ఐదు లక్షల బీమా...పెళ్లికి పుస్తే మెట్టెలు సర్పంచ్ అభ్యర్థి వరాలు
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గ్రామ సర్పంచ్‌గా పోటీ చేసే అభ్యర్థులు గ్రామస్తులపై వరాల జల్లు కురిపిస్తున్నారు. ఒక్కొక్క గ్రామంలో సర్పంచ్‌గా ఎన్నికల్లో నిలబడ్డ వ్యక్తులు అనేక హామీలు ఇస్తూ ప్రజలను మభ్యపెడు తున్నారు. ఇంటింటికి ఐదు లక్షల బీమా, అమ్మాయి పెళ్లికి పుస్తే మెట్టెలు, ఉచిత అంబులెన్స్ అంటూ గ్రామ ప్రజలకు పోటాపోటీగా ఇలా రకరకాల హామీలు ఇస్తున్నారు...
రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కొత్తపేట గ్రామంలో పనుల వనమ్మ నరసింహ యాదవ్ అనే అభ్యర్థి సర్పంచ్‌గా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యం లోనే తనను సర్పంచ్‌గా గెలిపిస్తే ప్రతి ఇంటికి రూ.5 లక్షల చొప్పున జీవిత బీమా చేస్తానని హామీ ఇచ్చాడు.
అయితే ఆ గ్రామంలో 700 ఇండ్లు ఉండగా, ప్రతీ ఇంటికి ఏడాదికి రూ.1200 ప్రీమియం కడితే, ఏడాదికి రూ.8.40 లక్షలు, ఐదేళ్లకు రూ.42.5 లక్షలు అవుతుందని గ్రామస్తులు తెలిపారు. అందుకు వనమ్మ నరసింహ యాదవ్ ఒప్పుకోవడమే కాకుండా ఈ హామీతో పాటు తన మ్యానిఫెస్టోలో మొత్తం 15 హామీలు ప్రకటించాడు.
ఆడబిడ్డ పుడితే బంగారు తల్లి పథకం కింద రూ.5 వేల ఫిక్స్‌డ్ డిపాజిట్, ఆడబిడ్డ పెళ్లికి పుస్తె మెట్టెలు, అబ్బాయి వివాహనికి రూ.5,116 ఇస్తానని, ఊర్లో నెలకోసారి మెడికల్ క్యాంపు నిర్వహణ, శస్త్రచికిత్స అవసరం ఉన్నవారికి రూ.15వేల ఆర్థికసాయం, ఇల్లు కట్టుకునేవారికి స్లాబ్ వేసుకునే సమయంలో రూ.21వేలు, ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలు, బ్యాగులు, బూట్ల పంపిణీ, ఉన్నత చదువులకు ఆర్ధిక సాయం, గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటు
శివరాత్రి, శ్రీరామ నవమి, మొహరం సందర్భంగా ఊర్లో అన్నదానం, రంజాన్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు, గ్రామ భద్రత కోసం అన్ని వీధుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, దహన సంస్కారాలకు రూ.10వేలు, అంత్యక్రియల కోసం వైకుంఠ రథం ఏర్పాటు చేస్తానంటూ మొత్తం 15 హామీలను తన మ్యానిఫెస్టో ద్వారా ప్రకటించాడు.
ఇదిలా ఉండగా మరోవైపు గద్వాల జిల్లా గట్టు మండలం సల్కాపరం గ్రామంలో ఆంజనేయులు అనే అభ్యర్థి సర్పంచ్ గా పోటీ చేస్తున్నారు.తనను గెలిపిస్తే తాను అమలు చేసే 22 హామీలతో మేనిఫెస్టోను వంద రూపాయల బాండ్ పేపర్ మీద రాసిచ్చి, ఈ హామీలను అమలు చేయకపోతే పదవి నుండి తప్పుకుంటానని బాండ్ పేపర్లో పేర్కొన్నాడు.
ఇక సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి మండలంలో ఉన్న గుడితండ గ్రామంలో గుగులోతు జయపాల్ నాయక్ అనే అభ్యర్థి సర్పంచ్ గా పోటీ చేస్తున్నారు... గుడితండ గ్రామ పంచాయితీ సర్పంచ్ గా నన్ను ఎన్నుకుంటే నేను కానీ, నా కుటుంబ సభ్యులు కానీ ఇప్పుడున్న ఆస్తులకు మించి అక్రమంగా ఎంత సంపాదించినా... కూడా అలా పెరిగిన వాటిని గ్రామపంచాయతీ జప్తి చేసి ప్రజలకు పంచవచ్చునని తెలియజేస్తూ.. ఈ బాండ్ పేపర్ మీద రాసి మీ అందరి చేతుల్లో పెడుతున్నాను.
పనులు చేయడానికే ప్రజల దగ్గరికి వచ్చాను. గ్రామపంచాయతీ సొమ్మును అక్రమంగా వాడుకోను అంటూ హామీతో కూడిన మేనిఫెస్టోను వంద రూపాయల బాండ్ పేపర్ మీద రాసిచ్చారు... అనేక గ్రామాల్లో అభ్యర్థులు కురిపిస్తున్న వరాల జల్లు కారణంగా, వారు ఇచ్చే హామీల కారణంగా, వేలం పాట ద్వారా గ్రామస్తు లందరూ కలిస సర్పంచ్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకుంటు న్నారు.
ఇలా అనేక గ్రామాల్లో నివాసముంటున్న గ్రామ ప్రజలు ఆదిలాబాద్ జిల్లాలో 22 మంది, నిజామాబాద్ జిల్లాలో 10 మంది, కామారెడ్డిలో 5 మంది, నిర్మల్ జిల్లాలో 8 మంది, ఖమ్మం జిల్లాలో 6 మంది, జనగామ జిల్లాలో 6, వరంగల్ జిల్లాలో 5 మంది, మహబూబాబాద్ జిల్లాలో 3 మంది, మహబూబ్‌నగర్ జిల్లాలో 2 మంది, ములుగు, భూపాలపల్లి జిల్లాలో ఒక అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు...నల్గొండ జిల్లా కొండమల్లెపల్లి మండలం చిన్న ఆడిశర్లపల్లి గ్రామంలో, గుర్రంపోడు మండలం ములకలపల్లి గ్రామంలో దేవాలయం నిర్మిస్తామని చెప్పిన అభ్యర్థులను కూడా గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.