జూన్ 4న జగన్ భారీ షాక్ తింటారు: ప్రశాంత్ కిషోర్
posted on May 12, 2024 @ 12:48PM
జగన్ లీడర్ కాదు.. ప్రొవైడర్ అని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. లీడర్ భవిష్యత్తు గురించి, అభివృద్ధి గురించి ఆలోచిస్తాడు. ప్రొవైడర్ డబ్బులు ఇచ్చి పబ్బం గడుపుకుందామని అనుకుంటారు. జగన్ నంబర్ వన్ ప్రొవైడర్ అని ప్రశాంత్ కిషోర్ అన్నారు. పాతరోజుల్లో మహారాజులు ఎలా తమను తాము ఎలా భావించేవారో జగన్ ఈ ప్రజాస్వామ్యంలో కూడా అలాగే తనను తాను మహారాజులా భావిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరికి ఏమి కావాలో వారికి అది ఇవ్వాలి. ఉద్యోగాలు కావాల్సిన వారికి ఉద్యోగాలు ఇవ్వాలి. ఆర్థిక సాయం కావలసిన వారికి సాయం చేయాలి.. ఇలా రకరకాలుగా పరిపాలన వుంటుంది. అంతే తప్ప మహారాజులు దానం చేసినట్టు చేయడం కుదరదు. అన్నిటినీ బ్యాలన్స్ చేస్తూ ముందుకు వెళ్ళాలి. కానీ, జగన్మోహన్‌రెడ్డి అలాకాదు.. ఒకటే దారి.. డబ్బు పంచడం.. పంచుతూనే వుండటం. జగన్ ఇలా అప్పులు తెచ్చి మరీ దానాలు చేస్తూ మహారాజులా భావించుకున్నారు అని పీకే విశ్లేషించారు. నెలనెలా డబ్బు పంచుతూ వుంటా.. రాష్ట్రం అప్పుల పాలైపోయినా పర్లేదు. అవినీతి అక్రమాలు పెరిగిపోయినా పర్లేదు... మిగతా విషయాలు నేను పట్టించుకోను అన్నట్టు తయారయ్యారు. ఆయన ప్రజల విషయంలో ఎలా వ్యవహరించారంటే, నెలనెలా నీకు ఐదు వేలు ఇస్తా.. నన్నేమీ ప్రశ్నించకు అన్నట్టుగా వ్యవహరించారు. అందుకే, ఈ జూన్ 4న జగన్మోహన్‌రెడ్డి ప్రజల చేతిలో పెద్ద షాక్ తినబోతున్నారు. జగన్ ప్రజల నుంచి గుణపాఠం నేర్చుకోబోతున్నారు. ఆ గుణపాఠం కూడా అత్యంత దారుణంగా వుండబోతోంది అని ప్రశాంత్ కిషోర్ స్పష్టంగా చెప్పారు.