ఉగ్రవాదుల మీద ప్రతీకారం
posted on Feb 4, 2015 @ 11:17AM
ఈమధ్యకాలంలో ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్ - ఇసిస్) ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. తమకు దొరికిన వివిధ దేశాలకు చెందిన బందీల తలలు నరికి వాటిని ఇంటర్నెట్లో పోస్ట్ చేస్తున్నారు. వీళ్ళ వీరోచిత కార్యాలకు ఆకర్షితులవుతున్న అనేకమంది ఇందులో చేరడానికి ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. ఇప్పటి వరకూ ఈ తీవ్రవాదులే జనాన్ని చంపుతూ వచ్చారు. తాజాగా జోర్డాన్ ప్రభుత్వం ఈ సంస్థకు చెందిన ఇద్దరు తీవ్రవాదుల్ని చంపేసింది. చంపడం అనేది తమకూ వచ్చని జోర్డాన్ ప్రభుత్వం ఈ ఘటన ద్వారా తీవ్రవాదులకు హెచ్చరికలు పంపింది. ఇసిస్ తీవ్రవాదులు 2013లో జోర్డాన్‌కి చెందిన మోజ్ అల్ కసస్ బెహ్ అనే పైలెట్‌ని బంధించి మంగళవారం నాడు దారుణంగా హత్య చేశారు. ఆ పైలెట్‌ని ఓ బోనులో పెట్టి మీద పెట్రోలు పోసి నిప్పు అంటించారు. ఈ వీడియోను ఇంటర్నెట్‌లో పెట్టారు. ఈ కేసులో పట్టుబడిన ఇద్దరు తీవ్రవాదులు జోర్డాన్ ప్రభుత్వం అధీనంలోనే వున్నారు. మంగళవారం నాడు వీళ్ళిద్దర్నీ జోర్డాన్ ప్రభుత్వం ఉరితీసి చంపింది. ఇకమీదట తమకు పట్టుబడిన ఏ తీవ్రవాదినైనా ఎలాంటి విచారణ లేకుండా ఉరి తీసి చంపేస్తామని జోర్డాన్ ప్రభుత్వం హెచ్చరించింది.