తెలంగాణ కాంగ్రెస్ రేసు గుర్రం రేవంత్
posted on Jun 25, 2022 @ 1:58PM
తెలంగాణ రాజకీయాలలో మార్పులు విస్పష్టంగా గోచరిస్తున్నాయి. కొద్ది రోజులుగా తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. దుబ్బాక అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించడం, అనంతరం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్లుగా బీజేపీ అభ్యర్థులు ఎక్కువ మంది గెలవడం, హుజూరాబాద్ ఉప ఎన్నికలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ విజేతగా నిలవడంతో అధికార టీఆర్ఎస్- బీజేపీ మధ్య రాజకీయంగా నువ్వా నేనా అనే పోటీ నెలకొందన్న భావన రాష్ట్ర వ్యాప్తంగా వ్యక్తమైంది.
కానీ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టినప్పటి నుంచీ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం వేగంగా మార్పులు చెందింది. కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే క్షేత్ర స్థాయిలో ఉన్న కార్యకర్తల బలానికి తోడు బలమైన నాయకులు కూడా ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ గూటికి చేరడానికి క్యూ కట్టడం ఆరంభమైంది. నెల రోజుల క్రితమే టీఆర్ఎస్ నుంచి నల్లాల ఓదెలు, ఆయన సతీమణి కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ సమక్షంలో పార్టీలో చేరడం, మొన్నటికి మొన్న ఖైరతాబాద్ టీఆర్ఎస్ కార్పొరేటర్ విజయారెడ్డి స్వగృహ ప్రవేశం అంటూ కాంగ్రెస్ లోకి మళ్లీ వచ్చి చేరడం, తాజాగా ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేత తాటి వెంకటేశ్వర్లు, మరి కొందరు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించడం ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. సాధారణంగా విపక్షాల నుంచి నేతలు అధికార పార్టీ కండువా కప్పుకుంటారు.
అయితే.. రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ అయిన తర్వాత అధికార టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరగడం విశేషం. అందుకు రేవంత్ రెడ్డి పార్టీ పరంగా తీసుకుంటున్న కార్యక్రమాలే కారణం అంటున్నారు. ఒక పక్కన టీఆర్ఎస్ తో, సీఎం కేసీఆర్ తో సై అంటే సై అంటూ బీజేపీ నేతలు తలపడుతున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు బీజేపీయే ప్రత్యామ్నాయం అని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. పీఎం మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు కేంద్ర మంత్రులు కూడా వరుస పెట్టి తెలంగాణలో పర్యటిస్తున్నారు. మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పలువురు గతంలో బీజేపీ తీర్థం తీసుకున్నారు. దీంతో తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అనే రీతిలో రాజకీయం నడిచింది. అయితే కాంగ్రెస్ మాత్రం టీపీసీసీ చీఫ్ గా రేవంత్ కు ముందొక లెక్క.. తరువాత ఓ లెక్క అన్నట్లు దూసుకుపోతోంది. కాంగ్రెస్ శ్రేణులు రేవంత్ వచ్చాడు, రేవంత్ వచ్చాడని తెలుసుకోండి అంటూ ప్రత్యర్థులకు సవాళ్లు విసురుతున్నారు.
టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుంటోందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. సీనియర్ నేతల నుంచి ఆశించిన మేరకు మద్దతు, తోడ్పాటు లేకపోయినా రేవంత్ రెడ్డి వరుసగా కార్యక్రమాలు చేసుకుంటూ తనదైన శైలిలో రాష్ట్రంలో కాంగ్రెస్ ను బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోష్ బాగా పెరిగింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీలోకి వలసల జోరు అందుకుంది. అధికార టీఆర్ఎస్ లో సీనియర్ నేత, చెన్నూరు నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నల్లాల ఓదేలు రేవంత్ రెడ్డితో కలిసి ఢిల్లీ వెళ్లి మరీ ప్రియాంకా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పీఠం ఆశించి భంగపడ్డిన విజయారెడ్డి తాజాగా రేవంత్ రెడ్డితో చర్చించి, హస్తం గూటికి చేరిపోయారు. విజయారెడ్డి కాంగ్రెస్ లో చేరడాన్ని ఆ పార్టీ నేతలు స్వాగతించారు. ఓదేలుకు, విజయారెడ్డికి బీజేపీ ముందే ఆహ్వానం పలికిందట. కానీ వారు బీజేపీ ఆహ్వానాన్ని కాదని కాంగ్రెస్ లో చేరడం విశేషం. ఉమ్మడి ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కారుకు గుడ్ బై చెప్పి హస్తాన్ని అందుకుంటానని ప్రకటించేశారు. పినపాక నియోజకవర్గం కరకగూడెం జెడ్పీటీసీ కాంతారావు కూడా రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.
రాజకీయాల్లో రేవంత్ రెడ్డి ఓ ఫైర్ బ్రాండ్. అధికార టీఆర్ఎస్ వైఫల్యాల్ని తనదైన స్టైల్ లో ఎండగడుతున్నారు. టీఆర్ఎస్ సర్కార్ ను ఇరుకున పెట్టడంలో ఏ చిన్న ఛాన్స్ నీ ఆయన మిస్ అవడం లేదు. టీఆర్ఎస్ లోని అసంతృప్త నేతలతో రేవంత్ రెడ్డి టచ్ లో ఉన్నారని కారు పార్టీ వర్గాలే చెబుతున్నాయంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. పార్టీ అధిష్టానం స్వేచ్ఛ ఇవ్వడంతో రేవంత్ రెడ్డి రేసు గుర్రంలా దూసుకుపోతున్నారంటున్నారు. ఈ క్రమంలోనే తాటి వెంకటేశ్వర్లుకు, విజయారెడ్డికి ఎమ్మెల్యే టికెట్లు ఇస్తానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
తెలంగాణలో సమస్యలపై పోరాటం విషయంలో రేవంత్ రెడ్డి దూసుకుపోతుంటే.. బీజేపీ నేతలు ఒకింత వెనుకబడినట్లు పరిస్థితి కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. కాంగ్రెస్ తరఫున కార్యక్రమాలు నిర్వహించడంలో, ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించడంలో రేవంత్ రెడ్డి దూకుడు ప్రదర్శిస్తున్నారు. బీజేపీలో చేరితే టికెట్ వస్తుందో రాదో అన్న క్లారిటీ లేని పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ కండువా కప్పుకుంటే మేలని టీఆర్ఎస్ అసంతృప్త నేతలు భావిస్తున్నరు. రేవంత్ రెడ్డి సారథ్యంలో మరికొందరు టీఆర్ఎస్ నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.