ఈ బాబాయికీ పోటు తప్పదా?

తిరుమల శ్రీవారి సన్నిధి నుంచి వైవీ సుబ్బారెడ్డిని సాగనంపేందుకు వైకుంఠ ఏకదశి సాక్షిగా ముహుర్తం ఖరారు అయినట్లు వైసీపీ శ్రేణుల్లో గట్టిగా వినిపిస్తోంది.  కొత్త సంవత్సరం.. ఆ మరునాడే వైకుంఠ ఏకదశి రావడం.. దీంతో తిరుమల కొండపై భక్తులు పోటెత్తనున్నారు. ఈ నేపథ్యంలో కొండపై భక్తుల హడావుడి తగ్గగానే.. టీటీడీ బోర్డు చైర్మన్ పదవికీ వైవీ సుబ్బారెడ్డి రాజీనామా చేస్తారన్న ప్రచారం జరుగుతోంది.  సుబ్బారెడ్డి స్థానంలో  పల్నాడు జిల్లాకు చెందిన ఓ బీసీ నేతకు టీటీడీ చైర్మన్ పదవిని కట్టబెట్టాలని జగన్ ఒక నిర్ణయానికి వచ్చారనీ,  మఘమాసంలో..ఓ మంచి ముహూర్తంలో ఆయన పేరును ప్రకటిస్తారని వారు చెబుతున్నారు.  

వైవీ సుబ్బారెడ్డి టీటీడీ  చైర్మన్ గానే కాక  వైసీపీ ఉత్తరాంధ్ర పార్టీ ఇన్‌చార్జ్‌గా కూడా ఉన్నారు.   వచ్చేది ఎన్నికల సీజన్ కావడంతో ఉత్తరాంధ్రలో పార్టీ బలోపేతానికి పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సి ఉందని... దాంతో వైవీ సుబ్బారెడ్డి.. ఉత్తరాంధ్రలో పాగా వేసి..   పార్టీ విజయం కోసం సుబ్బారెడ్డి పూర్తి స్థాయిలో కృషి చేయడం కోసమే ఆయనను టీటీడీ పదవి నుంచి జగన్ తప్పించాలని భావిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  

ఇంకోవైపు.. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు.. ఇటీవల తెలంగాణలోని ఖమ్మంలో నిర్వహించిన సభ సక్సెస్ అయిందని.. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరంలో నిర్వహించిన ఇదే ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం సైతం సూపర్ సక్సెస్ అయిందని.. ఈ రెండు చోట్ల చంద్రబాబు సారథ్యంలో జరిగిన సభలకు భారీగా ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చారని.. అలాంటి వేళ అధికారంలో ఉన్న వైసీపీ మరింత దూకుడుగా వ్యవహరించాల్సి ఉందని.... అందులో భాగంగానే ముఖ్యమంత్రి  జగన్... బాబాయి వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ చైర్మన్ పదవి నుంచి తప్పించి.. ఉత్తరాంధ్ర వ్యవహారాలకే పరిమితం చేస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి.

 అదీకాక గతంలో ఉత్తరాంధ్ర ఇన్ ఛార్జ్ బాధ్యతలు విజయసాయిరెడ్డి పర్యవేక్షించేవారు. .. కానీ ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తడంతో.. వైవీ సుబ్బారెడ్డికి ఆ బాధ్యతలు కట్టబెట్టిన జగన్ ఇప్పుడు బాబాయ్ వైవీ సుబ్బారెడ్డిని ఉత్తరాంధ్రకే పరిమితం చేయాలని నిర్ణయించుకున్నారు.  

 అదే సమయంలో టీటీడీ బోర్డ్ చైర్మన్ పదవి బీసీ నాయకుడికి ఇవ్వాలని నిర్ణయించారు. దీని వల్ల బీసీ వర్గాలలో వైసీపీ పట్ల సానుకూలత వ్యక్తం అవ్వడానికి అవకాశాలున్నాయని జగన్ భావిస్తున్నారు.  

Teluguone gnews banner