పాలన చేతకాని మూర్ఖుడు జగన్.. రేణుకా చౌదరి
posted on Sep 13, 2022 @ 12:05PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి నిప్పులు చెరిగారు. నవ్యంధ్ర రాజధాని అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన పాదయాత్రకు ఆమె సంఘీ భావం ప్రకటించారు. అందు కోసం సోమవారం అమరావతి వచ్చిన ఆమె రైతులు కూర్చున్న ట్రాక్టర్‌ను స్వయంగా నడిపి.. పాదయాత్రలో పాల్గొన్న రైతులు, మహిళల్లో నయా జోష్ నింపారు.
అనంతరం రేణుకా చౌదరి ఓ మీడియాకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యలో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఓ ముర్ఖుడు అని అభివర్ణించారు. ఆయనకు పాలన చేతకాదన్నారు. ప్రజలతో ఎలా మాట్లాడాలో కూడా ఆయనకు తెలియదనీ, అసలు ఆయనకు ఎందుకు ఓట్లేశామా అని రాష్ట్ర ప్రజలు నిత్యం బాధపడుతున్నారని రేణుక అన్నారు.
అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తనకు చాలా మంది తెలుసునని... వాళ్లను ఎప్పుడు పలకరించినా.. జగన్ ఎప్పుడు దిగి పోతాడా? అని ఎదురు చూస్తున్నామని చెబుతున్నారని రేణుకా చౌదరి పేర్కొన్నారు. రాజధాని అమరావతి రైతుల వెయ్యి రోజుల ఉద్యమం ఓ చరిత్రగా రేణుకా చౌదరి అభివర్ణించారు. అమరావతి రైతులకు మద్దతుగా న్యాయస్థానం టూ దేవస్థానం పాదయాత్ర చేసినప్పుడు వచ్చానని.. అలాగే ఇప్పుడూ అమరావతి టు అరసవెల్లి పాదయాత్ర చేస్తున్నారని.. వారికి మద్దతు చెప్పడానికి వచ్చానని.. మళ్లీ, మళ్లీ వస్తానని రేణుకా చౌదరి స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి జగన్ ది మూర్ఖపు పాలన అన్న రేణుకా చౌదరి ఏపీ రాజధాని అమరావతేననీ, అది ఎక్కడికీ పోదని, అక్కడే ఉంటుందని అన్నారు. హైకోర్టు.. ప్రజలు.. రైతులకు అండగా ఉన్నారనీ, ఉంటారనీ రేణుక అన్నారు. మరి కొన్ని నెల్లలోనే జగన్ పాలన అంతమై పోతుందని... అనంతరం నిర్విఘ్నంగా అమరావతి నిర్మాణం సాగుతుందని ఆమె జోస్యం చెప్పారు.
మరోవైపు భారతీయ జనతా పార్టీపైనా సైతం రేణుకా చౌదరి విరుచుకుపడ్డారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారని.. ఈ ప్రాంతానికి అండగా ఉంటామని నాడు ఆయన చెప్పారని.. ఇప్పుడు ఆయన ఏమయ్యారంటూ ప్రశ్నించారు. ఇప్పుడు అమరావతికి అండగా నిలుస్తామని రాష్ట్ర బీజేపీ నేతలు చెబుతున్నారని.. మరి గత మూడేళ్లుగా వీళ్లంతా కళ్లుమూసుకున్నారా? అని నిలదీశారు.