ఇంకా ఎన్ని రోజులు?
posted on Sep 22, 2023 @ 12:46PM
కారణాలేమైతేనేం కోర్టుల్లో వ్యాజ్యాలు తేలడానికి తీవ్ర జాప్యం జరుగుతోంది. ఆ విషయంలో ఎవరికీ మరో అభిప్రాయం ఉండే అవకాశం లేదు. అదే సమయంలో అరెస్టులు, కేసుల నమోదు నిబంధనలను, పద్ధతులు పాటించకుండా అడ్డగోలుగా జరిగిపోతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో అక్రమంగా అరెస్టయిన వారి పరిస్థితి ఏమిటి? కోర్టుల నిర్ణయం వెలువడే వరకూ కారాగారంలో ఎదురు చూడాల్సిందేనా? రిమాండ్ లో.. అది శిక్ష కాకపోయినా ఎంతకాలమైనా వేచి చూడాల్సిందేనా?
చంద్రబాబును స్కిల్ కేసులో అక్రమంగా అరెస్టు చేసిన నాటి నుంచీ అందరిలోనూ వ్యక్తమౌతున్న అనుమానాలూ సందేహాలూ ఇవే. ఎందుకంటే చంద్రబాబును స్కిల్ కేసులో కనీసం ఆయన పేరు కూడా ఎఫ్ ఐఆర్ లో లేకపోయినా అర్థరాత్రి అరెస్టు చేశారు. న్యాయం కోసం ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్లపై తీర్పులు వెలువడడం లేదు. వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తికే ఇటువంటి పరిస్థితి ఉంటే ఇక సామాన్యుల గతేమిటన్న భయం జనబాహుల్యంలో వ్యక్తం అవుతోంది.
గత నాలుగున్నరేళ్లకు పైగా జైలులో మగ్గుతున్న కోడికత్తి నిందితుడి శ్రీను పరిస్థితిని ఉదహరిస్తున్నారు. ఈ కేసులో బాధితుడిగా కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇవ్వాల్సిన జగన్.. అందుకు సిద్ధంగా లేరు. కేసును మరింత లోతుగా విచారించాలంటూ పిటిషన్లు వేస్తూ.. కోర్టుకు మాత్రం ముఖం చాటేస్తున్నారు. అదే సమయంలో ఆయన ఏ1గా ఉన్న అక్రమాస్తుల కేసులో గత పదేళ్లుగా బెయిలుపై ఉన్నారు. ముఖ్యమంత్రిని కనుక విచారణకు హాజరు కాకుండా మినహాయింపు పొందారు. ఆయన ఆ కేసులో బెయిలు పొంది దశాబ్దకాలం గడిచిపోయింది. ఆ కేసుల విచారణ ఏ స్థాయిలో ఉందో.. ఎప్పుడు విచారణ జరుగుతోందో కూడా ఎవరికీ తెలియని పరిస్థితి. జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ, సీబీఐల దర్యాప్తులో పలు ఆధారాలు స్పష్టంగా లభించాయి. ఆ కేసుకు సంబంధించి ఆస్తుల జప్తు కూడా జరిగింది. కానీ చంద్రబాబుపై కేసు విషయంలో సీఐడీ ఆయనకు నోటీసులు ఇవ్వలేదు. ఆయన పాత్రను ఎస్టాబ్లిష్ చేసే సాక్ష్యాలను కూడా చూపలేదు. కనీసం అరెస్టు చేసే నాటికి ఎఫ్ఐఆర్ లో ఆయన పేరు కూడా లేదు. అయినా రాత్రికి రాత్రి అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్ కు తరలించింది. చంద్రబాబు దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ కు కౌంటర్ దాఖలు చేసేందుకు వారం రోజులు గడువు కోరింది.
ఇప్పుడు స్కిల్ కేసులో చంద్రబాబు పాత్రను ఎస్టాబ్లిష్ చేయడానికి ఆయన కస్టడీ కోరుతోంది. కస్టడీలోకి తీసుకుని విచారించి ఆధారాలను సేకరిస్తామని సీఐడీ చెబుతోంది. చంద్రబాబు రిమాండ్ గడువు పూర్తయిపోయింది. దీంతో కోర్టు ఆయన రిమాండ్ ను రెండు రోజులు పొడిగించింది. చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ పూర్తయ్యింది. తీర్పు రిజర్వ్ అయ్యింది. నేడు, రేపు అంటూ ఆ తీర్పు కోసం ఎదురు చూపుల పర్వం కొనసాగుతోంది. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తెలుగురాష్ట్రాలలోనే కాదు.. జాతీయ స్థాయి సహా ప్రపంచ దేశాలలోనూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై తీర్పు రాకముందే ఏపీ మంత్రులు అసెంబ్లీ వేదికగా చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని ప్రకటనలు చేసేస్తున్నారు. కోర్టులో ఉన్న అంశాలపై సభ వేదికగా ప్రసంగాలు దంచేస్తున్నారు. జస్టిస్ డిలైడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అంటారు.. మరి స్కిల్ స్కాం అంటూ చంద్రబాబును అరెస్టు చేసి రెండు వారాలు పూర్తయినా ఇంకా ఆయన పిటిషన్లపై తీర్పులు వెలువడేందుకు ఎదురు చూసే పరిస్థితి రావడాన్ని ఏమంటారు?