నారా లోకేష్ కి లైన్ క్లియర్ చేసిన జూనియర్ ఎన్టీఆర్
posted on Jan 18, 2013 @ 9:32PM
స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి వర్ధంతి తెలుగు దేశం పార్టీకి ఒక శాపాన్ని, ఒక వరాన్నిఅందించింది. నందమూరి వారి అర్ధాంగి శ్రీమతి లక్ష్మీ పార్వతి తెలుగుదేశo పార్టీ వచ్చే ఎన్నికలలో ఉనికి కోల్పోతుందని శాపానార్ధాలు పెట్టగా, జు.యన్టీఆర్ స్వయంగా తనకు ఇప్పుడప్పుడే రాజకీయాలలో చేరాలని ఆసక్తి లేదని విస్పష్టంగా ప్రకటించి, తెలుగు దేశం పార్టీలో అతనికి అన్యాయం జరుగుతోందనే ప్రచారానికి అడ్డుకట్ట వేసాడు.
బాబాయి బాలకృష్ణ తో కలిసి వచ్చి తాతగారికి యన్టీఆర్ ఘాట్ లో నివాళులు అర్పించిన తరువాత జు.యన్టీఆర్ మీడియా వారితో మాట్లాడుతూ, తన మొదటి ప్రాముఖ్యత సినిమా రంగానికేనని, రాజకీయాలలోకి రావడానికి ఇంకా చాలా సమయం ఉన్నందున, ప్రస్తుతం తన సినిమాలపైనే లగ్నం చేయలనుకొంటున్నట్లు చెప్పాడు. అయితే, ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలలో పాల్గోనలేకపోయినప్పటికీ, ఎన్నికల సమయంలో తప్పనిసరిగా పార్టీ తరపున ప్రచారంలో పాల్గొంటానని తెలిపాడు.
తద్వారా, ఇంతవరకు అతనిని పార్టీలోకి రాకుండా చంద్రబాబు, లోకేష్ అడ్డుకొంటున్నారనే అపవాదును తనే స్వయంగా ఖండించి పార్టీలో తనకి ఎవరితో విభేదాలు లేవని స్పష్టం చేసాడు. ఈ విధంగా అతను ప్రకటించడంవల్ల పార్టీలో అంతర్గత కుమ్ములాటలు లేవనే విషయాన్నీ తెలియజేయగలిగేడు.
ఇటీవల కాలంలో పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్న నారా లోకేష్ కు ఇది కలిసొచ్చే అంశం గా చెప్పవచ్చును. ప్రస్తుతం జు.యన్టీఆర్ అతనితో పోటీ పడబోవట్లేదు గనుక ఇక నారా లోకేష్ పార్టీ కార్యక్రామలపై పూర్తి శ్రద్ధ పెట్టి పనిచేయవచ్చును.