ఏపీలో దౌర్భాగ్యపు, దాష్టీకపు, దిక్కుమాలిన పాలన!
posted on Sep 23, 2021 @ 10:10PM
ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షాలు దూకుడు పెంచాయి. వైసీపీ ప్రభుత్వంపై జనాల్లో తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తుండటంతో.. దాన్ని క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రజా సమస్యలపై పోరాడుతూ, జగన్ రెడ్డి సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూ జనంలోకి వెళుతున్నాయి. తాజాగా వైసీపీ పాలనలో వీడియో సందేశం విడుదల చేశారు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్. ఇటీవల కౌంటింగ్ జరిగిన పరిషత్ ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
జనసేన ప్రస్థానం ఒక ఎమ్మెల్యేతో మొదలై నేడు అనేకమంది ఎంపీటీసీలు, జడ్పీటీసీలను గెలిపించుకునే స్థాయికి చేరిందని పవన్ కల్యాణ్ అన్నారు. 25.2 శాతం ఓట్లను పొందగలిగామని తెలిపారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనంతగా ఎన్నికల హింస చోటుచేసుకుంటోందని పవన్ కామెంట్ చేశారు. ఏపీలో వైసీపీది ఒక దౌర్భాగ్యపు, దాష్టీకపు దిక్కుమాలిన పాలన సాగుతుందని మండిపడ్డారు జనసేనాని. ఇటువంటి దుర్మార్గపు పాలన భారతదేశంలోనే ఎక్కడా లేదని మండిపడ్డారు.
పరిషత్ ఎన్నికల్లో కౌంటింగ్ లోనూ అక్రమాలకు పాల్పడ్డారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. మంగళగిరి నియోజకవర్గంలో తమ అభ్యర్థి జోజిబాబు 65 ఓట్ల ఆధిక్యంతో గెలిస్తే, రీకౌంటింగ్ చేయాలని వైసీపీ అభ్యర్థులు పట్టుబట్టారని, ఆఖరికి వైసీపీ అభ్యర్థి 18 ఓట్లతో గెలుపొందాడని ప్రకటించుకున్నారని తెలిపారు. పోలీసులు, ఓట్ల లెక్కింపు సిబ్బంది కూడా వైసీపీ నేతలకు మద్దతుగా నిలిచారని, గెలిచిన తమ అభ్యర్థిని ఓడిపోయేలా చేశారని ఆరోపించారు. రైల్వే కోడూరులో తమ అభ్యర్థులకు చెందిన ఐదు ఎంపీటీసీ నామినేషన్లను పోలీసులే స్వయంగా తీసేశారని పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు. వాళ్లు పోలీసుల్లా ప్రవర్తించలేదని, వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరించారని అన్నారు. ఈ దారుణ పాలన పట్ల అందరికీ ఓపికలు నశించిపోయాయని, జనసేన కూడా ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదని స్పష్టం చేశారు.
151 మంది ఎమ్మెల్యేలున్న వైసీపీ రాష్ట్రాన్ని ఎంతో సుభిక్షంగా పాలిస్తుందని ఆశించామని, ఏవైనా తప్పులుంటే సరిదిద్దుకుంటుందని భావించామని పవన్ తెలిపారు. కానీ ఈ దౌర్భాగ్యపు పాలనను ఇక చూస్తూ ఊరుకునేది లేదని, గట్టిగా ఎదుర్కోవాలని చాలా బలంగా నిర్ణయించుకున్నామని తెలిపారు, అందుకోసం కార్యకర్తలను ఎలా సమాయత్తం చేయాలి? వీళ్ల దాడులను ఎలా ఎదుర్కోవాలి? అవసరమైతే క్షేత్రస్థాయి పోరాటాలకు సిద్ధంగా ఎలా ఉండాలి? అనే అంశాలను జనసేన నేతలతో చర్చిస్తామని, విజయవాడలో విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇకపై ప్రతి నెలా రాష్ట్రంలో జనసేన నేతల పర్యటనలు ఉంటాయని పవన్ స్పష్టం చేశారు.