భద్రత పేరిట ఇంత బరితెగింపా జగన్?
posted on Jun 25, 2024 6:20AM
జగన్ ఒక ఉన్మాది. జగన్ ఒక విపరీత మనస్కుడు. ఆయనది ప్రత్యర్థులను శత్రువులుగా భావిస్తారు. అహంభావి అని ఇంత కాలం ప్రత్యర్థులు విమర్శలు చేస్తే జనం ఏమిటో అనుకున్నారు. జగన్ అధికారం కోల్పోయిన తరువాత వెలుగులోకి వస్తున్న అంశాలను చూసి జగన్ పై ఇంత కాలం వచ్చిన విమర్శలు అసలు విమర్శలే కావనీ ఆయన విపరీత మనస్తత్వాన్నీ, వైపరీత్యం అన్నదగ్గ తీరును చెప్పడానికి నిఘంటువులో పదాలు చాలవు, కొత్త పదాలను వెతుక్కోవలసిందేనని అంటున్నారు.
జగన్.. ప్రపంచంలో అందరికంటే తానే గొప్ప అని ఫీల్ అవుతున్నారా? ప్రధాని, రాష్ట్రపతి కంటే తనకే ఎక్కువ భద్రత అవసరమని భావిస్తున్నారా? తన గొప్పతనాన్ని చాటుకునేందుకు
కళ్లు చెదిరే ప్యాలెస్‌లు నిర్మించుకున్నారా? తన గోప్పతనాన్ని, ఎదుగుదలను ఓర్వలేక తనను అంతమెందించడమే లక్ష్యంగా ప్రత్యర్థులు, శత్రువులు పొంచి ఉన్నారని అనుకుంటున్నారా? అంటే ఆయన తన కోసం తాను నియమించుకున్న ప్రైవేట్ సెక్యూరిటీని చూస్తే ఔననే అనాల్సి వస్తోంది. రాష్ట్రపతి, ప్రధానమంత్రికి మించిన భద్రత.. దేశంలో ఎవరికీలేని స్థాయిలో సెక్యూరిటీని జగన్ తన ప్యాలెస్‌ల వద్ద నియమించుకున్న జగన్ తీరును బరితెగింపుగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఉగ్రవాదుల నుంచి ఎప్పుడు ఎలా ఎటు నుంచి ముప్పుఉంటుందో తెలియని పరిస్థితుల్లో జీవనం సాగించే పెద్దపెద్ద దేశాధినేతలకు సైతం లేనంతగా జగన్ తన ప్యాలెస్‌ల వద్ద సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు. జగన్ ప్యాలెస్‌ల వద్ద భద్రతా సిబ్బంది లెక్కలు చూస్తుంటే జనం నోరెళ్లబెడుతున్నారు. జగన్ మితిమీరిన భద్రతపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. సీఎంగా ఉన్నప్పుడు ఎక్కడాలేని విధంగా భారీ భద్రత కల్పించుకున్నారని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ఐదేళ్ల కాలంలో ప్రజల జీవితాలతో ఆడుకున్న జగన్ సెక్యూరిటీ మాన్యువల్ ఉల్లంఘించి తన ఇంటి పరిసరాల్లోకి ఎవరూ రాకుండా భద్రతను ఏర్పాటు చేసుకోవటం గమనార్హం. దీనికి తోడు ప్యాలెస్‌ల వద్ద డ్రోన్లు ద్వారా భద్రతను పర్యవేక్షించేలా ఏర్పాట్లు సైతం చేసుకున్నాడు. ప్రజలకు ప్రభుత్వ ఫలాలు అందిస్తూ, వారి సమస్యలను పరిష్కరిస్తూ, వారి మెరుగైన జీవనంకోసం పాలన సాగించాల్సిన జగన్ మోహన్ రెడ్డి.. ప్రజా పాలనను మరిచి ఐదేళ్ల కాలంలో తన భద్రతకే ప్రాధాన్యతనిచ్చారని తాజా పరిణామాలను బట్టి చూస్తే స్పష్టంగా అర్ధమవుతుంది.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో వైయస్ జగన్‌కు కళ్లు చెదిరే ప్యాలెస్‌లున్నాయి. వాటి వద్ద వందలాది మందితో భద్రతా వలయం ఏర్పాటు చేసుకున్నారు. అలాగే స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ పేరుతో దేశంలో మారే ఇతర ముఖ్యమంత్రికి లేని స్థాయిలో వ్యక్తిగత భద్రతా సిబ్బందిని సైతం ఆయన నియమించుకున్నారు. దేశం, రాష్ట్రంలో ఉన్నప్పుడే కాదు.. విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడు సైతం తనకు భద్రత కల్పించేలా సీఎం జగన్ అసాధారణ రీతిలో ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నారు. వివిధ ప్రాంతాల్లో తనకున్న ప్యాలెస్‌ల వద్ద 986 మందితో నిరంతర భద్రతా ఏర్పాట్లు చేసుకున్నారు. తాడేపల్లి ప్యాలెస్ వద్ద స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ నుంచి 379 మంది, ఇతర విభాగాల నుంచి 439 మంది, అలైడ్ విధులకోసం 116 మంది కలిపి 934మందితో భద్రత ఏర్పాటు చేసుకోగా.. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ ప్యాలెస్ వద్ద తొమ్మిది మంది, ఇడుపులపాయం ప్యాలెస్ వద్ద 33 మంది, పులివెందుల నివాసం వద్ద 10మందితో పోలీసుల భద్రతను జగన్ ఏర్పాటు చేసుకున్నారు. అంతేకాదు.. కనీవినీ ఎరగని స్థాయిలో తాడేపల్లి ప్యాలెస్ చుట్టుపక్కల 48చోట్ల చెక్‌పోస్టులు, ఔట్ పోస్టులు, పోలీస్ పికెట్లు, బారికేడ్లతోపాటు 439 మందితో భద్రత ఏర్పాటు చేసుకోవడం అంటే.. జగన్ తనను తాను ఏ స్థాయిలో ఊహించుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ఏకంగా 15 కంపెనీలకు, రెండు బెటాలియన్లకు సరితూగే సిబ్బందితో జగన్ భద్రత ఏర్పాటు చేసుకోవటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నది.
తాడేపల్లిలోని ప్యాలెస్ వద్ద జగన్ మోహన్ రెడ్డి నియమించుకున్న భద్రతను చూసి ఏపీ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఉగ్రవాదుల నుంచి ప్రమాదం పొంచి ఉన్నవారికి కూడా ఈ స్థాయిలో భద్రత ఉండదని.. జగన్‌కు ఏమైనా మాఫియా డాన్ లతో విబేధాలున్నాయా అనే అనుమానాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు. తాడేపల్లి ప్యాలెస్ భవనానికి జగన్ ఏర్పాటు చేసుకున్న రక్షణ వలయం చూస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి. ప్యాలెస్ లో 30 అడుగుల ఐరన్ వాల్ ను జగన్ ఏర్పాటు చేసుకున్నారు. ప్యాలస్‌కు ఇద్దరు డిఎస్పీలు, ఒక అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులతో నిరంతరం భద్రతా పర్యవేక్షణ నిర్వహించేలా జగన్ చర్యలు తీసుకున్నారు. అయితే, జగన్ భద్రత అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఆరా తీస్తోంది. ఇదిలాఉంటే.. జగన్‌కు ఇంత భద్రత ఎందుకు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జగన్ అధికారంలోకి వచ్చిన నాటినుంచి రక్షణ కవచంలోనే ఉంటూ వచ్చారు. 2019 ఎన్నికలకు ముందు జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రతో ప్రజల్లోకి సుదీర్ఘకాలం తిరిగారు. కానీ, 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తరువాత తాడేపల్లి ప్యాలెస్ కే జగన్ పరిమితమయ్యాడు.
గత ఐదేళ్లూ అధికారంలోఉన్న జగన్ మోహన్ రెడ్డి ఏదైనా ప్రైవేట్, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బయటకు వచ్చినప్పుడు అధికారులు ఆయన పర్యటించే రహదారులకు ఇరువైపులా పరదాలు కట్టేవారు. అధికారంలో ఉండికూడా ప్రజల్లోకి జగన్ ఎందుకు ధైర్యంగా రాలేకపోతున్నారన్న విమర్శలు గతంలో వెల్లువెత్తాయి. జగన్ మోహన్ రెడ్డికి ఎవరి నుంచి ప్రమాదం ఉంది.. రాష్ట్రపతి, ప్రధానమంత్రికి సైతం లేని స్థాయిలో జగన్ భద్రతను ఎందుకు ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది? అసలు ప్రజల్లోకి రావాలంటే జగన్ కు ఎందుకంత భయం.. ఏ నిబంధనలతో జగన్ ఆ స్థాయిలో భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నారు అనే అంశాలపై స్పష్టత రావాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.