జగన్ హయాం సాగునీటి రంగానికి శాపం!
posted on Aug 20, 2024 @ 10:36AM
జగన్ హయాంలో జలవనరుల శాఖ తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. రాష్ట్ర చరిత్రలోనే జలవనరుల శాఖ ఇంత విధ్వంసానికి, నిర్లక్ష్యానికి గురైన సందర్భం మరొకటి లేదు. జగన్ హయాంలో నిర్లక్ష్యానికి గురైన సాగు నీటి ప్రాజెక్టులపై ప్రస్తుత తెలుగుదేశం కూటమి ప్రత్యేక దృష్టి సారించింది. చంద్రబాబు స్వయంగా ప్రాజెక్టులను సందర్శించి తీసుకోవలసిన చర్యలు, చేపట్టాల్సిన మరమ్మతులపై అధికారులకు దిశా నిర్దేశం చేస్తున్నారు.
అయితే జగన్ మాత్రం తన హయాంలో ప్రాజెక్టులకు మహర్ధశ పట్టిందన్నట్లుగా వ్యాఖ్యలు, ట్వీట్లు చేస్తుండటంతో తెలుగుదేశం శ్రేణుల్లోనే కాదు, రైతులలో కూడా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా వెలుగొండ ప్రాజెక్టుపై జగన్ చేసిన ట్వీట్ కు తెలుగుదేశం ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ దీటుగా బదులిచ్చారు. జనం ఘోరంగా ఓడిస్తే తాడేపల్లి, బెంగళూరుల మధ్య షటిల్ సర్వీస్ చేస్తున్న జగన్ తగుదునమ్మా అని ప్రాజెక్టుల గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసం జగన్ వేస్తున్న వేషాలను జనం విశ్వసించరని చెప్పారు.
ఐదేళ్లు అధికారంలో ఉండి కూడా వెలిగొండ ప్రాజెక్టు పనులు పూర్తి చేసి నీరివ్వలేకపోయిన జగన్ బెంగళూరు ప్యాలెస్ లో కూర్చుని ట్వీట్లు చేయడం తగదన్నారు. గత ప్రభుత్వ హయాంలోనే 80 వెలిగొడ ప్రాజెక్టు పనులు 80శాతం పూర్తయ్యాయనీ, 2019లో అధికార పగ్గాలు చేపట్టిన జగన్ తన ఐదేళ్ల పాలనలో ఆ మిగిలిన 20 శాతం పనులు పూర్తి చేయలేకపోయారనీ వివరించారు. ప్రాజెక్టుల గురించి పట్టించుకోకుండా సర్వేరాళ్లపై తన బొమ్మల కోసం వందల వేల కోట్లు తగలేశారని విమర్శించారు. సాగునీటి రంగానికి, రాష్ట్ర రైతాంగానికి జగన్ ఐదేళ్ల పాపపు పాలన ఒక శాపంగా మారిందన్నారు. ఈ సంగతి ఫేక్ రాజకీయం చేసే జగన్ కు తప్ప రాష్ట్రంలోని ప్రతి పౌరుడికీ తెలుసన్నారు. తప్పుడు ప్రచారంతో ఎల్లకాలం రాజకీయం సాగదు అని జగన్ అని హెచ్చరించారు.