వైసీపీ ఎఫెక్ట్.. మెజారిటీ నుంచి మైనస్ కు పడిపోయిన పీడీఎఫ్ లక్ష్మణరావు!
posted on Mar 5, 2025 @ 1:17PM
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ గ్రాఫ్ రోజురోజుకూ పెరిగిపోతున్నది. కూటమి పాలన పట్ల ప్రజలలో అభిమానం, సానుకూలత రోజు రోజుకూ పెరుగుతోంది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత.. ఈ ఎనిమిది నెలలో వైసీపీ పొలిటికల్ గ్రాఫ్ మరింత దిగజారిందని తాజాగా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలు నిర్ద్వంద్వంగా నిరూపించాయి. ఓటమి తరువాత వైసీపీ పరిస్థితి నానాటికీ తీసికట్టు నాగంభోట్లు అన్నట్లుగా మారుతోందనడానికి గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ అసెంబ్లీ ఎన్నికల ఫలితమే తిరుగులేని సాక్ష్యంగా చెప్ప వచ్చు. ఇక్కడ నుంచి కూటమి అభ్యర్థి ఆలపాటి రాజాపై సిట్టింగ్ ఎమ్మెల్సీ పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావు పోటీ చేశారు. ఈ ఎన్నికలో ఆయనకు 62 వేల ఓట్లు వచ్చాయి. ఆలపాటి రాజా తొలి రౌండ్ నుంచీ స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తూ చివరికి భారీ మెజారిటీతో విజయం సాధించారు.
గత ఎన్నికలలో అంటే 2017లో స్వతంత్ర అభ్యర్థిగా ఈ స్థానం నుంచి పోటీ చేసిన లక్ష్మణ రావు 68 వేల ఓట్ల పైచిలుకు మెజారిటీతో విజయం సాధించారు. అప్పట్లో ఆయన స్వతంత్ర అభ్యర్థి ఏ పార్టీ తరఫునా పోటీ చేయలేదు. ఆయనకు మద్దతుగా అప్పట్లో ఏ పార్టీ కూడా ప్రచారం చేయలేదు. అంటే గత ఎన్నికలలో పీడీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించిన లక్ష్మణరావు విజయం పూర్తిగా వ్యక్తిగతం. అయితే ఈ సారి ఆయనకు తన సొంత బలానికి తోడుగా వైసీపీ మద్దతు కూడా అభించింది. ఫలితం ఘోర పరాజయం. వైసీపీ మద్దతు లేకుండా ఆయన గతంలోలాగే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఉంటే.. ఈ స్థాయిలో ఓటమిని మూటగట్టుకుని ఉండేవారు కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
వైసీపీ మద్దతు కారణంగానే ఆయన పరాజయం ఇంత ఘోరంగా ఉందని అంటున్నారు. గత ఎన్నికలలో 68 వేల ఓట్ల పైచిలుకు మెజారిటీతో విజయం సాధించిన లక్ష్మణరావు ఈ సారి మాత్రం 62 వేల ఓట్లు మాత్రమే సాధించగలిగారు. అంటే గతంలో ఆయనకు వచ్చిన మోజారిటీ ఓట్ల కంటే ఈ సారి ఆయనకు తక్కువ ఓట్లు పడ్డాయి. ఇందుకు ఆయన వైసీపీతో అంటకాగడమే కారణమని చెబుతున్నారు. రాష్ట్రంలో జగన్ వ్యతిరేక పవనాలు ఎంత బలంగా వీస్తున్నాయో చెప్పడానికి ఇదే తార్కాణమంటున్నారు.