తెలుగుదేశంలోకి దండు యాత్ర.. జర జాగ్రత్త!
posted on Jan 4, 2024 8:28AM
ఎన్నికలు సమీపిస్తున్నాయి. అలాంటి సమయంలో.. ఓ రాజకీయ పార్టీలో నుంచి మరో పార్టీలోకి గాలి వాటం నేతలు.. అంటే అయారాం.. గయారాంలు మళ్లీ... పార్టీ కండువా మార్పిడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు కదం తొక్కుతున్నారు. ఇప్పటికే అలాంటి దండు.. మిడతల దండులా దూసుకొస్తున్నదని.. అలాంటి వారి పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని లేకుంటే.. తెలుగుదేశం పార్టీ మళ్లీ పూర్వ స్థితిలోనే కొనసాగే అవకాశముందని.. తెలుగుదేశం శ్రేణుల్లో ఆందోళనగా వ్యక్తమవుతోంది.
ఎందుకంటే.. 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించడంతో తెలుగుదేశం ప్రతిపక్షానికే పరిమితమైంది. గతంలో అంటే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషించినా.. ఏనాడు పడని ఇబ్బంది.. విభజిత ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం ఎదుర్కొంది. పార్టీ అధినేత చంద్రబాబు నుంచి కింద స్థాయి కార్యకర్తవరకూ జగన్ పార్టీ వేధింపులను ఎదుర్కొన్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే జగన్ ముఖ్యమంత్రి గా అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ప్రజా వేదిక కూల్చివేత నుంచి.. స్కిల్ కేసులో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయడం వరకూ సీఎంగా జగన్ చేసిన ప్రతి పనీ విపక్షాన్ని వేధించడమే లక్ష్యంగా సాగింది.
తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోని.. రాజకీయ ఓనమాలు దిద్దుకొన్న కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి వాళ్లు.. జగన్ పార్టీలో చేరిన తర్వాత చంద్రబాబుతోపాటు ఆయన ఫ్యామిలీపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఇదంతా జగన్ ప్రోద్బలంతోనే, ఆయన ఆదేశాలతోనే జరిగిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వీరిద్దరే అని కాదు.. జగన్ తొలి, మలి కేబినెట్‌లోని మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, వెల్లంపల్లి శ్రీనివాసరావు, అంబటి రాంబాబు, జోగి రమేష్, ఆర్కే రోజా ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంటుంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్‌పై రకరకాలుగా వ్యంగ్య బాణాలు సంధించారు.. అయితే ఆ సమయంలో ఇలా మాట్లాడడం తప్పు.. చాలా పెద్ద తప్పు.. రాజకీయాన్ని రాజకీయంగా ఎదుర్కొండి.. అంతేకానీ.. వారి ఫ్యామిలీని ఇలా కించ పరచడం.. ఇంట్లో వారిని బయటకు లాగడం ద్వారా రాజకీయ లబ్ది పొందడం చాలా దారుణమంటూ.. ఇకపై ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దంటూ.. ఫ్యాన్ పార్టీలో అగ్రనేతలు కానీ... ప్రజాధనాన్ని లక్షలకు లక్షలు జీతాలుగా తీసుకుంటున్న సలహాదారులు కానీ.. ఒక్క మాట చెప్పిన పాపాన పోలేదు. అలాగే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నుంచి ఆ పార్టీలోని సాధారణ కార్యకర్త వరకు అందరిపైనా పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయి. అలాంటి సమయంలో సైతం.. అధికారం అనేది ఎవరికీ శాశ్వతం కాదని.. నేడు అధికారం మీ వద్ద ఉంటే.. రేపు మరో పార్టీ పరం అవుతుందని.. అలాంటి పరిస్థితుల్లో.. ఆచి తూచి వ్యవహరించాల్సి ఉంటుందని.. ఇంకా చెప్పాలంటే.. రేపు ఇదే పరిస్థితి మనకు మన పార్టీలోని వారికి ఎదురైతే.. మన పరిస్థితి ఎలా ఉంటుందో ఓ ఆలోచన చేయాలని సూచించాల్సిన పెద్దలు.. జగన్ పార్టీలో లేరని.. ఎవరైనా ఉన్నా వారు మౌనముద్రే వహించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే దాదాపుగా ఇదే విషయాన్ని గతంలో అంటే.. మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకల వేదికగా.. ఆయన ముఖ్య అనుచరుడు సుబ్బారావు గుప్తా.. ప్రస్తావించి.. సదరు ఎమ్మెల్యే గారి ప్రధాన అనుచరుడు సుభానీ చేతిలో గుప్తాకు తకదిన తోం తకదిన తోం జరిగిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.
ఇక టోటల్‌గా చెప్పోచ్చేదేమిటంటే.. అధికార వైసీపీ నుంచి వచ్చేసిన వారు.. వస్తున్న వారు.. రావాలనుకుంటున్న వారు.. గతంలో వారు తెలుగుదేశంలో ఉన్నవారైనప్పటికీ పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు.. ఎలా వ్యవహరించారన్న విషయాన్ని గమనించాలని.. లేకుంటే అలాంటి వారు .. పార్టీలోకి మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడం వల్ల... పార్టీలో జెండా కర్రలాగా పాతుకుపోయిన అసలు సిసలు నేతల నుంచి శ్రేణుల వరకు హోల్ సేల్‌గా దెబ్బయిపోతారని.. ఎందుకంటే.. ఈ సారి ఎన్నికల్లో పార్టీ గెలిచినా.. భవిష్యత్తులో ఓ వేళ మళ్లీ ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వస్తే.. ఇలా పార్టీలు మారే అయారాం గయారాంలు.. ఇట్టే గోడలు దూకేస్తారని.. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో వచ్చిన వారు ఎవరు, మన వాడా, మన బాగు, పార్టీ బాగు కోరే వాడా? కాదా? వాడిలో లేశమంత అయినా .. నీతి నిజాయితీ గట్రా లాంటివి ఏమైనా ఉన్నాయా? లేదా... అనేవి పరిశీలించాలని.. పార్టీ అధినాయకత్వానికి హార్డ్ కోర్ ఫ్యాన్స్ సూచిస్తున్నారు. అలా కాకుంటే.. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంటే.. ఆ పార్టీ కుండువా కప్పుకొని.. ఆ పార్టీ రంగు చొక్కా తొడుక్కొని.. పండగ వేళ.. చందాల కోసం వచ్చిన.. వస్తున్న బాపతు లాంటి వాళ్లా అన్నా ఆలోచన చేయాలని పార్టీలోని కీలక నేతలకు సైకిల్ పార్టీ శ్రేణులు ఓ సూచన చేస్తోంది.