జగన్ పర్యటన నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి ప్లస్ అయ్యేనా?
posted on Jul 20, 2023 @ 10:34AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్.. శ్రీపోట్టి శ్రీరాములు జిల్లాలో శుక్రవారం పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన వెంకటగిరిలో మాజీ ముఖ్యమంత్రి నేదురుమిల్లి జనార్దన్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. వెంకటగిరి నియోజకవర్గం వైసీపీ ఇన్ ఛార్జీగా నేదురుమిల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు నేదురుమిల్లి రామ్ కుమార్ రెడ్డిని గతంలోనే నియమించిన సంగతి తెలిసిందే.
మరోవైపు 2019 ఎన్నికల్లో వెంకటగిరి నుంచి వైసీపీ అభ్యర్థిగా ఆనం రామ్‌నారాయణ రెడ్డి గెలుపొందారు. కానీ ఆ తర్వాత.. జగన్ ఆయనకు పార్టీలో సరైన గుర్తింపు ఇవ్వలేదన్న కారణంతో ఆనం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ రావడంతో నియోజకవర్గ పార్టీ ఇన్ చార్జిగా నేదురుమిల్లి రామ్ కుమార్ రెడ్డిని నియమిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆనం పార్టీ నుంచి బయటకు వచ్చేందుకు రగ్గం సిద్దం చేసుకొన్నారని అప్పట్లోనే పార్టీ శ్రేణుల్లో విస్తృత చర్చ జరిగింది. కాగా ఏపీలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలుపొందడంతో... పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్నారంటూ నెల్లూరు జిల్లాకు చెందిన పెద్దారెడ్లు.. ఆనం రామ్‌నారాయణ్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీదర్‌రెడ్లితో పాటు గుంటూరు జిల్లాకు చెందిన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై వైసీపీ సస్పెన్షన్ వేటు వేసింది.
దీంతో సస్పెన్షన్ వేటు పడిన నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలకు టీడీపీ మద్దతు ప్రకటించించిన విషయం విదితమే. మరోవైపు గత ఎన్నికల్లో జిల్లాలోని మొత్తం 10 స్థానాలు జగన్ పార్టీ ఖాతాలో పడ్డాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని.. వచ్చే ఎన్నికల్లో గంపగుత్తగా 10 స్థానాలూ టీడీపీ ఖాతాలో పడినా ఆశ్చర్య పోనక్కర్లేదనే ఓ ప్రచారం సైతం నెల్లూరు జిల్లాలో సాగుతోంది.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. యువగళం పేరుతో చేపట్టిన పాదయాత్ర.. ఇటీవల నెల్లూరు జిల్లాలో బ్రహ్మాండమైన ప్రజా స్పందనతో సాగింది. మరో వైపు జిల్లాలో వైసీపీలో అసమ్మతి ఆరున్కొక్క రాగం ఆలపిస్తోంది. ఈ పరిస్థితుల్లో జిల్లాలో సీఎం వైయస్ జగన్.. పర్యటన ఆసక్తిరేపుతోంది. ఆయన పర్యటన పార్టీకి మరీ ముఖ్యంగా వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జ్ నేదురుమల్లి రామ్ కుమార్ కు ఏమైనా ప్లస్ అవుతుందా? లేదా అన్న చర్చ పార్టీ శ్రేణుల్లోనే సాగుతోంది.