సొమ్ములు పడకపోతేనేం.. బటన్ నొక్కేశారుగా?
posted on Mar 14, 2024 @ 9:50AM
జగన్ ప్రభుత్వం పని మాయసభను మించిపోయింది. మయసభలో లో లేనివి ఉన్నట్లు, ఉన్నవి లేనట్లు కనిపించే కనికట్టు ఉన్నట్లుగానే.. జగన్ సర్కార్ కూడా చేసినది చేయనట్లు, చేయనిది చేసినట్లు మాటలతో మాయ చేసేస్తారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో 99శాతం అమలు చేశామని ఘనంగా చెప్పుకుంటారు. ఇంతకీ అమలైనవి ఏమిటయ్యా అని చూస్తే.. ఒక శాతం కూడా ఉండవు. కానీ ప్రచారం మాత్రం ఆ ఒక్కశాతం కూడా అమలైపోయిందేమో పాపం ప్రభుత్వమే సరిగా చూసుకుని ఉండదు అనుకునే లెవెల్ లో ఉంటుంది. కానీ వాస్తవంలో జగన్ ఇచ్చిన హామీలలో కనీసం 10శాతం కూడా ఈ ఐదేళ్లలో నెరవేర్చ లేదు.
నవరత్నాల పేరిట జగన్నాటకం ఆడారే కానీ మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలలో, అలాగే పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన వేల వేల హామీలలో ఇప్పటికి కనీసం పది శాతం కూడా నెరవేరలేదు. రైతు భరోసా కింద 12 హామీలు ఇచ్చినా వాటిలో ఒక్కటీ అమలు కాలేదు. అలాగే వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద ఇచ్చిన 8 హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదు. పింఛన్ల పెంపు కింద ఇచ్చిన 3 హామీల్లో రెండింటిని పూర్తిగా విస్మరించారు. ఇలా మాటలకూ చేతలకూ పొంతన లేని జగన్ పాలన పూర్తిగా అవాస్తవాల పునాదులపై సాగుతోంది. క్రమం తప్పకుండా బటన్ నొక్కి సొమ్ములు లబ్ధిదారుల ఖాతాలలో జమ చేస్తున్నానంటూ ఘనంగా చాటుకుంటున్న ముఖ్యమంత్రి వాస్తవంగా బటన్ మాత్రమే నొక్కుతున్నారు. ఆ తరువాత ఎంత కాలానికి ఆ సొమ్ములు లబ్ధిదారుల ఖాతాలలో పడతాయో మాత్రం చెప్పడం లేదు.
తాజాగా అనకాపల్లిలో ఆర్భాటంగా బహిరంగ సభ ఏర్పాటు చేసి మరీ చేయూత పథకం లబ్ధిదారుల ఖాతాలలో సొమ్ములు వేస్తున్నానంటూ బటన్ నొక్కారు. అది జరిగా వారం రోజులు దాటిపోయినా ఇంత వరకూ ఒక్క లబ్ధిదారుడి ఖాతాలో కూడా చేయూత సొమ్ములు పడిన దాఖలాలు లేవు. ఇహనో, ఇప్పుడో ఎన్నికల కోడ్ అమలులోకి వస్తే ఇక ఆ పడని డబ్బుల గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. కానీ బటన్ నోక్కాను, సొమ్ములు పంచాను అన్న ప్రచారం మాత్రం ఘనంగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అసలు బటన్ నొక్కుడు కార్యక్రమాన్ని జగన్ ఎంత ఫార్సుగా మార్చేశారంటే.. ఆయన ప్రభుత్వ కార్యక్రమం అంటూ ప్రజాధనంతో కోట్లు వెచ్చించి సభ ఏర్పాటు చేస్తారు. ఆర్టీసీ బస్సులలో బతిమలాడో, భయపెట్టో జనాలను తరలించేస్తారు. బలవంతంగా వచ్చిన వారు జగన్ ప్రసంగం మధ్యలోనే లేచి వెళ్లిపోవడం వేరే సంగతి. కానీ చేయూత పథకం కింద లబ్ధిదారులకు సొమ్ములు పంచాలంటే అందుకు ఆర్థిక శాఖ నిధులు మంజూరు చేస్తూ విడుదల ఆర్డర్ ఇవ్వాలి. కానీ అలాంటిదేమీ లేకుండానే ఉత్తుత్తి బటన్ నొక్కేసి జగన్ చేతులు దులిపేసుకున్నారు.
ప్రచారం మాత్రం వీర లెవల్ లో చేసేసుకున్నారు. ఉత్తుత్తి బటన్ నొక్కి, ఆ సందర్భంగా చేసిన ప్రసంగంలో మాత్రం విపక్షాల నాయకులను విమర్శించేసి ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నారు. సొమ్ములు రాలేదంటూ లబ్ధిదారులు చేస్తున్న ఆందోళనలను పట్టించుకోవడం లేదు. స్థానిక నాయకులను అడిగితే సొమ్ములు పడకపోతే మాత్రం ఏమయ్యింది.. జగన్ సార్ బటన్ నొక్కేశారుగా అంటూ జారుకుంటున్నారు. ఎలాగూ ఈ వారంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చేస్తుంది కనుక ఇక సొమ్ములు ఎగ్గొట్టేయొచ్చు. అదీ సంగతి.