తండ్రి అడుగుజాడల్లో... తప్పుల బాటలో!
posted on Jun 20, 2024 @ 6:03PM
ఎవరు చేసిన కర్మ వారనుభవించక తప్పదు. ఆ కర్మ ఫలం అనుభవించే విషయంలో ఒక్కోసారి ఒకింత ఆలస్యం అవుతుందేమో కానీ అనుభవించడం మాత్రం పక్కా. అందుకే పెద్దలు తప్పు చేయొద్దు.. కష్టాలు కొనితెచ్చుకోవద్దని చెబుతుంటారు. అధికార మదంతో, అహంకారంతో ఇష్టారాజ్యంగా వ్యవహరించి దెబ్బతిన్న ఇద్దరు నేతల గురించి ఇప్పుడు ప్రస్తావించుకుందాం. కాకతాళీయంగా అనాలో లేదో కానీ వారిద్దరూ కూడా తండ్రీ కొడుకులు, ఇద్దరూ కూడా ముఖ్యమంత్రులుగా పని చేసిన వారే కావడం విశేషం. ఇద్దరూ కూడా తెలుగు వారే. తండ్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదున్నరేళ్లు సీఎంగా పని చేస్తే, కొడుకు విభజిత ఆంధ్రప్రదేశ్ లో ఐదేళ్లు సీఎంగా వెలగబెట్టారు. ఇరువురూ కూడా తాము ముఖ్యమంత్రులుగా పని చేసిన సమయంలో రూల్ ఆఫ్ లాను పాటించలేదు. నిబంధనలను ఖాతరు చేయలేదు. అధికార దర్పం, అహం తలకెక్కి హద్దులు మీరి ప్రవర్తించారు. వాళ్లిద్దరూ ఎవరన్నది ఈ పాటికి అర్ధమయ్యే ఉంటుంది కదా? ఆ తండ్రీ కొడుకుల పేర్లు వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖరరెడ్డి, విభజిత ఆంధ్రప్రదేశ్ లో ఆయన కుమారుడు జగన్ ముఖ్యమంత్రులుగా రాష్ట్రానికి, ప్రజలకు చేసిన మేలు సంగతి పక్కన పెడితే.. వారు తప్పులుమీద తప్పులు చేశారు. ప్రభుత్వ సొమ్మును అప్పనంగా బొక్కేయాలని చూశారు. బొక్కేశారు. వైఎస్ ప్రజాక్షేత్రంలో శిక్ష అనుభవించడానికి ముందే హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆయన కుమారుడు జగన్ కు ప్రజలు గద్దె దింపి చక్కటి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు.
ముందుగా తండ్రి ఏ విధంగా తిరుమలేశునికి పంగనామాలు పెట్టడానికి ప్రయత్నించారో చూద్దాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరున్నరేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. సీఎం హోదాలోనే ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఆయన ఏకంగా కళియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామికే పంగనామాలు పెట్టేందుకు ప్రయత్నించి భంగపడ్డారు. అదెలా అంటే ఇప్పుడు కొడుకు జగన్ సర్కార్ సొమ్ముతో రుషికొండపై ప్యాలెస్ కట్టినట్లుగా.. వైఎస్ అప్పట్లోనే ఇడుపులపాయలో ప్యాలెస్ కట్టాలని భావించారు. అయితే ఆ ప్రాంతం శేషాచలం అటవీ ప్రాంతం పరిధిలోది కావడంతో చట్ట ప్రకారం అక్కడ ప్యాలెస్ నిర్మాణం సాధ్యం కాలేదు. అయినా వైఎస్ శేషాచలం అటవీ పరిధి నుండి తాను ప్యాలెస్ నిర్మించాలనుకున్న ప్రాంతాన్ని మినహాయించడానికి శతథా ప్రయత్నించారు. ఇందు కోసం ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డును తన వాళ్లతో నింపేశారు. తిరుమలలోనే ఎన్నికలు నిర్వహించేంత వరకూ కూడా వెళ్లారు. అటవీ చట్టానికి తూట్లు పొడవాలని వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అప్పట్లో ఇడుపులపాయలో ప్యాలస్ కట్టలేకపోయిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి హరితా రిసార్ట్స్ హోటల్ సాకుతో టూరిజం సొమ్ములతో ఒక ఎత్తైన వాచ్ టవర్ నిర్మించుకున్నారు, అక్కడి నుండి చూస్తే.. తన ఇడుపులపాయ ఎస్టేట్ అంతా కనిపించేలా ఆ టవర్ నిర్మాణం అయ్యింది. ఆ టవర్ ప్రారంభానికి రెండు నెలల ముందే విధి వక్రించి హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ మరణించారు. అలా వైఎస్ తన కల నెరవేరకుండానే కాలం చేశారు.
ఇక ఆయన కుమారుడు జగన్ నిర్వాకం చూద్దాం.. 2019లో జగన్ మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి ఏపీ ప్రజలను వేధించడమే పనిగా పెట్టుకున్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నించిన వారిపై, ప్రతిపక్ష నేతలపై దాడులు, దౌర్జన్యాలతో రాష్ట్రంలో ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి తనను ఎవరూ ప్రశ్నించకూడదన్న రీతిలో అరాచక పాలన సాగించారు. వైజాగ్ లోని రుషికొండకు గుండు కొట్టేసి ప్రభుత్వ సొమ్ముతో ఏకంగా కళ్లు జిగేల్ మనే భారీ భవంతులు కట్టించుకున్నారు జగన్.. కానీ అందులో అడుగు కూడా పెట్టడానికి అవకాశం లేకుండా జనం ఆయనకు ఓటుతో గట్టి బుద్ధి చెప్పారు. జగన్ తన హయాంలో విభజిత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, పురోగతికి మూలస్తంభాలైన రాజధాని అమరావతి, జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను నిలిపివేసి వాటిని నిర్వీర్యం చేయాలని చూశారు. రుషికొండకు గుండు కొట్టేసి.. ఆ ప్రాంతాన్ని ఎవరూ ప్రవేశించడానికి వీల్లేని నిషిద్ధ ప్రదేశంగా మార్చేసి ప్రభుత్వ ధనంతో రాజభవనం లాంటి ప్యాలస్ కట్టేసుకున్నారు. ప్రభుత్వ డబ్బుతో రుషికొండపై పెద్దపెద్ద భవనాలు నిర్మించుకున్న జగన్.. మళ్లీ అధికారంలోకి వస్తే వాటిలోనే కాపురం పెట్టాలని భావించారు. సొంత బాబాయ్ హత్య నుంచి ప్రతి విషయం దేవుడికే తెలుసు అంటూ చేతులు దులిపేసుకునే జగన్ కు ఇప్పుడు రుషికొండలో ఎంతో ముచ్చటపడి జనం సొమ్ముతో కట్టుకున్న ప్యాలస్ లో నివసించే యోగం లేకుండా పోవడానికి కారణం కూడా ఆ దేవుడికే తెలుసు అంటున్నారు.
ఆ దేవుడి సంగతి పక్కన పెడితే ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అద్వానంగా మార్చేసిన జగన్ ను జనం ఓటుతో గద్దెదింపి సాగనంపారు. అధికార మదంతో ఐదేళ్ల కాలంలో పాల్పడిన అవినీతి అక్రమాలు, గత పదేళ్లుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా నిలిచిపోయిన అక్రమాస్తుల కేసు విచారణ, బాబాయ్ హత్య కేసు దర్యాప్తు అన్నీవేగంగా కదులుతాయి. ఇప్పటి దాకా సీఎం హోదా సాకుగా చూపి కోర్టు మెట్లు ఎక్కకుండా పొందిన మినహాయింపు ఇకపై ఉండదు. మొత్తంమీద వైఎస్ రాజశేఖర్ రెడ్డి, నేడు జగన్ మోహన్ రెడ్డిల తీరును చూస్తే.. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు మేలుజరిగేలా పాలనసాగించాలి. పంతాలకు పోయి తప్పులుమీద తప్పులు తిప్పలు తప్పవనీ ఫలితం అనుభవించక తప్పదనీ స్పష్టమౌతుంది.