Read more!

జగన్ బ్యాండేజీ తీసేశారు.. సెప్టిక్ భయమే కారణమా?!

జగన్ గులకరాయి దాడిలో గాయపడి రెండు వారాలుగా కంటికి వేసుకున్న బ్యాండ్ ఎయిడ్ ఎట్టకేలకు తీసేశారు. హఠాత్తుగా ఆయన బ్యాండేజీ తీయడానికి ఆయన బాబాయ్ కుమార్తె డాక్టర్ సునీత సెప్టిక్ అవుతుంది జాగ్రత్త అన్నయ్యా అని చేసిన హెచ్చరికే కారణమా? అంటూ నెటిజనులు ట్రోల్ చేస్తున్నారు.

మేమంతా సిద్ధం అంటూ ఆయన చేపట్టిన బస్సుయాత్ర విజయవాడలో సాగుతున్న సమయంలో ఆయనపై రాయి దాడి జరిగింది. ఆ దాడిలో ఆయన కంటి పైభాగాన గాయమైంది.   ఆ దాడిని హత్యాయత్నంగా అభివర్ణిస్తూ సెంటిమెంట్ ను పండించి ఎన్నికల గండం గట్టెక్కాలని వైసీపీ విశ్వ ప్రయత్నం చేసింది. కోడికత్తి దాడిలా ఈ దాడి కూడా జగన్ పై ప్రజలలో సానుభూతి పొంగి పొర్లిపోయి ఓట్లు రాలుస్తుందని భావించింది. అయితే వైసీపీ ప్రయత్నం నవ్వుల పాలైందది. జగన్ ప్రతిష్ఠ దిగజారింది. ఆ దాడి జగన్ చేత జగన్ కోసం జగనే చేయించుకున్న దాడి అంటూ నెటిజన్లు ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు.

వాటిని వేటినీ పట్టించుకోకుండా ఆ దాడి హత్యాయత్నమేననీ, దీని వెనుక ఉన్నది చంద్రబాబు, తెలుగుదేశమేననీ వైసీపీ నేతలు జనాలను నమ్మించడానికి శతధా ప్రయత్నించి విఫలమయ్యారు. ఈ దాడి కేసులో తెలుగుదేశం నేతను ఇరికించడానికి చేసిన ప్రయత్నమూ విఫలమైంది. దాడి విషయంలో భద్రతా వైఫల్యం ఏమీ లేదనీ, పోలీసుల వైఫల్యం అస్సలు లేదనీ ప్రభుత్వ సలహాదారు మీడియా ముందుకు వచ్చి మరీ నెత్తీ నోరూ బాదుకుని చెప్పారు. అయినా  ఎన్నికల సంఘం నమ్మలేదు. రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ కమిషనర్ ఆఫ్ పొలీస్ పై బదలీ వేటు వేసింది. ఎన్నికలకు సంబంధం లేని విధులను కేటాయించాల్సిందిగా ఆదేశించింది.  దీంతో జగన్ పరిస్థితి వ్రతమూ చెడింది, ఫలితమూ దక్కలేదన్నట్లు తయారైంది. దానికి తోడు కుట్లు పడేలా అయిన గాయానికి బ్యాండ్ ఎయిడ్ తో జనం ముందుకు వచ్చి ఏదో కాస్తయినా సెంటిమెంటును పిండుకుందామనుకున్నారు. అయితే గాయం తగిలిన వెంటనే వేసిన బ్యాండ్ ఎయిడ్ కూ డాక్టర్ల బృందం చికిత్స తరువాత వేసిన బ్యాండ్ ఎయిడ్ కు సైజులో వ్యత్యాసం ఉండటంతో జగన్ గాయంపై నెటిజన్లు సెటైర్లు వేశారు.  

ఆ ట్రోలింగ్ రోజురోజుకూ పెరుగుతుండటం కారణమో, వైద్యులు సరైన సలహా ఇవ్వలేదా? బ్యాండేజీ ఎక్కువ రోజులు ఉంటే గాయం మానదు, సెప్టిక్ అవుతుంది జాగ్రత్త అంటూ డాక్టర్ సునీత చేసిన హెచ్చరికతో భయపడో తెలియదు కానీ జగన్ మొత్తానికి శనివారం బ్యాండ్ ఎయిడ్ లేకుండా దర్శనమిచ్చారు. సరే ఇక్కడ విశేషం ఏమిటంటే రాయిదాడిలో తగిలిన గాయానికి కొన్ని కుట్లు కూడా పడ్డాయని చెప్పుకున్న జగన్ రెండు వారాల తరువాత ఆ బ్యాండ్ ఎయిడ్ తీసేసిన తరువాత గాయం జరిగిన ప్రాంతంలో చిన్న మచ్చ, గీత కూడా లేకపోవడం విశేషం. ఈ జగన్మాయ ఏమిటి ముఖ్యమంత్రిగారూ అంటూ సామాజిక మాధ్యమంలో నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.