జూయన్టీఆర్ ని అందుకే దూరం పెడుతున్నారా?
posted on Apr 13, 2014 @ 3:58PM
ఈసారి జూ.యన్టీఆర్, ఆయన తండ్రి హరికృష్ణ ఇద్దరినీ కూడా చంద్రబాబు పూర్తిగా పక్కనపెట్టేసినట్లేనని నారా లోకేష్ తాజా వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. ఆయన కృష్ణా జిల్లాలో మొదలుపెట్టిన యువ ప్రభంజనం యాత్రలో మీడియాతో మాట్లాడుతూ “బాలకృష్ణతో సహా మేమేవరినీ ప్రత్యేకంగా ఆహ్వానించలేదు. కానీ అందరూ కూడా పార్టీని తమదిగా భావించి తామంతట తామే స్వయంగా వచ్చి పార్టీ ప్రచారంలో పాల్గొంటున్నారు. అందువల్ల జూ.యన్టీఆర్ ని పార్టీ ప్రచారంలో పాల్గొనమని ప్రత్యేకంగా ఆహ్వానించనవసరం లేదని నేను భావిస్తున్నాను,” అని అన్నారు.
నాలుగు రోజుల క్రితం చంద్రబాబు కూడా ఇంచుమించు ఇదేవిధంగా మాట్లాడారు. ఇప్పుడు ఆయన కొడుకు నారా లోకేష్ అదే విధంగా చెప్పడం గమనిస్తే వారిరువురికి కూడా ఈసారి ఎన్నికల ప్రచారానికి జూ.యన్టీఆర్ ని ఆహ్వానించే ఆలోచనలేదని స్పష్టమవుతోంది. అయితే అందుకు చాలా బలమయిన ఉందనిపిస్తోంది.
హరికృష్ణ తన కొడుకు జూ.యన్టీఆర్ ని తేదేపాలో ముందుకు తీసుకువెళ్లాలని ప్రయత్నించినప్పుడు, చంద్రబాబు నాయుడు తన వియ్యంకుడు బాలకృష్ణ సహకారంతో తన కొడుకు నారా లోకేష్ ని తన రాజకీయ వారసుడిగా, తేదేపాకు భావి అధినేతగా ఎదిగేందుకు చాలా గట్టి ప్రయత్నాలే చేసిన సంగతి అందరికీ తెలిసిందే. జూ.యన్టీఆర్ కి తన సినీరంగంపై తప్ప పార్టీ రాజకీయాలపై ప్రత్యేక ఆసక్తి ఏమీ లేకపోయినప్పటికీ, గత ఎన్నికలలో తాత స్వర్గీయ యన్టీఆర్ ను మరిపించేలా అలవోకగా సాగిన అతని వాగ్ధాటి, వేష బాషలు, ప్రచారశైలీ అన్నీ కూడా అతనే స్వర్గీయ యన్టీఆర్ కు నిజమయిన వారసుడు అని ప్రజలు, పార్టీ కార్యకర్తలు కూడా భావించేలా చేసింది.
బహుశః అప్పటి నుండే చంద్రబాబు క్రమంగా, ఆయన భాషలో చెప్పాలంటే ఒక పద్ధతి ప్రకారం జూ.యన్టీఆర్ ని దూరం పెడుతూ వచ్చేరు. ఆ తరువాత వారి మధ్య వైకాపా ఫ్లెక్సీ బ్యానర్లతో అడ్డుగా పరదాలు కట్టడంతో, హరికృష్ణ, జూ.యన్టీఆర్ క్రమంగా తేదేపాకు దూరమయ్యారు. అది జూ.యన్టీఆర్ సినీ జీవితంపై కూడా విపరీతమయిన ప్రభావం చూపడంతో ఆ దూరం మరింత పెరుగుతూ వచ్చింది. అయితే కాగల కార్యం గందర్వులే తీర్చారన్నట్లుగా, జూ.యన్టీఆర్ తనంతట తానే పార్టీకి దూరం అయినప్పుడు మళ్ళీ అతనిని ఇప్పుడు పార్టీ ప్రచారం కోసం ఆహ్వానించడమెందుకు, మరుగున పడిన పార్టీ వారసత్వ సమస్యని కెలుక్కోవడమెందుకనే ఉద్దేశ్యంతోనే బహుశః వారిరువురూ ఆవిధంగా మాట్లాడుతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.