బెజవాడలో జగన్ కు నాగార్జునేదిక్కు!?
posted on Oct 14, 2022 @ 10:02AM
ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున తనకు రాజకీయాలపై ఎంత మాత్రం ఆసక్తి లేదని పదే పదే చెబుతున్నా, వైసీపీ మాత్రం ఆయనను వదలడం లేదు. ముఖ్యంగా విజయవాడలో లోక్ సభ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా అక్కినేని నాగార్జున అయితేనే బాగుంటుందని జగన్ గట్టిగా భావిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అందుకే అక్కినేని నాగార్జున తాను ఎన్నికలలో పోటీ చేసే ప్రశక్తే లేదని పదే పదే చెబుతున్నా... జగన్ మాత్రం ఆయనపై ఒత్తిడి తెస్తున్నారనీ, ఇప్పటి వరకూ బెజవాడ పార్లమెంటు స్థానంలో గెలవలేకపోయిన వైసీపీ ఈ సారి ఆ స్థానంలో గెలవాలన్న పట్టుదలతో ఉంది. ఆ స్థానంలో విజయాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న జగన్.. అక్కడ నుంచి అక్కినేని నాగార్జునను నిలబెడితేనే విజయం సిద్ధిస్తుందని విశ్వసిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అక్కినేని నాగార్జున వైసీపీ అభ్యర్థి అయితే సామాజిక వర్గాల పరంగా చూసుకున్నా వైసీపీకి అధిక ప్రయోజనం ఉంటుందనీ, ప్రత్యర్థి పార్టీకి చెందిన ఓట్లను కూడా ఆయన చీల్చగలుగుతారనీ, ముఖ్యంగా ఒక సామాజిక వర్గానికి చెందిన ఓట్లలో చీలిక బారీగా ఉంటుందని జగన్ అంచనా వేస్తున్నారని చెబుతున్నారు.
అందుకే నాగార్జున అంగీకారం, తిరస్కారంతో సంబంధం లేకుండా వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఆయనే విజయవాడ లోక్ సభ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగుతారని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారం వెనుక వైసీపీయే ఉందని పరిశీలకులు చెబుతున్నారు. పార్టీ ప్రయోజనాలు, తన రాజకీయ అవసరాలను బేరీజు వేసుకుని జగన్ నాగార్జునపై విజయవాడ నుంచి పోటీ చేయాల్సిందిగా ఒత్తిడి తీసుకువస్తున్నారని రాజకీయ వర్గాలలో బాగా ప్రచారంలో ఉంది. విజయవాడ లోక్ సభ స్థానంలో వైసీపీ విజయం సాధించాలంటే... ఆ స్థానం నుంచి నాగార్జునను నిలబెట్టడం వినా మరో మార్గం లేదని జగన్ నిశ్చితాభిప్రాయంతో ఉన్నారని పార్టీకి సన్నిహితంగా ఉండే వర్గాల సమాచారం.
అన్నిటికీ మించి విజయవాడ లోక్ సభ స్థానం నుంచి నాగార్జునను బరిలోకి దింపితే... దాని ప్రభావం ఆ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లపై కూడా పడి... ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలలోని వైసీపీ అభ్యర్థుల విజయావకాశాలు మెరుగుపడతాయని జగన్ భావిస్తున్నారని చెబుతున్నారు. అందుకే నాగార్జున బహిరంగంగానే తానే పార్టీ తరఫునా ఎన్నికలలో పోటీ చేయబోయేది లేదని పదే పదే విస్పష్టంగా చెబుతున్నా... పట్టించుకోకుండా వైసీపీ తన ప్రయత్నాలు తాను చేస్తూనే.. అక్కినేని నాగార్జునే విజయవాడ లోక్ సభ స్థానంలో వైసీపీ అభ్యర్థి అన్న ప్రచారాన్ని కొనసాగిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.