జగన్ ఢిల్లీ ధర్నా... వ్రతమూ చెడింది.. ఫలమూ దక్కలేదు!
posted on Aug 5, 2024 @ 10:06AM
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ ధర్నా అట్టర్ ప్లాప్ అయ్యింది. జనమూ పట్టించుకోలేదు. మీడియా కూడా పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. అది పక్కన పెడితే జగన్ హస్తిన ధర్నా వెనుక పెద్ద వ్యూహమే ఉందని వైసీపీ నేతలు అప్పట్లో గొప్పగా చెప్పుకున్నారు. రాజ్యసభలో తన బలం చూపి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని దారిలోకి తెచ్చుకోవడం, అదే సమయంలో అదే బలాన్ని చూపి కాంగ్రెస్ కు దగ్గర కావడం అన్న రెండంచల వ్యూహంతో ఆయన ఏపీలో శాంతి భద్రతల సాకు చూపి హస్తిన వెళ్లి మరీ ధర్నా చేసి వచ్చారు. అయితే ఆ రెండంచల వ్యూహం ఘోరంగా విఫలమైంది. అటు బీజేపీ కానీ, ఇటు కాంగ్రెస్ కానీ జగన్ ను నమ్మి దగ్గరకు రావడానికి ఇసుమంతైనా ఆసక్తి చూపలేదు.
వాస్తవానికి నిజంగా ఏపీలో శాంతి భద్రతలు క్షీణించి ఉంటే జగన్ హస్తినలో ధర్నా చేసి ఏపీకి తిరిగి వచ్చేసి ప్యాలెస్ కు పరిమితం కాదు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై ఊరూ వాడా ఏకం చేస్తూ రాష్ట్రంలో పర్యటనలకు శ్రీకారం చుట్టి ఉండేవారు. లేదా ఆయన హస్తిన ధర్నాలో ఫొటో ఎగ్జిబిషన్ పెట్టి మరీ తెలుగుదేశం దౌర్జన్యకాండలో 36 మంది వైసీపీ కార్యకర్తలు మరణించారని చెప్పుకున్నారుగా, వారందరినీ పరామర్శించడానికి పర్యటనలు చేపట్టేవారు. అవేమీ లేకుండా ఆయన అయితే తాడేపల్లి ప్యాలెస్ లేదా బెంగళూరు ప్యాలెస్ అంటూ ఇంకా అంత: పురానికే పరిమితమయ్యారు.
దీంతో ఆయన హస్తిన ధర్నా లక్ష్యం ఏమిటి అన్న దానిపై ఇప్పుడు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో శాంతి భద్రతలపై జగన్ ఆందోళన, హస్తిన ధర్నా అంతా ఒక సాకేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. హస్తిన ధర్నా తరువాత జగన్ తాడేపట్టి, బెంగళూరు ప్యాలెస్ ల మధ్య షటిల్ సర్వీస్ కే పరిమితమయ్యారంటే... రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి బ్రహ్మాండంగా ఉందని ఆయన అంగీకరించేసినట్లే కదా అంటున్నారు. దాంతో ఇప్పుడు ఆయన హస్తిన ధర్నా వెనుక ఉద్దేశాలేమిటన్న దానిపై విశ్లేషణలు చేస్తున్నారు.
జగన్ ఢిల్లీలో ధర్నా చేసినప్పుడు ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు వచ్చి సంఘీభావం చెప్పారు. దాంతో జగన్ కాంగ్రెస్ కు చేరువకావడానికి ధర్నా ద్వారా మార్గం సుగమం చేసుకున్నారని అంతా భావించారు. అయితే ధర్నా తరువాత స్వల్ప వ్యవథిలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రెండు సార్లు బీజేపీ కీలక నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. దీంతో ఆయన ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ లతో సయోధ్య కోసం రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు, తన సొంత సోదరి షర్మిల విమర్శల దాడిని నియంత్రించడం కోసం కాంగ్రెస్ తో సయోధ్య, కేంద్రంలో అధికారంలో ఉంది కనుక తనపై అక్రమాస్తుల కేసుల విచారణ వేగం పుంజుకోకుండా నిరోధించడం కోసం బీజేపీతో మైత్రి అన్న వ్యూహాన్ని జగన్ అనుసరిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే కాంగ్రెస్, బీజేపీలు రెండూ కూడా జగన్ ను దగ్గరకు రానీయడానికి అంగీకరించలేదని అంటున్నారు.