సీజేఐగా డీవై చంద్రచూడ్ ప్రమాణ స్వీకారం
posted on Nov 9, 2022 @ 11:11AM
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రమాణ స్వీకారం చేశారు. 50వ సీజేఐగా ఆయన బుధవారం (నవంబర్9) ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. ఆయన ఈ పదవిలో రెండేళ్లు అంటు 2024 నవంబర్ 10 వరకూ కొనసాగుతారు.
రాష్ట్రపతి భవన్ లో జరిగిన సీజేఐ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితరులు హాజరయ్యారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పలు కీలక కేసుల తీర్పులను వెలువరించిన జస్టిస్ చంద్రచూడ్ తండ్రి వైవీ చంద్రచూడ్ కూడా సీజేఐగా బాధ్యతలు నిర్వహించారు. దేశంలో అత్యంత ఎక్కువ కాలం పని చేసిన సీజైఐగా వైవీ చంద్రచూడ్ రికార్డు సృష్టించారు. ఆయన దాదాపు ఏడేళ్ల పాటు సీజేఐ పదవిలో ఉన్నారు.
ఇక జస్టిస్ డీవై చంద్రచూడ్ విషయానికి వస్తే అయోధ్య భూవివాదం కేసు, వ్యక్తిగత గోప్యత హక్కు కేసు, శబిరమల ఆలయంలోకి మహిళల ప్రవేశం, ఆధార్ చెల్లుబాటు వంటి కేసుల తీర్పు వెలువరించిన ధర్మాసనాల్లో ఆయన కూడా ఉన్నారు. 1959 నవంబర్ 11న జన్మించిన జస్టిస్ డీవై చంద్రచూడ్.. సుప్రీం కోర్టులో, బోంబే హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు.
1998 జూన్‌లో బోంబే హైకోర్టులో సీనియర్ న్యాయవాది హోదా పొందారు. అదే ఏడాది భారత అదనపు సొలిసిటర్ జనరల్‌గా నియమితులయ్యారు. 2000 మార్చి 29న బోంబే హైకోర్టు న్యాయమూర్తి అయ్యారు. 2 013 అక్టోబరు 31న అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2016 మే 13న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు.