కుటుంబం విశ్వసనీయత కోల్పోయిన జగన్.. బాబుపై నెపం నెట్టి ఏం ప్రయోజనం!
posted on Feb 3, 2024 @ 1:42PM
2019 ఎన్నికల సమయంలో అందరి వాడుగా ఉన్న జగన్.. అధికారం చేజిక్కించుకుని ఏపీ ముఖ్యమంత్రి అయ్యారు. ఐదేళ్లు గిర్రున తిరిగాయో లేదో అంటే 2024 ఎన్నికల సమయానికి వచ్చే సరికి కేవలం జగన్ గా మిగిలిపోయారు. అవును వైఎస్ కుటుంబం ఆయనకు దూరం అయిపోయింది. సొంత తల్లి, చెల్లే కాదు.. ఆయన బంధుగణం కూడా దాదాపుగా జగన్ కు దూరమైపోయింది. సొంత బాబాయ్ కుమార్తె డాక్టర్ సునీత, సొంత పిన్ని కూడా ఆయనకు దూరమయ్యారు. వీరందరి అండతోనే జగన్ గత ఎన్నికల్లో 151 స్థానాలు కైవసం చేసుకోగలిగారు. నాడు కుటుంబంలో అందరి వాడుగా ఉన్న జగన్ ఇప్పుడు ఒంటరివాడుగా, అంటే ఏకాకిగా మిగిలిపోయారు. తన సుందర ముదనష్ట పాలనతో ప్రజలకు దూరమైన జగన్ తన అహంకారంతో కుటుంబాన్నీ దూరం చేసుకున్నారు. ఇదంతా స్వయంకృతాపరాధమేనని పరిశీలకులు సోదహరణంగా విశ్లేషిస్తున్నారు. అయితే జగన్ మాత్రం తన వాళ్లే తనకు దూరం కావడానికీ, తనకు వ్యతిరేకంగా గళమెత్తడానికి కారణం తాను ఎంత మాత్రం కాదని చెప్పుకుంటున్నారు. తన పార్టీకి చెందిన సామాజిక మాధ్యమంలో, తన సొంత మీడియాలో అందుకు అనుగుణంగా కథనాలు వండి వారుస్తున్నారు.
గతంలో జగన్ ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేశారు. రాజన్న రాజ్యం తీసుకు రావడం కోసం.. తన కుమారుడుకి ఒక్క చాన్స్ ఇవ్వండంటూ అంత వరకూ ఎన్నడూ రాజకీయాలలో ప్రవేశం లేని ఆయన తల్లి విజయమ్మ ప్రజల్లోకి వెళ్లీ మరీ విజ్జప్తి చేశారు. అలాగే జగన్ ముఖ్యమంత్రి కావడం కోసం తాను జగనన్న వదిలిన బాణాన్నంటూ షర్మిల పాదయాత్రే కాదు.. బై బై బాబు అంటూ బస్సు యాత్ర కూడా చేశారు. బయటకు వచ్చి ప్రచారం చేయకపోయినా వైఎస్ వివేకా కుమార్తె కూడా జగన్ పక్కనే నిలబడ్డారు. తన సోదరుడు జగన్ సీఎం అయితేనే తన తండ్రి వివేకా హంతకులకు శిక్షపడుతుందని విశ్వసించారు. అంతే కాకుండా నాటి ఎన్నికలలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే కూడా జగన్ విజయం కోసం వ్యూహాలు రచించారు. ఎత్తుగడలు వేశారు. అయితే ఇప్పుడు ఐదేళ్లు గిర్రున తిరిగే సరికి నాడు తన విజయానికి తోడ్పడిన వీరెవరూ జగన్ తో లేరు.
అలాగే నాడు జగన్ కు సానుభూతి వెల్లువెత్తి విజయం సాధించేందుకు దోహదపడిన వివేహా హత్య కేసు, విశాఖ విమానాశ్రయంలో జరిగిన కోడి కత్తి దాడి కేసులు ఇప్పుడు రివర్స్ లో ఆయనకే ఎదురు తిరిగాయి. రెండు కేసుల్లోనూ కూడా జగన్ సీఎంగా వ్యవహరిస్తున్న తీరు ఆయన మెడకే చుట్టుకునేలా కనిపిస్తోంది. ఆ రెండు కేసుల విచారణలో జరుగుతున్న తీవ్ర జాప్యానికి జగన్ తీరే కారణమని జనం కూడా నమ్ముతున్నారు. వివేకా హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని కాపాడేందుకు జగన్ సర్వశక్తులూ ఒడ్డుతున్నాని అంటున్నారు. అన్నిటి కంటే ముఖ్యంగా వివేకా హత్య విషయంలో విపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని నిర్ద్వంద్వంగా తేలిపోవడమే కాకుండా, తీవ్ర ఆరోపణలకు ఎదుర్కొంటున్న వారికి అండగా నిలవడం కూడా జగన్ పై అందరిలోనూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కారణాల వల్లే జగన్ సొంత కుటుంబీకులకు కూడా కాని వాడుగా మారిపోయారు.
ఇక ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ ఏపీ సారథ్య బాధ్యతలు చేపట్టి సొంత అన్న దుర్మార్గాలపై గళం ఎత్తారు. అలాగే మరో సోదరి, సొంత బాబాయ్ కుమార్తె డాక్టర్ సునీత.. కడప గడ్డపై అన్న నిలబెట్టే లోక్ సభ అభ్యర్థి అవినాష్ రెడ్డికి ప్రత్యర్థిగా రంగంలోకి దిగడం దాదాపు ఖరారైంది. అలాగే పిస్ని వైఎస్ సౌభాగ్యమ్మ కూడా ప్రచార రంగంలోకి దిగడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో.. జగన్ తాను ఒంటరి కావడానికి కారణం విపక్ష నేత, తెలుగుదేశం అధినేత చంద్రబాబు కారణమని చాటడం ద్వారా.. తమ ఫ్యామిలీలో ఏకాకిని అయిపోయానని స్వయంగా చెప్పుకుంటున్నారు. జగన్ తల్లీ, చెల్లీ, పిన్నీ, సోదరి ఇలా అందరూ ఆయనను వదిలేసి వెళ్లిపోయారు, వాళ్లు అందరూ చంద్రబాబ చెప్పినట్లు చేస్తున్నారు. ఆయన ఆడమన్నట్లు ఆడుతున్నారంటూ వైసీపీ సోషల్ మీడియా వండి వారుస్తున్న కథనాలు ఇప్పటికే పాతాళానికి చేరిన జగన్ ప్రతిష్టను మరింత దిగజారుస్తున్నాయి.