక్కడెవరికీ జగన్ చావాలన్నది కాన్సెప్ట్ కాదు. ఇవాళ జగన్.. అంతకన్నా ముందు వైయస్ఆర్ ఆ తర్వాత కేసీఆర్ ఇలా.. వరుసగా ప్రత్యర్ధులు మారుతుంటారు. రేపు మరొకరు కూడా వస్తూనే ఉంటారు. ఏదో సినిమాలో త్రివిక్రమ్ డైలాగ్ లా గెలవడం అంటే ప్రత్యర్ధి మరణం కాదు.. ఆ ఇజాన్ని చంపడం. విలనిజాన్ని అంతం చేయండం. ఈ విషయంలో మనమెంత దూరం వచ్చాం? నాలుగు పంచ్ డైలాగులు కొట్టగానే సరిపోదు. జగన్ తాను అధికారంలోకి రాగానే ఎన్నో డైలాగులు కొట్టారు. సిద్ధం సభలతో దద్దరిల్లేలా చేశారు. తర్వాత ఏమైంది? మొత్తం తారు మారైంది. సరిగ్గా ఇక్కడే మనం వ్యూహం రచించాల్సి ఉంది. జగన్ కి వచ్చింది పదకొండు సీట్లే కాబట్టి అతడి ఖేల్ ఖతం అన్న భావనలో ఉండటం పూర్తిగా తప్పు. ఆ సీట్ల వెనక 40 శాతం ఓటు బ్యాంకు ఉంది. పవన్ కళ్యాణ్ అన్నట్టు ఇదే జగన్ జర్మనీలో ఉండి ఉంటే.. ప్రతిపక్ష నేత అయ్యి ఉండేవాడు. అది కూడా అత్యంత లాంఛనంగా.. ఘనంగా!
నిజాలు మాట్లాడుకుందాం. జగన్ తల్లీ చెల్లి వెళ్లిపోయారు. ఇక అతడు ఒంటరి. రేపటి రోజు జైలుకు కూడా పంపించేస్తాం. ఆయన వెనక విజయసాయిరెడ్డి కూడా లేడు. మోడీ నుంచి కోర్టుల వరకూ మొత్తం వ్యవహారం నడపడానికి.. సాయిరెడ్డి సాయం కూడా కోల్పోయాడని అనుకూల మీడియాలు రాసే విషాద గాథల మాయలో పడిపోకండి(అది జన్మ జన్మల జైలానుబంధం) లైట్ తీసుకోవడం కూడా చేటు తెచ్చేదే. ఎందుకంటే అది మరో వ్యూహం కావచ్చు. అటు నుంచి నరుక్కు రావడం అన్నదొకటి ఇందులో దాగి ఉండొచ్చు. ఏమో ఇప్పటి దాకా మో,షాలు జగన్ని జైలుకు పంపకుండా ఉన్నారంటే అర్ధమేంటి? షా ఇక్కడికి వచ్చినపుడు జగన్ గురించి వాకబు చేసిన విషయం మరచి పోయారా? ఆయనను అడ్డు పెట్టుకుని ఆటాడ్డానికి ఇంకా ఎన్నో ఛాన్సులుండొచ్చు. ఎందుకంటే జగన్ ని జైలుకు పంపడం అంటే అదేమంత జోక్ కాదు. లోకేష్ మోడీ దగ్గరకు వెళ్లారు. మొత్తం మేనేజ్ చేశారు. ఇక జగన్ పని క్లోజ్ అనుకోడానికి అస్సలు వీల్లేదు. కారణం ఏంటంటారా? ఇదే జగన్ తండ్రి వైయస్ తన కథ ముగిసిపోయిందని ఫీలైనపుడు అసలు కథ మొదలు పెట్టారు. చంద్రబాబు ముందు మనమిక ఏమీ సాధించలేమయ్యా! అంటూ తన ఆత్మ కేవీపీతో అన్న మాటలను మరచి పోయారా ఏంటి?
ఆ తర్వాత చిన్నారెడ్డిని కెలికి.. తెలంగాణ అనే భూస్థాపితమైన అంశాన్ని తిరిగి నిద్ర లేపి.. దాని ద్వారా చంద్రబాబుకు చెక్ పెట్టాలనుకోవడంతో పాటు.. 2004 ఎన్నికల్లోనూ గెలిచేశారు. ఆ టైంలో చంద్రబాబు అలిపిరి బ్లాస్టింగ్ జరిగింది కూడా. ఆ సానుభూతి పని చేయాలి.. కానీ అలా జరగలేదు. పాదయాత్ర సైతం చేసి ఎలాగోలా వైయస్ ఆనాడు అధికారంలోకి వచ్చారో చూశారుగా. మరి జగన్… ప్రత్యేక హోదా అనే డెడ్ లైన్ పాలి.. ట్రిక్స్ బయటకు లాగి.. దాని ద్వారా.. ఏకంగా టీడీపీని ఎన్డీయేలోంచి బయటకు వచ్చేలా చేశారు. ఆ పై లోక్ సభలో అవిశ్వాసం పెట్టి.. దానికి అధికార పార్టీ ద్వారా ఓటు వేయించిన ఘనుడు జగన్. చరిత్రలో ఒక అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ పెట్టిన అవిశ్వాసానికి ఓటు వేయడం అదే తొలిసారి.
తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. అంతా ముగిసిపోయిందని జగన్ లాంటి నేతను అంత తేలిగ్గా నమ్మడానికి లేదు. ఎందుకంటే, ఆ బ్లడ్ లోనే తిరిగి కోలుకోవడం ఉంది. ఇప్పటి వరకూ బెజవాడ కనకదుర్గమ్మ ప్రతి బొట్టులోంచి పుట్టుకొచ్చే మహిషాసురుడ్ని హతమార్చిందేమోగానీ టీడీపీ దాని కూటమి పార్టీలు ఆ స్థాయిలో జగన్ రాజకీయ పతనాన్నేమీ శాసించలేదు. ఇంకా జగన్ తన టెక్నిక్స్ తాను వాడుతూనే ఉన్నారు. అందులో భాగంగా విజయసాయిని తెలివిగా అటు వైపునకు పంపారు. చాలా మంది సాయిరెడ్డి కూడా లేరు అని ఓ ఫీలై పోతున్నారుగానీ.. ఆయన నిజంగా ఆలాగే ఉన్నారా? ఒక లీడర్ పార్టీని వదిలినపుడు ఆయన హావ భావ విన్యాసాలు ఎలా ఉండేవి?
చూడలేదా మీరెప్పుడూ.. అదే విజయసాయి తాను పార్టీని వదిలినప్పటి నుంచి ఇప్పటి వరకూ జగన్ పై అదే సాఫ్ట్ కార్నర్ చూపుతున్నారు. గమనించారా? సాయిరెడ్డి ఇంకా జగన్ కి సాయం చేసే మూడ్ కమ్ మోడ్ లోనే ఉన్నారు. అందుకే పార్టీ వదిలి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకూ ఆయన తిట్లలో ఏమంత ఫ్రస్టేషన్ లేదు. అంతా వ్యూహాత్మకంగానే ఉంది. గమనించారా? ఒక్కోసారి ఆటగాడు.. జట్టులో ఉండాల్సిన అవసరం కూడా లేదు. నాన్ ప్లేయింగ్ కెప్టెన్ గానూ వ్యవహరించవచ్చు. ఎవరు చెప్పగలరు? సాయిరెడ్డి సాయం అదృశ్యమైనది కావచ్చేమో. 2019లో విజయసాయి ఆడియో కాల్ వల్లే ఆ పార్టీ గట్టెక్కిందని గుర్తులేదా? రేపటి రోజున బయట ఉండి ఇలాంటి సాయం చేయరని ఎలా అనుకోగలం.. ఎన్నో అవకాశాలున్నాయ్. ఇవాళ జగన్ తాను పార్టీ నడపడానికి సైతం డబ్బుల్లేవంటూ బీదరుపులు అరవడం.. అద్దె కూడా కట్టలేనంటూ పార్టీ ఆఫీస్ మార్చేయడం.. ఇలా చేస్తున్నదంతా నాటకం కాదని ఎలా చెప్పగలం? ఏమో ఏయే అవసరాలు తీర్చడానికి ఈ రాజకీయాల్లో ఎవరు- ఏ వైపునుంచి- ఎలా కాపు కాచి ఉన్నారో ఊహించలేం కూడా ఒక్కోసారి.
ఒక రోజుకు జగన్.. శాండ్- వైన్- మైన్ అంటూ రోజుకు వెయ్యి(1000) కోట్ల వరకూ వసూలు చేశారని అంటారు ఆ కాంపౌండ్లో కొన్ని కళ్లారా చూసిన- గుంటూరు చార్టెడ్ అకౌంటెంట్లు. కేసిరెడ్డి ద్వారా జగన్ చేయించింది.. నాట్ ఓన్లీ మద్యం కుంభకోణం... హవాలా వ్యవహారం కూడా. కోటి పంపి ఎనభై లక్షలు తిరిగి వచ్చేలా ఒక నెట్ వర్క్ నడిపారంటే.. ఊహించుకోవచ్చు.. ఇది ఎంత పెద్ద స్కెచ్చో. రియల్ ఎస్టేట్, నగల దుకాణాలు, అడ్వర్టైజింగ్ ఏజెన్సీలు, సినిమా ఇలా అన్ని మార్గాల ద్వారా ఈ సొమ్ము ఎవరికి చేరిందో తెలిసిందే.
జగన్ ఇప్పుడు మిథున్ రెడ్డికి ఏం సంబంధం అనగానే ఆనాడు అందుకున్న కట్టల పాములు ఊరుకుంటాయా ఏంటి? వాటి తాలుకూ కస్సు బుస్సులు అడవులను కూడా కొనేసేంత భారీ స్థాయిలో.. బయట పడుతూనే ఉంటాయ్. అందుకే బాబు కడప మహానాడులో అన్నది.. పహల్గాం ఉగ్రవాదులకన్నా ఈ ఆర్ధిక ఉగ్రవాదులు మహా డేంజరని.
తల్లి సాయం లేదు, చెల్లి సాయం అంతకన్నా లేదు.. అనుకోడానికే వీల్లేదు. బావ అనిల్ కూడా సపోర్ట్ ఇవ్వలేదని జస్ట్ లైట్ తీస్కోడానికి అంతకన్నా లేదు. ఆనాడు కేఏ పాల్ క్రిష్టియన్ సంఘాలను పోగేసి.. తద్వారా అతి పెద్ద క్రైస్తవ శక్తిగా ఎదుగుతున్నారని తెలిసి.. అనిల్ అనే ఒక బ్రాహ్మణ క్రిష్టియన్ని తెచ్చి.. తద్వారా ఇక్కడ తన కుటుంబంలో అంటు కట్టి.. ఇప్పుడా బావను అతి పెద్ద క్రిష్టిన్ గా ఎదిగాక.. ఆయనకు మాత్రం ఒక విజయసాయికి ఉన్నట్టు లోలోన ఓ కృతజ్ఞతాభావం ఉండక పోతుందా ఏంటి?
అయిపోయిందనుకున్న చోట నుంచి పుట్టేదేనమ్మా రాజకీయం. ఇది వెయ్యి తలల రాకాసి. అందునా రాజారెడ్డి మనవడు కూడా. ఒకప్పుడు తనదైన ఫాక్షనిజంతో ఒక కాపు మైనింగ్ యజమానికి రక్షణగా నిలుస్తానని మాట ఇచ్చి.. ఆ తర్వాత ఆ మైన్ కే ఓనరైనోడి మనవడు. ఇలాంటి జుజుబీలు ఎన్ని చూసుంటారు? ఏం కథ!
ఇప్పుడు జగన్ ని కానీ ఆయనలాంటి నాయకత్వాన్ని కానీ ఈ భూమ్మీద లేకుండా చేయడం ముఖ్యం కాదు. ఆయన చేసిన విధ్వంసం.. దాని తాలూకూ ప్రభావం ఎలాంటిది? భవిష్యత్ లో దాని ద్వారా ఆంధ్రులు కోల్పోయేది ఏంటన్నది మాత్రమే మనం ఫోకస్ చేయాలి. ఏమో పైకి కూటమి ఇచ్చిన హామీలు ఏమయ్యాయని? అడుగుతూనే లోలోపల ఏ ప్రత్యేక హోదాలాంటి డెడ్ లైన్ పాలిటిక్స్ కి తెరలేపుతున్నారో? డెడ్ డెత్ అనే పదాలు జగన్ కు కలిసి వచ్చినట్టు మరెవరికీ కలసి రావు కూడా!
విలేఖర్లతో తెలిసీ తెలియక ముచ్చట్లాడుతూ.. ఏ రెడ్ లైన్ పాలిటిక్స్ కి తెరలేపుతున్నాడో ఏమో. ఎవరికెరుక? కొన్ని సెటిల్మెంట్ లతో అన్నీ వాటికవే మాఫీ అయిపోవా??? ఇప్పటి వరకూ బయటున్నాడంటే విజయసాయి ఉండటం వల్లే కాదు.. ఇలాంటి విజయాలను, సాయాలను వంద కొనగలడు.. (ఇందాకే అనుకున్నాంగా రోజుకు వెయ్యి కోట్లని) అలాంటోడ్ని తక్కువ అంచనా వేసి... కడపలో జరిపిన మహానాడుతో ఈ విజయం సంపూర్ణం అనుకోడానికి అస్సలు వీల్లేదు.
చిన్నపామునైనా పద్ద కర్రతో కొట్టాలంటారు.. అలాంటిది ఇంకా నలభై శాతం ఓట్ షేర్ అనే ప్రాణంతో ఉన్న పామిది.. నలభై గురూ 40.. దాన్ని మరచిపోవద్దు. దేవాన్ష్ తో ఢిల్లీ తాతయ్య ఎందుకాడుకున్నాడో ఏమో.. ఒక్కోసారి యురోపియన్ సిగ్నల్స్ వేరుగా ఉంటాయ్. మీకు అతి గౌరవం ఇస్తున్నారంటే ఎక్కడైనా ఎప్పుడైనా హ్యాండ్ ఇవ్వడానికేనేమో.. ఎవరికి తెలుసు???
కాబట్టి బాస్ మనం చేయాల్సింది.. జగన్ని అంతం చేయడం కాదు. జనంలో ఉన్న అతడి నమ్మకాన్ని. ఇంతకీ ఏంటా నమ్మకం అంటే, ఆ పల్స్ పట్టుకోవాలి. దాని ద్వారా మొత్తం సెట్ చేయాలి. విజయసాయి కూడా లేడు అని ఓ ఫీలై పోమాకండి. ఆయన చుట్టూ ఉన్న లీడర్లంతా అయితే జైలు, లేదంటే బెయిలు, మరీ మాట్లాడితే వకీళ్లని వాడెవడో రాసాడని రిలాక్స్ అయితే … ఇది రాజకీయం. అందునా.. ఏం చేసైనా.. పై చేయి సాధించాలనుకునే రాజారెడ్డి మార్క్ రాజ్యాంగం. రెడ్ బుక్ ని చూసి వాళ్లంతా జడుసుకుంటున్నారని నీకు నువ్వ బిందాస్ అయిపోకు.. అన్నది కొందరు విశ్లేషకుల నుంచి కూటమినేతలకు అందుతోన్న సూచన. మరి చూడాలి.. దీన్ని కూటమినేతలు ఎలా తీసుకుంటారో తేలాల్సి ఉంది.