జూ.ఎన్టీఆర్ కు బాలయ్య వార్నింగ్, ఫ్లెక్సీలపై స్పందించాలి
posted on Apr 6, 2013 @ 11:55AM
వైకాపా మొదలుపెట్టిన ఫ్లెక్సీ బ్యానర్ యుద్దంలోకి ఇప్పుడు బాలకృష్ణ కూడా ప్రవేశించారు. వైకాపా యన్టీఆర్ ఫోటోలు వాడుకోవడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు. ఆ పార్టీ నేతల ఫోటోలు బ్యానర్లలో పెట్టుకొంటే ఓట్లు రాలవనే ఆలోచనతోనే వారు యన్టీఆర్ ఫోటోలు వాడుకొంటున్నట్లున్నారని ఆయన అన్నారు. ఈ విషయంలోజూ.ఎన్టీఆర్ వెంటనే స్పందించవలసి ఉందని, లేకుంటే దాని పరిణామాలు వేరేలా ఉంటాయని అన్నారు. నిత్యం సినిమా షూటింగు హడావుడిలో ఉండే జూ.ఎన్టీఆర్ కి ఒకవేళ ఇక్కడ జరుగుతున్న సంగతులు తెలియకపోవడం వలన ఆయన స్పందించకపోయి ఉంటే, తానూ ఆయనతో మాట్లాడుతానని, ఈ విషయాలు అన్నీ తెలిసి కూడా స్పందించకపోయి ఉంటే ఆయన తను ఏ పార్టీలో ఉన్నారో స్పష్టం చేయాలనీ అన్నారు.
కొడాలి నాని తెదేపా నుండి వెళ్ళిపోయిన తరువాత పార్టీలో అందరూ చాల సంతోషించారని, ఆయన వెళ్ళిపోవడం వలన పార్టీకి వచ్చిన నష్టం ఏమిలేదని అన్నారు. తానూ జూ.ఎన్టీఆర్ కు సహకరించవద్దని ఎన్నడూ ఎవరికీ ఆదేశాలు జారీ చేయలేదని, అవన్నీ ఊహాగానాలేనని ఆయన అన్నారు. ఇక పార్టీ నాయకత్వం విషయంలో కూడా భిన్నాభిప్రాయాలకు తావు లేదని, వచ్చే ఎన్నికల తరువాత కూడా చంద్రబాబు నాయుడి సారద్యంలోనే అందరూ పనిచేస్తారని ఆయన అన్నారు. రాష్ట్ర రాజకీయాలలోకి ప్రవేశించాలని ఆలోచిస్తున్న జయప్రద తమ పార్టీలో చేరాలనే ఆలోచన కనుక ఉంటే తనను సంప్రదిస్తే విషయాన్ని పార్టీ దృష్టికి తీసుకుని వెళ్తానని ఆయన చెప్పారు. త్వరలోనే తానూ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశిస్తానని తెలిపారు. రెండు రోజుల కృష్ణా జిల్లా పర్యటన కోసం తిరువూరు నియోజకవర్గంలోని కొమరోలు వచ్చిన బాలకృష్ణ ఈ రోజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈ విషయాలు ప్రస్తావించారు.
ఇప్పటికయినా బాలకృష్ణ మీడియా ముందుకు వచ్చి ఖండించడం బాగానే ఉన్నపటికీ, ఆయన జూ.ఎన్టీఆర్ ప్రస్తావన వచ్చినప్పుడు ఈ విధంగా కొంచెం కరుకుగా మాట్లాడటం చూస్తే, జూ.ఎన్టీఆర్ కి ఈ విషయాలు తెలిసినా ఖండించట్లేదని ఆయన కూడా అభిప్రాయపడుతున్నట్లు ఉంది. ఆయన ఆవిధంగా భావించడంలో తప్పులేదు. ఈ రోజుల్లో ప్రపంచంలో ఏమూల ఏమి జరిగిన క్షణాలలో ఆ సమాచారం అందరికీ తెలుస్తున్నపుడుజూ.ఎన్టీఆర్ కి వైకాపా ఆడుతున్న ఆట గురించి తెలియదని భావించలేము. అందుకే బాలకృష్ణ కొంచెం తీవ్ర స్వరంతోనే మాట్లాడవలసి వచ్చింది. ఇక, జూ.ఎన్టీఆర్ వైకాపా పై విరుచుకుపడతారో లేకపోతే వేరేమయినా సమాధానం చెప్పబోతున్నారో త్వరలోనే తేలిపోవచ్చును.
ఇక, వైకాపా తన ఫ్లెక్సీ బ్యానర్ బాణాలను సరిగ్గా గురిచూసి కొట్టినట్లే కనిపిస్తోంది. ఒక దెబ్బకి రెండు పిట్టలు కొట్టినట్లు. తెదేపాలో ఆశించిన విదంగా చిచ్చుపెట్టడమే కాకుండా, పార్టీలో జూ.ఎన్టీఆర్ ఒంటరి అయిపోయాడనే భావన ఆయన అభిమానులలో బాగా వ్యాపింపజేయగలిగింది.ఆ ప్రయత్నంలో భాగంగానే నిన్న విడుదల అయిన బాద్షా సినిమా విజయవంతం అయినందుకు జూ.ఎన్టీఆర్ అభిమానులతో సమానంగా వైకాపా కూడా సంబరాలు చేసుకొంది. తద్వారా జూ.ఎన్టీఆర్ కి తెదేపా మద్దతు ఈయకపోతే తాము మద్దతుగా ఉంటామని స్పష్టంగా సందేశం పంపగలిగింది. గమ్మతయిన విషయం ఏమిటంటే, తెదేపాలో ఉన్న జూ.ఎన్టీఆర్ అభిమానుల హడావుడి ఎక్కడా కనబడలేదు.