జగన్ కొత్త ప్లాన్.. ఛీకొడుతున్న జనం
posted on Jun 26, 2024 8:29AM
అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీ సాంప్రదాయాలు, నియమాలు మరిచి అధికార మదంతో మాట్లాడిన మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఇప్పుడు నియమాలు గుర్తుకొస్తున్నాయి. అసెంబ్లీలో అలా ఉండాలి, ఇలా ఉండాలి, నియమాలు పాటించాలంటూ దెయ్యాలు వేదాలు వల్లె వేసినట్లుగా జగన్ మాట్లాడుతున్నారు. తాను తలచుకుంటే తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష హోదాకూడా ఉండదని అసెంబ్లీ సాక్షిగా నాటి ప్రతిపక్షనేత చంద్రబాబుపై నోరుపారేసుకున్న జగన్.. ఇప్పుడు మాత్రం నీతి సూత్రాలు చెబుతున్నారు. ఐదేళ్లు అసెంబ్లీ గౌరవం పోయేలా ఇష్టానుసారంగా ప్రవర్తించి ప్రజల చేత ఛీ కొట్టించుకున్న జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు సుద్దులు చెబుతున్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు కుటుంబం పై నిండుసభ సాక్షిగా వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన నీచమైన వ్యాఖ్యలు జగన్ మర్చిపోయినట్లున్నారు. సభా నియమాలు పాటించాలంటూ గొప్ప గొప్ప మాటలు చెబుతూ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి జగన్ ఓ లేఖ రాశారు. వైసీపీ హయాంలో అసెంబ్లీ జరిగిన తీరు, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలపై వైసీపీ ఎమ్మెల్యేలు ప్రవర్తించిన తీరు ఇప్పటికీ ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. కానీ ప్యాలెస్ రాజు జగన్ మోహన్ రెడ్డికి అవేమీ పట్టవు. ఐదేళ్ల పాలనలో ప్రతిపక్ష నేతలు, ప్రజల పట్ల తాను అరాచకంగా వ్యవహరించినప్పటికీ.. అవన్నీ మర్చిపోయి గాంధీగారిలా ఒకచెంప కొడితే మరో చెంప చూపాలని అన్నట్లుగా అధికార పార్టీ నేతలను జగన్ కోరుతుండటం విడ్డూరం.
ఏపీలో భారీ మెజార్టీతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోని మాజీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి పట్ల సభ గౌరవ ప్రదంగా వ్యవహరించింది. అసెంబ్లీ నిబంధనల ప్రకారం సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. కానీ కూటమి ప్రభుత్వం జగన్ పట్ల మర్యాదపూర్వంగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. ఆయన కూడా సిగ్గుపడాల్సినంత ఉదారంగా వ్యవహరించి మంత్రుల తరువాత జగన్ కు ప్రమాణ స్వీకారం చేసేందుకు అవకాశం కల్పించింది. ప్రమాణ స్వీకారానికి ముందు అసెంబ్లీ హాల్‌లోకి వచ్చిన జగన్.. ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసి వెంటనే అసెంబ్లీ హాల్ నుంచి వెళ్లిపోయాడు. అసెంబ్లీలో జగన్ పట్ల కూటమి పార్టీ సభ్యులు వ్యవహరించిన తీరును ప్రజలు సైతం మెచ్చుకున్నారు. అయితే జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం పూర్తయిన నాలుగు రోజుల తరువాత.. అసెంబ్లీలో మీరు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడుకు లేఖ రాయడం ఏపీ ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. జగన్ తీరు పట్ల వెగటు పుట్టిస్తోంది. ఐదేళ్ల కాలంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కనీసం మనుషుల్లా కూడా గౌరవించకుండా కౌరవ సభను నడిపిన జగన్.. ఇప్పుడు మాత్రం అసెంబ్లీ నియమాలు అంటూ కొత్త విషయాలు ప్రస్తావించడం వైసీపీ నాయకులకు కూడా చిరాకు తెప్పిస్తోంది.
స్పీకర్ కు జగన్ రాసిన లేఖను ఓసారి పరిశీలిస్తే, మంత్రుల తర్వాత తనతో ప్రమాణ స్వీకారం చేయించడం నిబంధనలకు విరుద్ధమని జగన్ పేర్కొన్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని ముందే నిర్ణయించుకున్నట్టున్నారు, విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్నది అసెంబ్లీ రూల్స్ అంటూ కొత్త వాదాన్ని జగన్ తెరపైకి తెచ్చారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటే 10శాతం సీట్లు వుండాలని ఎక్కడా లేదు, పార్లమెంట్, ఉమ్మడి ఏపీలో ఈ నిబంధనలు పాటించలేదంటూ జగన్ లేఖలో పేర్కొన్నాడు. కూటమి సభ్యులు, స్పీకర్ తనపై పై శత్రుత్వం ప్రదర్శిస్తున్నారు. చచ్చేదాకా కొట్టాలి అంటూ స్పీకర్ గతంలో చేసిన వ్యాఖ్యలు బయటపడ్డాయి. అసెంబ్లీలో గొంతువిప్పే పరిస్థితి కనిపించడం లేదు. ప్రతిపక్ష హోదాతోనే ప్రజా సమస్యలను బలంగా వినిపించగలం. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ స్పీకర్ కు రాసిన లేఖలో జగన్ రెడ్డి పేర్కొన్నాడు. జగన్ లేఖలో పేర్కొన్న అంశాలనుచూసి వైసీపీ నేతలు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఐదేళ్ల కాలంలో అసెంబ్లీలో కనీస మర్యాదలు పాటించని మనం.. అధికారం కోల్పోయాక నియమాలు పాటించాలంటూ స్పీకర్ కు లేఖ రాయడం సిగ్గుగా లేదా జగనన్నా అంటూ నివ్వెరపోతున్నారు . అయితే, ఇక్కడ ఓ విషయం తెలుసుకోవాలి. జగన్ మోహన్ రెడ్డి స్పీకర్ కు రాసిన లేఖ వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.
ఐదేళ్లు అధికారంలో కొనసాగిన జగన్.. అసెంబ్లీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కనీస మర్యాద కూడా ఇవ్వలేదు. కానీ, వైసీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చి.. ప్రతిపక్ష హోదాకూడా దక్కకపోయినా.. అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలకు సరియైన గౌరవం ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఇటీవల అసెంబ్లీలో జగన్ కు మంత్రుల తరువాత ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఇచ్చారు. జగన్, వైసీపీ ఎమ్మెల్యేలపట్ల చంద్రబాబు ప్రవర్తించిన తీరు చూసి ప్రజలు హర్షిస్తున్నారు. ఎప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరిగినా వైసీపీ ఎమ్మెల్యేలప ట్ల సభలో మర్యాదగా వ్యవహరిస్తామని, వారు ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు సభలో అవకాశం కల్పిస్తామని చంద్రబాబు చెప్పకనే చెప్పారు. అదే జరిగితే.. గత ఐదేళ్ల కాలంలో అసెంబ్లీ జరిగిన తీరును.. ప్రస్తుతం అసెంబ్లీ జరిగే తీరును చూసి ప్రజల్లో తమపట్ల వ్యతిరేక భావం మరింత ఎక్కువ అవుతుందని జగన్ ఆందోళన చెందుతున్నట్లు కనిపిస్తోంది. దీనికితోడు.. అసెంబ్లీకి వచ్చే ఉద్దేశంలో జగన్ మోహన్‌రెడ్డి లేరని వైసీపీ నేతలే బాహాటంగా చెబుతున్నారు. జగన్ తానంతట తానే అసెంబ్లీకి రాలేదని ప్రజలు అనుకోకుండా.. ఆ నెపాన్ని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం, స్పీకర్ అయ్యన్న పాత్రుడిపై నెట్టేందుకు జగన్ ప్లాన్ చేసినట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.