జగన్ రోడ్డున పడ్డాడు!
posted on Jun 25, 2024 @ 4:48PM
సొంత సొమ్ము సోమవారం ఒంటి పొద్దులుంటారు.. మంది సొమ్ము మంగళవారం ముప్పొద్దుల తింటారు అన్నట్లుగా జగన్ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ సొమ్ము దర్జాగా దుబారా చేశారు. అదే అధికారం కోల్పోయే సరికి పిసినారిగా మారిపోయారు. సీఎంగా తాడేపల్లి ప్యాలెస్ నుంచి కేవలం ఎనిమిదిన్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతానికి వెళ్లడానికి కూడా హెలికాప్టర్ ఉపయోగించిన జగన్.. ఇప్పుడు ఏకంగా వందల కిలోమీటర్లు రోడ్డు మార్గాన వెళ్లారు. అది కూడా కదిరి పులివెందుల రోడ్డుపై. జగన్ ఐదేళ్ల పాలనలో చిన్నపాటి మరమ్మతుకు కూడా నోచుకోకుండా పూర్తిగా గుంతలతో నిండి ప్రయాణీకులకు నరకం చూపించే ఆ దారి గుండా జగన్ రోడ్డు మార్గంలో బెంగళూరు వెళ్లారు. హెలికాప్టర్ ఎందుకు ఉపయోగించలేదంటే కారణం సుస్పష్టం. ఇప్పుడు ఆయన చాపర్లో వెళ్లాలంటే సొంత సొమ్ము ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే జగన్ కు మంది సొమ్ము నొక్కేయడం తప్ప సొంత సొమ్ము ఖర్చు చేయడం తెలీదు.
అధికారంలో ఉన్నంత కాలం ఆయన తన పర్యటనల కోసం ప్రత్యేక విమానాన్ని హైర్ చేసుకునే వారు. అదే అధికారం కోల్పోయిన మరుక్షణం నుంచీ ఆకాశంలో లోహ విహంగ యానాలకు స్వస్తి చెప్పి రోడ్డు మార్గానే తిరగడం మొదలు పెట్టారు. సీఎంగా జగన్ ఉన్న సమయంలో రాష్ట్రంలో ఆయన పర్యటనల కోసం రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్ ను అద్దెకు తీసుకొనేది.
ఇక ఆయన బెంగళూరు పర్యటన వద్దకు వస్తే.. జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి పులివెందుల పర్యటనకు వెళ్లారు. ముందుగా ఆయన పులివెందులలో నాలుగు రోజుల పాటు ఉంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే పులివెందులలో సొంత పార్టీ శ్రేణుల నుంచే తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం కావడం, ఆయన నివాసంపై దాడికి కూడా వైసీపీ శ్రేణులు ప్రకటించడంతో పులివెందులలో ఆయన పర్యటన రెండు రోజులకే పరిమితమైంది. ఎందుకంటే సొంత పార్టీ శ్రేణుల నుంచే తిరస్కారం ఎదురయ్యే సరికి ఆయన అక్కడ ఇక ఉండలేకపోయారు. ఇంతకీ సొంత పార్టీ నుంచే ఆయనకు నిరసన ఎందుకు వ్యక్తమైందంటే వారికి పెద్ద మొత్తంలో బిల్లులు పెండింగ్ లో ఉండటమే. ఒక్క పులివెందుల మునిసిపాలిటీ పరిధిలోనే వైసీపీ నేతలు చేసిన పనులకు సంబంధించి వంద కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని చెబుతున్నారు.
దీంతో ఆయన పులివెందుల పర్యటనను ముగించుకుని అక్కడ నుంచి నేరుగా బెంగళూరుకు వెళ్లిపోయారు. అధికారంలో ఉండి ఉన్నట్లైతే ఆయన బెంగళూరుకు హెలికాప్టర్ లోనే లేదా కడప చేరుకుని అక్కడ నుంచి ప్రత్యేక విమానంలోనో వెళ్లి ఉండేవారు. ఎందుకంటే అందుకు అయ్యే ఖర్చు తనది కాదు కదా? కానీ ఇప్పుడు ఆయన చాపర్ లో వెళ్లాలన్నా, ప్రత్యేక విమానం బుక్ చేసుకోవాలన్నా చేతి చమురు వదులుతుంది. అందుకే ఆయన రోడ్డు మార్గాన్ని ఎంచుకున్నారు.