చెక్కు చెదరని స్నేహ బంధం!
పదవిలో ఉన్నవాళ్లు, మరీ ముఖ్యంగా దేశాధిపతులు ఏదైనా చేయగలరన డానికి తాజా ఉదాహరణ శుక్రవారం (డిసెంబర్ 5) భారత్ పర్యటనకు వచ్చిన రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన. సాక్షాత్తు రష్యా అధినేత బయలుదేరాడంటే "రాజు వెడలె,రవితేజములరరగా" అన్నట్లు వందిమాగధులు, రక్షకసముదాయం బయలుదేరుతారు ఆయన రక్షణకు ఐదంచల వ్యవస్థ ఉంటుంది.ఆయన ప్రయాణం చేసేది విమానంలో అయినా కెమ్లిన్ లోలాగా అన్ని సౌకర్యాలు ఉంటాయి.అలాగే ఆయన వెంట అదే తరహా మరో విమానం కూడా ఉంటుంది.ఆయన ఏ విమానంలో ప్రయాణిస్తారనేది తెలియకుండా ఉండడం కోసం ఈ ఏర్పాటు. ఆయన తినే ఆహారాన్ని పరిరక్షించే చిన్నసైజు ల్యాబ్ ,వ్యక్తిగత వంటవాడు కూడా ఉంటారు. ఆయన పండ్ల రసాలు,మాంసాహారం తీసుకుంటారు. భద్రతకు సంబంధించి ఇంతటి జాగ్రత్తలు అగ్రరాజ్యాధినేత తరువాత రష్యా అధ్యక్షుడి విషయంలోనే ఉంటాయి.
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తున్నందున అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మన దేశంపై టారిఫ్ వార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. .భారత్ వచ్చిన పుతిన్ భారత్,రష్యా మధ్య చమురు ఒప్పందానికి ఎలాంటి విఘాతం కలగదని హామీ ఇచ్చారు.అలాగే మరో ఐదేళ్లపాటు అమలులో ఉండే ఆర్ధిక ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. పుతిన్ పర్యటన సందర్భంగా 11 ఒప్పందాలు జరిగాయి. అలాగే రష్యా,భారత్ ఒప్పందాలపై చైనా హర్షం వ్యక్తం చేసింది. ఏకధృవ ప్రపంచంలో భారత్, రష్యా,చైనాల మైత్రి నిస్పందేహంగా అమెరికాకు కంటగింపే. .భారత్, చైనా,రష్యా ఒకటిగా ఉంటే అమెరికా జీరో అంటూ ఇప్పటికే చైనా వ్యాఖ్యానించింది కూడా. .గతంలో కూడా ఈ మూడు దేశాలు ఇదే మాట ట్రంప్ కు పరోక్షంగా ఎరుకపరిచిన విషయం ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాలి.
1992 లో సోవియట్ యూనియన్ పతనం అయ్యేవరకూ అమెరికాకు దీటుగా అన్ని విషయాల్లో రష్యా పోటీగా ఉండేది. ప్రచ్ఛన్న యుద్ద కాలంలో భారత్, రష్యాల మధ్య సహకారం తెలిసిందే. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తరువాత కూడా భారత్, రష్యాల మధ్య సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రధానంగా యుద్ధ పరికరాల సరఫరా విషయంలో ఇరు దేశాల మధ్యా బంధం చెక్కు చెదరలేదు. . ఇటీవలి ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్ పీచమణచడంలో రష్యా ఆయుధాలు కీలక పాత్రపోషించాయి. రష్యా అధినేతగా వాద్లిమిర్ పుతిన్ పాతికేళ్లకు పైగా అప్రతిహతంగా కొనసా గుతున్నారు. సోవియట్ పతనం తదననంతరం.. ప్రపంచ దేశాలలో రష్యా ప్రాధాన్యత, ప్రాముఖ్యతను కొనసాగించడంలో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారనడంలో సందేహం లేదు.
అన్ని రంగాల్లో అమెరికాకు దీటుగా రష్యాను నిలపడంలో కీలకంగా వ్యవహరించారు. దౌత్య వ్యవహారాలలో కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు. భారత్ కు చిరకాల,సాంప్రదాయ మిత్రుడు గా దాదాపు ఏడు దశాబ్దాలుగా రష్యా ఉంది. పుతిన్,మోదీ భేటీ ఇదే తొలిసారి కాదు. వాజపేయి ప్రధానిగా ఉన్న కాలంలో అప్పటి గుజరాత్ సీఎంగా ఉన్న మోదీ అప్పట్లో పుతిన్ తో భేటీ అయ్యారు.అప్పటి నుంచి వారి మైత్రి కొనసాగుతునే ఉంది. భారత్, రష్యాల స్నేహ బంధం కాల పరీక్షకు తట్టుకుని నిలబడింది అని చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు.