టీడీపీకే కాదు వైసీపీకి కూడా ఉన్నాయి ఇలాంటి ఆణిముత్యాలు.. సీఎం సార్
posted on Dec 4, 2020 @ 10:16AM
అధికారంలో ఎవరు ఉన్నా వారిని కాకాపట్టే వారు ఎపుడూ ఉంటూనే ఉంటారు. అయితే ఇటువంటి కాకా రాయుళ్ల తో జాగ్రత్తగా ఉన్న నాయకులు ప్రజల ఇబ్బందుల గురించిన నిజాలు తెలుసుకుంటూ తమ పాలనను సజావుగా సాగేలా చూసుకుంటారు. అయితే ఈ కాకా రాయుళ్ల మాయలో పడి అంతా సవ్యంగానే ఉంది అని మురిసిపోతే ఏపీలో చంద్రబాబు లాంటి పరిస్థితే ఎవరికైనా తప్పదు. పాపం అయిదేళ్ల అయన పాలనలో రాష్ట్రంలో ప్రజలందరూ బాగున్నారని.. ప్రజలలో 70 నుండి 80 శాతం మంది ప్రభుత్వ కార్యక్రమాల పట్ల సంతృప్తిగా ఉన్నారని అయన చుట్టూ ఉన్న నాయకులు, అధికారులు కూడా ఊదర గొట్టారు. దీంతో అసలు రాష్ట్రంలో ప్రజల మనసులో ఏం ఉందొ తెలుసుకోకుండా బాబు గారు ఎన్నికలలో చతికిల పడ్డారు.
తాజాగా టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు విపరీతంగా సర్క్యులేట్ ఐన "జయము జయము చంద్రన్న" అనే వీడియోను ఎపి సీఎం జగన్ అసెంబ్లీలో ప్రదర్శించిన సంగతి తెలిసిందే. ఈ వీడియో ప్లే చేస్తున్నపుడు ఇటు సీఎం జగన్ అటు స్పీకర్ తమ్మినేని తమ నవ్వును అదుపు చేసుకోవడానికి ఇబ్బంది పడ్డ సంగతి తెలిసిందే. చంద్రబాబు సీఎం గా ఉన్నపుడు ఆయనను పొగుడుతూ కొంత మంది టీడీపీ నాయకులు అత్యుత్సాహంతో పోలవరం డ్యామ్ దగ్గర ఈ వీడియోను షూట్ చేసారు.
అయితే టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా ఇప్పటికే అందరూ చూసేసిన వీడియోను అసెంబ్లీలో ప్లే చేసి సీఎం జగన్ పొరపాటు చేసారని వైసిపి వర్గాలు కూడా భావిస్తున్నాయి. అంతేకాకుండా ఈ వీడియో ను ప్రదర్శించడం ద్వారా ఇప్పటికే ఓడిపోయి ప్రతిపక్షంలో ఉన్న బాబును అవమానించారని ప్రజలు భావించే అవకాశం కూడా ఉందని.. దీంతో అనవసరంగా చంద్రబాబుకు సానుభూతి పెరిగే అవకాశం ఉందని వారు వాపోతున్నారు. గత ఏడాదిన్నర కాలంలో కేసులు, అరెస్టులతో జనంలో సానుభూతి కోసం టీడీపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్న సమయంలో అసెంబ్లీలో ఇలా రచ్చ చేసి నవ్వుకోవడం టీడీపీకి ఉపయోగపడే అంశమే అని వారి ఆందోళన.
అయితే ఇదే సమయంలో ఇటువంటి భజన ఆణిముత్యాలు వైసిపికి కూడా ఉన్నాయని అవి బయట పడితే వైసిపికి కూడా డ్యామేజ్ తప్పదని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. తాజాగా శ్రీకాళహస్తిలో వైసిపి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ర్యాలీలో దండలు వేసిన పల్లకిలో సీఎం జగన్ ఫోటోను పెట్టి ఊరేగించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరో వీడియోలో జగన్ ఫోటోని పల్లకిపైన పెట్టి ముందు వాయిద్యాలు పెట్టి మరీ ఊరేగించారు. వీటన్నిటిని గమనించినట్లయితే అధికారంలో ఎవరు ఉన్నా.. భజన బ్యాచ్ వారిని మోసేస్తుందని వారితో జర భద్రంగా ఉండాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.