సిద్ధం సభలా? మద్యం సభలా?
posted on Feb 19, 2024 8:35AM
వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి మరోసారి అధికారంలోకి వచ్చేందుకు నానా తంటాలు పడుతున్నారు. త్వరలో సార్వత్రిక ఎన్నికల సమరానికి తెరలేవనున్న నేపథ్యంలో సిద్ధం పేరుతో సభలు నిర్వహిస్తున్నారు. ఈ సభలకు జనాన్ని తరలించడం వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలకు తలకుమించిన భారంగా మారింది. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన నాటినుంచి ఏపీలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయింది. కేవలం కక్షపూరిత రాజకీయాలతో జగన్ నాలుగున్నరేళ్ల పాలన సాగింది. దీంతో వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అన్నివర్గాల్లోనూ ఇదే పరిస్థితి ఉండటంతో వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. దీనికితోడు జగన్ మోహన్ రెడ్డి సిద్ధం పేరుతో నిర్వహిస్తున్న భలకు జనాన్ని తరలించడం స్థానిక వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలకు పెద్ద సవాల్‌గా మారింది. గ్రామాల వారిగా వైసీపీ నేతలు టార్గెట్ లు పెట్టుకొని జనాన్ని తరలించాల్సి వస్తోంది. ఇందు కోసం సభలకు జనాలను తీసుకురావడానికి వారికి భారీ మొత్తంలో నజరానాలు చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్థానిక వైసీపీ నేతలు అంతర్గత సంభాషణల్లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన సిద్ధం సభకు భారీగా జనాన్ని తరలించాలని వారం రోజుల కిందటే వైసీపీ అధిష్టానం ప్లాన్ చేసింది. రాయలసీమ జిల్లాల్లోని వైసీపీ ప్రజాప్రతినిధులు, నేతలకు ఆ మేరకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో జగన్ సభ అంటే జనాలు స్వతహాగా తండోపతండాలుగా తరలివస్తారన్న భ్రమల్లో ఉన్న వైసీపీ నేతలకు గ్రామాల్లోకి వెళ్తే కానీ అసలు విషయం బోధపడలేదు. చాలా గ్రామాల్లో వైసీపీ కార్యకర్తలు సైతం జగన్ సభ అంటే వచ్చేది లేదని తేల్చిచెప్పడతో వైసీపీ నేతలు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైసీపీ అధిష్టానం నుంచి ఒత్తిడి ఒకవైపు.. స్థానికంగా పెల్లుబికుతున్న ప్రజా వ్యతిరేకత మరోవైపు.. దీంతో బలవంతంగా మద్యం, డబ్బులు ఇచ్చి ఆర్టీసీ బస్సులు, ప్రత్యేక వాహనాల్లో సిద్ధం సభకు జనాన్ని తరలించాల్సి వచ్చింది. డబ్బుకు, మద్యానికి లొంగని వారికి పథకాలు నిలిపివేస్తాం, పింఛన్ ఆపేస్తాం అంటూ బెదిరింపులకు గురిచేసి సభకు తరలించినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తొలి రెండు సిద్ధం సభలకు అష్టకష్టాలుపడి వైసీపీ నేతలు, అధికారులు జనాన్ని తరలించినా.. జగన్ ప్రసంగం ప్రారంభమైన కొద్దిసేపటికే సభనుంచి వెళ్లిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో జగన్ స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలపై తీవ్రస్థాయిలో మండిపడినట్లు తెలిసింది. రాప్తాడు సభలో అలా జరగకుండా ఉండేందుకు వైసీపీ నేతలు అనేక ప్రయత్నాలు చేశారు. బస్సుల్లో తరలిస్తున్న సమయంలోనే జనాలకు మద్యం బాటిళ్లు ఇవ్వడంతోపాటు స్టఫ్ గా ఉడక బెట్టిన గుడ్డు, బిర్యానీ ప్యాకెట్లను అందజేశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియా చక్కర్లు కొడుతున్నాయి. స్థానిక ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో పక్క రాష్ట్రాల వారినికూడా డబ్బులు, మద్యం అందజేసి జగన్ సిద్ధం సభకు తరలించిన పరిస్థితి. రాప్తాడు పరిసర ప్రాంతాల్లోని మద్యం దుకాణాలు వైసీపీ శ్రేణులతో కిక్కిరిసిపోయాయి. ఇంత చేసినా ఈ సభలోనూ జగన్ ప్రసంగం ప్రారంభమైన కొద్ది నిమిషాలకే ప్రజల సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో జగన్ సిద్ధం సభలు కాస్తా.. మద్యం సభలుగా మారిపోయాయని నెటిజనులు సెటైర్లు వేస్తున్నారు.
తాజా పరిస్థితులను గమనిస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు, నూతనంగా నియోజకవర్గాల ఇంచార్జిగా నియమితులైన వారు తమ విజయంపై నమ్మకం వదిలేసుకున్నారు. ఈ విషయాన్ని వైసీపీ శ్రేణులే చెబుతున్నాయంటే పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో ఇట్టే అవగతమౌతుంది. ఏ గ్రామంలోకి వెళ్లినా సొంత పార్టీ కార్యకర్తల నుంచే నేతలకు వ్యతిరేకత వ్యక్తమవుతున్న పరిస్థితి. తెలుగుదేశం, జనసేన కూటమివైపు ప్రజలు మొగ్గు చూపుతున్నట్లు గ్రామ స్థాయి నుంచి జిల్లా కేంద్రం వరకు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉండటంతో వైసీపీకి ఈసారి కనీసం 20 నుంచి 30 సీట్లు వచ్చినా గొప్పేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తానికి సిద్ధం సభలతో వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుదామనుకున్న జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నం బెడిసికొట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.