కన్హయ్య కుమార్‌కు వీఐపీ సెక్యూరిటీ..!
posted on Apr 15, 2016 @ 12:50PM
ఢిల్లీ జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్య కుమార్ ఆ వివాదం తరువాత రాత్రికి రాత్రి స్టార్ అయిపోయాడు. అతను ఎక్కడికి వెళ్లినా సరే జనం తరలివస్తున్నారు. దాంతో పాటే ఆయన్ని అడ్డుకోవడానికి పలు వర్గాలు కూడా పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో కన్హయ్య కుమార్, ఉమర్ ఖలీద్ ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీలో పాల్గోన్న వారిని ఉద్దేశిస్తూ వారిద్దరూ ప్రసంగిస్తుండగా వారిపై చెప్పులు, బూట్లతో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. అంతేకాకుండా కన్హయ్య కుమార్‌కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అంతకు ముందు నాగపూర్‌లో ర్యాలీలో పాల్గొనేందుకు వస్తున్న కన్హయ్యకుమార్ వాహనశ్రేణిని భజరంగ్ దళ్ కార్యకర్తలు అడ్డుకుని గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. భజరంగ్ దళ్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని స్టేషన్‌కు తరలించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. లేదంటే అక్కడ భారీ ఘర్షణ చోటు చేసుకునేది. వరుస సంఘటనల నేపథ్యంలో కేంద్రప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కన్హయ్య కుమార్‌కు వీఐపీ సెక్యూరిటి కల్పించాలని నిర్ణయించింది. ఆయనతో పాటు ఉమర్ ఖలీద్‌ల ఇంటి వద్ద వారు పాల్గొనే వేదికల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించింది.