హైకోర్టు భయంతోనా? మండలి మెజార్టీకా? జగన్‌రెడ్డి వ్యూహమేంటి?
posted on Nov 22, 2021 @ 4:03PM
జగన్‌రెడ్డి తగ్గారు. అయినా, తగ్గేదే లే అన్నారు. సీఆర్‌డీఏ బిల్లు రద్దును రద్దు చేశారు. వికేంద్రీకరణ బిల్లలనూ వెనక్కి తీసుకున్నారు. అయినా, మళ్లీ మూడు రాజధానుల పాటే పాడారు. మరోసారి మెరుగైన, బలమైన బిల్లుతో ముందుకొస్తామని చెప్పేశారు. జగన్‌లో ఇంత ధీమా ఎందుకు? ప్రజలంతా వ్యతిరేకిస్తున్నా.. అమరావతి రైతులు 700 రోజులుగా ఉద్యమిస్తున్నా.. మహా పాదయాత్రతో నిరసన తెలుపుతున్నా ఏమాత్రం తలవంచని జగన్‌రెడ్డి.. ఇప్పుడే ఎందుకిలా స్టాండ్ మార్చారు. తగ్గడం వెనుకున్న నెగ్గే వ్యూహమేంటి? అనేది ఆసక్తికరం.
వారం రోజులుగా హైకోర్టు మొట్టికాయలు వేస్తోంది. జగన్ సర్కారును ప్రశ్నలతో కుళ్లబొడుస్తోంది. అంతా డొల్ల బిల్లులే. టెక్నికల్‌గా అనేక లోటుపాట్లే. అందుకే.. డైలీ హైకోర్టు తలంటుతోంది. రాజధాని బిల్లులపై విచారణలో భాగంగా.. చీఫ్ జస్టిస్ మాట్లాడుతూ.. అమరావతి రైతులది మాత్రమే కాదని.. ప్రజలందరిదనీ వ్యాఖ్యానించారు. కర్నూలులో జ్యుడీషియల్ కేపిటల్‌కు సుప్రీంకోర్టు, ఏపీ హైకోర్టు అనుమతి ఉందా? అని ప్రశ్నించారు. రాజధాని ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయమైనా.. అందులోని చట్టబద్దతను మాత్రం తాము విచారించి తీర్పు చెబుతామని హైకోర్టు వ్యాఖ్యానించింది.
ఇలా, న్యాయస్థానంలో విచారణ సందర్భంగా వికేంద్రీకరణ బిల్లులోని లూప్‌పోల్స్ అన్నీ బయటకొచ్చాయి. ఆ కేసులు కోర్టులో వీగిపోవడం ఖాయమని అర్థమైపోయింది. అలా పరువు పోకముందే.. బిల్లులన్నీ రద్దు కాకముందే.. జగన్ ప్రభుత్వం ఆ బిల్లులను వెనక్కి తీసుకుంటూ వ్యూహాత్మకంగా వ్యవహరించిందని అంటున్నారు. అలా, హైకోర్టు తీర్పు రాకముందే సర్కారు సర్దుకుందని చెబుతున్నారు.
మరోవైపు, మండలి వ్యవహారం. సీఆర్‌డీఏ రద్దు బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించారు మండలి ఛైర్మన్. అయితే, ఆ బిల్లును అలా సెలెక్ట్ కమిటీకి పంపించే అధికారం ఛైర్మన్‌కు లేదంటూ.. ఆ నిర్ణయాన్ని అమలు చేసేందుకు మండలి ఉద్యోగి తిరస్కరించడం కలకలం రేపింది. ప్రభుత్వ ఒత్తిడితోనే ఆ ఉన్నతోద్యోగి అలా కొర్రీ పెట్టారని ప్రతిపక్షం విమర్శించింది. సీఆర్‌డీఏ బిల్లు రద్దు బిల్లు సెలెక్ట్ కమిటీకి వెళ్లిందని టీడీపీ అంటుంటే.. వెళ్లలేదని ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తుతం శాసన మండలిలో టీడీపీకే మెజార్టీ ఉండగా.. త్వరలో వైసీపీకి మరో 14మంది ఎమ్మెల్సీలు కొత్తగా ఎన్నిక కానుండటంతో మండలిలో అధికార పార్టీ ఆధిపత్యంలోకి రానుంది. ఆ తర్వాత ఏ బిల్లు తీసుకొచ్చినా.. ఇటు అసెంబ్లీలోనైనా, అటు మండలిలోనైనా ప్రభుత్వానిదే పైచేయి అవుతుందని భావిస్తోంది. అందుకు మరికాస్త సమయం పట్టనుండటం.. ఆ లోగా ఉన్న బిల్లును వెనక్కి తీసుకొచ్చి.. కొత్తగా, మరింత బలంగా మరో బిల్లు తీసుకురావలే అనేది జగన్‌రెడ్డి వ్యూహమని తెలుస్తోంది. ఏది, ఏమైనా అమరావతిని కాలరాయడమే జగన్ లక్ష్యమని మరోసారి తేలిపోయింది.