మంత్రులు ఆ నది నీటిని తాగితే కోమాకే
posted on Oct 29, 2018 @ 6:14PM
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొన్నారు. అసలే ఈ మధ్య రాహుల్ ఎక్కడికెళ్లినా రాఫెల్ అంటూ మోదీ సర్కార్ మీద విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా రాహుల్ మరోసారి రాఫెల్ తో పాటు మరికొన్ని అంశాలను ప్రస్తావిస్తూ మోదీ మీద విమర్శల వర్షం కురిపించారు. ‘సీబీఐ డైరెక్టర్ రాఫెల్ గురించి విచారణ ప్రారంభించారు. అందుకే మోదీ భయపడిపోయి సీబీఐ డైరెక్టర్‌ను అర్ధరాత్రి 2గంటల సమయంలో పదవి నుంచి తొలగించారు. మోదీ దేశాన్ని దోచుకుంటున్నట్లు ఇప్పుడు అందరికీ తెలుస్తోంది. కుంభమేళా నిర్వహణ విషయాల్లో అవినీతి జరుగుతోందని కొందరు నాతో చెప్పారు. సీబీఐ విచారణ వేయించాలని అనుకున్నారు. కానీ సీబీఐ విచారణ ఎలా చేస్తుంది? అర్థరాత్రి రెండు గంటల సమయంలో సీబీఐ డైరెక్టర్‌ను తొలగిస్తే ఇక ఇటువంటి కేసుల్లో విచారణ ఎలా చేస్తారు?' అని రాహుల్ ప్రశ్నించారు. శిప్రా నదిని శుభ్రం చేసేందుకు దాదాపు రూ.400కోట్లు ఖర్చుచేశారు. కానీ నదిలో నీటిని ఒకసారి చూడండి. ఎవరైనా మంత్రి ఆ నీటిని తాగితే ఖచ్చితంగా అతను అపస్మారక స్థితిలోకి చేరుకుంటారు’ అని రాహుల్ విమర్శించారు.
ప్రధాని మోదీ చేసిన తప్పుల వల్లే జమ్ము కశ్మీర్ నిత్యం తుపాకీ కాల్పులతో మారుమోగుతోందని రాహుల్ విమర్శించారు. ఉగ్రవాదులకు ప్రధాని ద్వారాలు తెరవడమే అందుకు కారణమన్నారు. కాల్పుల్లో ఒక్క రాజకీయ నాయకుడూ చనిపోవడం లేదని, కేవలం సైనికులు మాత్రమే అమరులవుతున్నారని ధ్వజమెత్తారు. సర్జికల్ స్ట్రైక్స్ ని తమ ఘనతగా చెప్పుకొనే మోదీ.. సైనికుల గురించి ఒక్కమాట మాట్లాడరని విమర్శించారు. సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించిన వారికేం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకే ర్యాంకు- ఒకే పింఛను (ఓఆర్‌ఓపీ) విషయంలోనూ మోదీ అసత్యాలు చెబుతున్నారని.. ఓఆర్‌ఓపీ ఇంకా అమలులోకి రాకపోయినా మోదీ మాత్రం అమలుచేసినట్టే చెప్పుకుంటున్నారని రాహుల్ మండిపడ్డారు.