కాంగ్రెస్ కు జైవీర్ షెర్గిల్ గుడ్ బై
posted on Aug 24, 2022 @ 5:24PM
పార్టీ అధినేతకు భజనపరుల తాకిడి ఎక్కువయితే నిజంగా పనిచేసేవారు, పార్టీపట్ల వీరాభిమానంతో ఉండే వారు తప్పకుండా దూరమవుతారు. కాంగ్రెస్ పార్టీకి ఇపుడు ఇదే జరుగుతోంది. జాతీయ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్ అన్ని పార్టీ పదవులకు రాజీనామా చేశారు. పార్టీ అధిష్టానం మొత్తం భజనపరుల కోటరీగా మారిందని ఆయన ఆరోపించారు. సుప్రీంకోర్టు న్యాయ వాదిగానూ మంచిపేరు తెచ్చుకున్న షెర్గిల్ పార్టీని వీడటం కాంగ్రెస్‌కు గట్టి ఎదురు దెబ్బేనని రాజకీయ పరిశీలకుల మాట.
ప్రజాప్రయోజనాల కోసం పార్టీ పాటుపడే పరిస్థితి కనిపించలేదని రాజీనామా అనంతరం వ్యాఖ్యా నించారు. ఎనిమిదేళ్లుగా కాంగ్రెస్ పార్టీకి అంకితమై పనిచేశానని, తాను పార్టీ నుంచి తీసుకున్న దేమీ లేదని ఆయన స్పష్టం చేశారు. అధిష్టానం అడుగులకు మడుగులొత్తే వారికి అందలాలు దక్కుతు న్నాయని ఆయన ఆవే దన వ్యక్తం చేశారు. ఏడాదిగా పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంకా వాద్రా సమయం కోరుతున్నా తనను కార్యాలయానికి పిలవలేదని ఆయన వాపో యారు. కాంగ్రెస్ పార్టీ వాస్తవాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోలేకపోతోందని షెర్గిల్ అన్నారు.
జాతీయ మీడియాలో హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అధికార ప్రతినిధిగా పార్టీ అభిప్రాయాలను బలంగా వినిపించే నేతగా పేరున్న జైవీర్ షెర్గిల్ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పడం సంచలనం రేపుతోంది. జైవీర్ షెర్గిల్ ఏ పార్టీలో చేరతారనేది ఇంకా స్పష్టం కాలేదు.