జగన్ కొంప ముంచిన కొమ్మినేని!
posted on May 14, 2024 @ 6:01PM
రాష్ట్రవ్యాప్తంగా వున్న వైసీపీ అభిమాన వర్గాలు ‘‘ఓరి నాయనో.. ఈ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు మా జగనన్న కొంప ముంచాడు నాయనో’’ అని లబోదిబో అంటున్నారు. జగన్ మీడియాలో కీలక స్థానంలో, జగన్ ప్రభుత్వంలో ఒక సలహాదారుడు పదవి కూడా వెలగబెడుతున్న సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు చాలామందికి తెలిసిన వ్యక్తే. ఈయన జగన్ గురించి సాక్షి మీడియాలో ఇచ్చే బిల్డప్పులు వింటే చెవుల వెంట రక్తం కూడా కారే అవకాశాలు వుంటాయి. జగన్ విషయంలో పదిపైసలంత మేటర్ వుంటే, అది కొమ్మినేని నోట్లోంచి పది వేల రూపాయలంత రేంజ్‌లో బయటకి వస్తుంది. కొమ్మినేని పేరుకే జర్నలిస్టుగానీ, ‘జగన్ భజంత్రీల సంఘం’ వ్యవస్థాపక అధ్యక్షుడు అని గిట్టనివారు అంటూ వుంటారు.
సరే, ఈయన మంగళవారం నాడు సాక్షి టీవీ కెమెరా ముందుకు వచ్చారు. సాధారణంగా అయితే జగన్ నినాదం అయిన ‘వైనాట్ 175’ అనే నినాదానికి అనుకూలంగా వైసీపీ అదరహో, కూటమి బెదరహో, అధికారం జగన్‌దేనహో అని నానా హడావిడి చేయాలి. కానీ ఆయన ఎలాంటి హడావిడి లేకుండా, చూద్దామన్నా నెత్తుటి చుక్క కూడా కనిపించని ముఖంతో ‘ఈసారి కూడా జగన్ విజయం సాధిస్తారు.. అని సర్వేలు కూడా చెబుతున్నాయి. నేను కూడా కొందరు సర్వేవాళ్ళతో మాట్లాడాను. వాళ్ళలో చాలామంది జగనే గెలుస్తారని చెప్పారు’ అని చాలా చప్పచప్పగా ఎక్స్.ప్రెషన్ ఇస్తూ, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంతకంటే పెద్ద అబద్ధం ఆడలేను అన్నట్టుగా తేల్చేశారు.
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఓటర్లకి అన్నీ అబద్ధాలు చెప్పారట, అలాగే పోలింగ్ సందర్భంగా భారీగా హింసకు దిగారట... అని కొమ్మినేని శ్రీనివాసరావు దిగాలుగా ముఖం పెట్టి చెబుతుంటే, పాయే.. వైసీపీ పని అయిపాయే అని ఎవరికైనా అనిపించడం ఖాయం..
పోనీ, కొమ్మినేని గారు అక్కడితో ఆగలేదు.. జగన్ బ్రెయిన్ ఛైల్డ్ అయిన ‘వైనాట్ 175’ సిద్ధాంతానికే గండి కొట్టేశారు. రాయలసీమలో గత ఎన్నికలలో 49 సీట్లు వచ్చాయి.. ఈసారి 35 నుంచి 40 సీట్లు వస్తాయి అని డిక్లేర్ చేశారు.. అద్గదిగో.. ఇక్కడ వైసీపీ వర్గాల గుండెల్లో పెద్ద బండరాయి పడింది.. ఎవరైనా గతంలో 49 సీట్లు వచ్చాయి.. ఈసారి ఇంకా నాలుగైదు సీట్లు పెరుగుతాయి అని చెబుతారుగానీ, ఈయనేంటయ్యా బాబు.. దాదాపు పద్నాలుగు సీట్లు నిర్దాక్షిణ్యంగా కోసేశారు అని లబోదిబో అంటున్నారు. మన మీడియాలోనే మనం ఈరకంగా కోసేసుకుంటే, రియల్‌గా ఓటర్లు ఇంకెంత కోసేశారో అని కెవ్వుమంటున్నారు.
కొమ్మినేని వైసీపీ వర్గాల మీద బాంబులు వేస్తూ మరికొంత విశ్లేషణ చేశారు. ఉత్తరాంధ్రలో వున్న 34 సీట్లలో 20 సీట్లు వైసీపీకి వస్తాయని చెప్పారు. అదేంటన్నా.. మన జగనన్న వైజాగ్ రాజధాని అని పోరాటం చేస్తుంటే, ఉత్తరాంధ్రలో సీట్లన్నీ మనకి వస్తున్నాయని చెప్పాలిగానీ, 14 సీట్లు కట్ చేశారేంటన్నా.. ఇదెక్కడి న్యాయం కొమ్మినేని సారూ అని వైసీపీ వర్గాలు మొత్తుకుంటున్నాయి.
జగన్ మొదటి నుంచి వైనాట్ 175 అంటే, కొమ్మినేని వారు మాత్రం 100 నుంచి 110 సీట్లు వస్తాయని ఫైనల్ చేశారు. ఈయన తీర్పు విని వైసీపీ వర్గాలు గొల్లుమంటున్నాయి. 175 వస్తాయి అని బిల్డప్పు ఇవ్వాలిగానీ, ఈరకంగా 110 బోర్డర్ పెట్టేశావేంటి దేవుడా అని బావురుమంటున్నాయి. సాక్షి మీడియా కాంపౌండ్లోనే పరిస్థితి ఇంత నీరసంగా వుందంటే, వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.