కొత్త పార్టీలతో తెలుగుదేశం, జనసేనలకు చెక్.. జగన్ కొత్త స్కెచ్
posted on Oct 27, 2022 6:40AM
ఎన్నికలు సమీపిస్తున్నాయి.. ఆ క్రమంలో రాజకీయ పార్టీల అధినేతలు.. అధికార పీఠాన్ని కైవసం చేసుకోవడం కోసం.. ఆస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఆ క్రమంలో ఓట్లర్ల ఓట్లు కొల్లగొట్టేందుకు ఎంత చేయాలో.. ఎలా చేయాలో.. ఏమి చేయాల్లో.. ఆలోచిస్తూ.. అందుకు అనుగుణంగా వ్యూహా రచనకు శ్రీకారం చుడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో అధికార పార్టీ మళ్లీ అధికారాన్ని అందుకోనేందుకు.. అదీ కూడా 175కి 175 సీట్లు కైవసం చేసుకోవడం కోసం.. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కొత్తకొత్త స్కెచ్ లకు శ్రీకారం చుడుతున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
రాష్ట్రానికి మూడు రాజధానులు.. అదీ విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధాని అంటూ ఇటీవల జగన్ పార్టీ.. విశాఖ గర్జన పేరిట భారీ బహిరంగ సభను నిర్వహించింది. అదే రోజు విశాఖ ఎయిర్ పోర్ట్ వేదికగా చోటు చేసుకున్న పరిణామాలు అయితేనేమి.. ఆ తర్వాత కొద్ది రోజులకే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో చేసిన హాట్ కామెంట్స్ అయితేనేమి.. అదే రోజు.. సాయంత్రం విజయవాడలో పవన్‌తో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ కావడం అయితేనేమి.. ఆ కొద్ది సేపటికే చంద్రబాబుతో కలిసి పవన్ కల్యాణ్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం అయితేనేమి.. ఈ మొత్తం ఎపిసోడ్‌తో మళ్లీ చంద్రబాబు, పవన్ జత కట్టి వచ్చే ఎన్నికల్లో పోటీకి వెళ్తున్నారంటూ.. జగన్ ఓ నిర్ణయానికి వచ్చేశారంటున్నారు. దీంతో జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేస్తే.. తాము లక్ష్యంగా పెట్టుకున్న.. 175 సీట్లలో భారీగా కోత పడే అవకాశం ఉందని జగన్.. ఫిక్స్ అయిపోయినట్లు వారు చెబుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఓట్లు భారీగా చీల్చే ప్రక్రియకు సీఎం జగన్ పథక రచన చేస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి. మరిన్ని కొత్త రాజకీయ పార్టీలను తెరపైకి తీసుకు వచ్చి.. వాటి ద్వారా ఓట్లను చీల్చి ప్రత్యర్థులను దెబ్బకొట్టాలన్న లక్ష్యంతో సీఎం జగన్ వ్యూహరచన చేస్తున్నారని పరిశీలకులు అంటున్నారు.
ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్.. తన పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చేశారు. ఈ పార్టీ సైతం వచ్చే ఎన్నికల్లో ఏపీలో పోటీ చేయనుందని... అందుకోసం ఇప్పటికే కేసీఆర్... ఏపీలో తన పాత స్నేహితులతో టచ్‌లోకి వెళ్లి.. అడపా దడపా వాళ్లతో చిట్ చాట్ చేస్తున్నారని తెలుస్తోంది. అంతేకాదు.. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత.. సీఎం కేసీఆర్.. ఏపీలో పర్యటించేందుకు ప్రణాళికలు సైతం సిద్దం చేసుకొంటున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో ఏపీలోని వివిధ రాజకీయ పార్టీల్లోని పలువురు అసంతృప్తులను తన వైపునకు తిప్పుకునేందుకు కేసీఆర్.. ఓ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. దాంతో వివిధ పార్టీల్లోని కీలక నాయకులు కేసీఆర్..కారెక్కినా ఆశ్చర్య పోనక్కర్లేదని రాజకీయవర్గాలలో బలంగా వినిపిస్తోంది.
మరోవైపు వైయస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల భర్త, సీఎం జగన్ బావ బ్రదర్ అనిల్‌తో కూడా ఏపీలో పార్టీ స్థాపిస్తే.... తమ పార్టీ గెలుపు నల్లేరు మీద నడకే అవుతుందనే ఓ ఆలోచనలో రాజన్న ముద్దు బిడ్డ..జగన్ ఉన్నట్లు తెలుస్తోందని వారు అంటున్నారు.
ఇంకో వైపు.. మూడు రాజధానుల ఆస్త్రం ఉండనే ఉంది.. దీంతో ఆయా ప్రాంతాల మధ్య చిచ్చు రగిల్చిన చిచ్చు.. ప్రస్తుతం మిణుకు మిణుకు మంటోంది. దీనిని కొద్దిగా కదిలిస్తే.. చాలు.. ప్రజలు ఎలాంటి.. ఎవరి ప్రమేయం లేకుండానే.. రగిలిపోతారని... దీంతో ఓట్లు ఆటోమెటిక్‌గా చీలిపోయే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
అలాగే.. పుట్టగొడుగుల్లాగా రాజకీయ పార్టీలు ఏర్పాటయ్యేలా చేసి.. వాటి ద్వారా... వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలను దెబ్బ కొట్టేందుకు జగన్ పక్కా ప్రణాళికలతో ముందుకు వెల్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.