జగన్ దారుణంగా ఓడిపోతారు: ప్రశాంత్ కిషోర్
posted on May 12, 2024 @ 12:40PM
ఈసారి ఎన్నికలలో జగన్ దారుణంగా ఓడిపోబోతున్నారని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. జర్నలిస్టు రవిప్రకాష్‌తో జరిగిన మాటామంతీలో ఆయన జగన్ ఓటమి ఖాయమని, ఆ ఓటమి కూడా అలా ఇలా ఉండబోదని, చాలా దారుణంగా వుంటుందని స్పష్టం చేశారు. 2019 ఎన్నికలలో జగన్ భారీ విజయం సాధించడానికి సహకరించిన నేనే ఈ మాట చెబుతున్నానంటే పరిస్థితిని మీరు అర్థం చేసుకోవచ్చని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. జగన్‌తో నాకు ఎలాంటి శత్రుత్వం లేదని, ఆయన తనకు చాలా మంచి మిత్రుడని... మిత్రుడైనప్పటికీ, ఆయన ఘోరంగా ఓడిపోబోతున్నాడన్న వాస్తవం చెప్పడమే న్యాయమని పీకే అన్నారు.
2019 ఎన్నికలలో గెలిచిన తర్వాత జగన్ తనను తాను ఒక మహారాజుగా భావిస్తూ వచ్చారని, అభివృద్ధి గురించి ఎంతమాత్రం పట్టించుకోకుండా కేవలం జనానికి నెల తిరిగేసరికి డబ్బులు ఇస్తూ వుంటే, వాళ్ళు తనను పదేపదే ఎన్నుకుంటూనే వుంటారనే భ్రమల్లో జగన్ వున్నారని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. ఏపీ జనానికి నెలనెలా డబ్బులు కావాలి తప్ప ఇంకేమీ అవసరం లేదని జగన్ బలంగా నమ్ముతున్నారని ఆయన అన్నారు. నెలనెలా డబ్బులు అకౌంట్లో వేస్తే చాలు రోడ్లు అవసరం లేదు, ఉద్యోగాలు అవసరం లేదు, అభివృద్ధి అవసరం లేదు, భవిష్యత్తు అవసరం లేదు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి దిగజారినా పర్లేదు, అప్పులు పెరిగిపోయినా పర్లేదు, శాంతి భద్రతలు సర్వనాశనం అయిపోయినా పర్లేదు, ఆంధ్రప్రదేశ్ రాజధాని అనేదే లేని రాష్ట్రం అయిపోయినా పర్లేదు, ప్రజలకు ముఖ్యమంత్రిని కలిసే అవకాశం లేకపోయినా పర్లేదు, ప్రజలకు ముఖ్యమంత్రి కనిపించకపోయినా పర్లేదు అనే ఉద్దేశంలోనే జగన్ వున్నారని అన్నారు. ఆమధ్య జగన్ - తాను ఢిల్లీలో కలిశామని, అప్పుడు నువ్వు ఓడిపోబోతున్నావ్ జగన్, నువ్వు చేస్తున్న తప్పులు ఇవి అని ఆయనకు చెప్పాను. ఆయన నా మాటలు ఎంతమాత్రం పట్టించుకోలేదు అని ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు. (ఇంకావుంది)