అయ్యో జగనన్నా.. నీకెంత కష్టం వచ్చింది జగనన్నా...!
posted on Aug 14, 2024 @ 12:15PM
బెంగళూరు నుంచి విజయవాడ వెళ్ళే విమానం బయల్దేరడానికి సిద్ధంగా వుంది. విమానంలోని ఎకానమీ క్లాస్ అప్పటికే ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. మొత్తం విమానంలో చివరి వరసలో రెండు సీట్లు మాత్రం ఖాళీగా వున్నాయి. ఇంతలో ఒక జంట విమానంలోకి ప్రవేశించింది. అతను పొట్టిగా వున్నాడు. ఆమె సన్నగా వుంది. అతని ముఖంలో ‘ఏంటో.. నా జీవితం ఇలా అయిపోయింది’ అనే ఎక్స్.ప్రెషన్. ఆమె ముఖంలో ‘అంతా నా ఖర్మ’ అనే ఎక్స్.ప్రెషన్. వాళ్ళిద్దరూ విమానం చివర్లో వున్న తమ సీట్ల వైపు నడుస్తున్నారు. వాళ్ళని చూసిన విమానంలోని ప్రయాణికులకు ‘వీళ్ళని ఎక్కడో చూసినట్టుందే..’ అనే సందేహం కలిగింది. ప్రయాణికులలో కొంతమందికి వాళ్ళెవరో వెంటనే వెలిగింది. మరికొంతమందికి కొద్ది క్షణాల తర్వాత వెలిగింది. వాళ్ళెవరో కాదు.. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, వైఎస్ భారతి దంపతులు. అంతే, ఆ విషయం అర్థం కాగానే అందరూ షాకైపోయారు. ఆ జంట ప్రయాణికుల మధ్యలోంచి తమ సీట్లను వెతుక్కుంటూ వెళ్ళి, చివరి వరుసలో వున్న తమ సీట్లలో కూర్చున్నారు. అప్పటికే ఎలర్ట్ అయిపోయిన జనం జగన్ దంపతులను ఫొటోలు తీసుకుంటున్నారు. కొంతమంది సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఈ హడావిడిని చూసి వైఎస్ భారతి ఇబ్బందికరంగా ముఖం పెట్టుకుంటే, జగన్ మాత్రం తనదైన ‘షిక్కటి షిరునవ్వుతో’ కూర్చున్నాడు.
జగన్ దంపతులను ఈ పరిస్థితుల్లో జగన్ భజన బ్యాచ్ చూస్తే వాళ్ళ మనసులు ఎలా ఘోషిస్తాయంటే.... ‘‘అయ్యో జగనన్నా.. నీకు ఎంత కష్టం వచ్చింది జగనన్నా.. అయ్యో వదినమ్మా.. నీకు ఎంత కష్టం వచ్చింది వదినమ్మా.. ప్రజల సొమ్ముతో ఎలాంటి విమానాల్లో తిరిగిన జంట మీది.. గంటకి పది లక్షల రూపాయల ఖర్చుతో ఎడాపెడా విమానాల్లో తిరిగిన మీరా.. ఇలా మామూలు విమానంలో చివరి సీట్లలో కూర్చుని ప్రయాణం చేస్తున్నది.. హయ్యో.. విధి ఎంత బలీయమైనది.. జనం సొమ్ముతో ఎప్పుడు విమానం ఎక్కినా మహారాజు, మహారాణిలా ప్రయాణం చేసేవారే... ఇప్పుడేంటి ఇలా విమానం వెనుక సీట్లలో వలస వెళ్తున్న వరద బాధితుల్లా ప్రయాణిస్తున్నారు.. విమానంలో ఈ అవమానమేంటి జగనన్నా.. 2004 నుండి 2024 వరకు మీరు కొట్టేసిన డబ్బుతో ఎయిర్ ఫోర్స్ వన్ లాంటి విమానాలు వెయ్యి కొనగలిగిన శక్తి వుండి కూడా... సైకిల్ టైర్ పంక్చర్ వేయించుకోవడానికి కూడా పైసలు లేవు అన్న ఫేసులతో ఎకానమి క్లాస్‌తో ప్రయాణం చేస్తున్నారా... ఆరు కిలోమీటర్ల దూరానికి హెలికాప్టర్లు వాడిన జగనన్నేనా ఈయన.. అడుగు బయటపెడితే పరదాల వెనుకే వున్న జగనన్నేనా ఈయన.. అయ్యో.. ఇంకా భూకంపం రాలేదేంటి.. సముద్రాలు పొంగిపోలేదేంటి.. అగ్నిపర్వతాలు బద్దలవ్వలేదేంటి?’’