వైవీకి జగన్ క్లాస్!
posted on Feb 16, 2024 @ 11:34AM
తిరుమల తిరుపతి మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిపై వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. చిందులు తొక్కారన్న ప్రచారం పోలిటికల్ సర్కిల్‌లో వాడి వేడిగా జరుగుతోంది. ఏపీకి కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ అందుబాటులోకి వచ్చే వరకు హైదరాబాద్ రాజధానిగా కొనసాగించాలని.. ఈ అంశాన్ని త్వరలోనే పెద్దల సభలో ప్రశ్నిస్తానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు.. జగన్ పార్టీని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టాయనే ఓ చర్చ అయితే సదరు సర్కిల్‌లో నడుస్తోంది. అదీ కూడా ఎన్నికల వేళ.. ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల పార్టీని మరింత ఇబ్బందుల్లోకి నెట్టినట్లు అయిందనే ఓ అభిప్రాయం సైతం వ్యక్తమవుతోంది.
ఎందుకంటే.. ప్రతిపక్షనేతగాజగన్ అసెంబ్లీలో రాజధాని అమరావతికి తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కానీ ఆయన ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత.. అధికార వికేంద్రీకరణ అంటూ ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు ఉండాలని.. అందులో భాగంగా శాసన రాజధాని అమరావతి, కార్యనిర్వాహాక రాజధాని విశాఖపట్నం, న్యాయ రాజధాని కర్నూలు అని అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. దీంతో రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతులు ఆందోళన బాట పట్టారు. నవ్యాంధ్రకి ఏకైక రాజధాని.. అమరావతే ఉంచాలంటూ రైతులు నిరసనలు, దీక్షలు చేపట్టారు. అందులోభాగంగా వారు న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు, అమరావతి నుంచి అరసవల్లి వరకు పాదయాత్రలు చేశారు. కానీ ఈ ప్రభుత్వం మనస్సు మాత్రం ఏమాత్రం కరగలేదు.
మరోవైపు జగన్ ప్రభుత్వం గద్దెనెక్కి నేడో రేపో అయిదేళ్లు పూర్తి చేసుకొంటుంది. అయితే ఇప్పటి వరకు విశాఖలో కార్య నిర్వాహాక రాజధాని కానీ.. కర్నూలులో న్యాయ రాజధానికి సంబంధించి ఒక్క ప్రభుత్వ కార్యాలయం కానీ ఏర్పాటు కాలేదు. మరో వైపు అమరావతిని పూర్తిగా పక్కన పెట్టేశారు. దీంతో సీఎం జగన్ మాటల ప్రభుత్వమే కానీ... చేతల ప్రభుత్వం కాదనే విషయం అందరికీ అర్ధమైంది. ప్రజలలో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇంకోవైపు మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇలాంటి వేళ హైదరాబాద్ రాజధానిగా మరికొన్నాళ్లు కొనసాగించాలంటూ వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ నాయకులే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తుగ్లక్ వ్యవహారానికి ఇంత కంటే నిదర్శనం ఏమి కావాలంటూ నవ్వుతున్నారు. ఎందుకంటే విభజన బిల్లులో పేర్కొన్నట్లు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కేవలం 10 ఏళ్లు మాత్రమే ఉంటుందని... ఆ గడువు మరికొద్ది రోజుల్లో ముగియనుందని... అలాంటి వేళ.. ఇలాంటి సున్నితమైన రాజధాని అంశంపై బాబాయి వైవీ సుబ్బారెడ్డి ఇటువంటి వ్యాఖ్యలు చేయడంపై సీఎం జగన్ చాలా సీరియస్ అయినట్లు ఓ చర్చ నడుస్తోంది.
అటు రాజధాని అమరావతి లేదు.. ఇటు మూడు రాజధానులు లేవు... ఇక హైదరాబాద్ రాజధాని అంటే.. మళ్లీ ఎన్నికల వేళ సెంటిమెంట్ అగ్గి రాజేయడమేననీ, దీంతో తెలుగు రాష్ట్రాల మధ్య, రాజకీయ పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శనాస్త్రాలు మొదలవుతాయని.. ఇప్పటికే హైదరాబాద్ మహానగరం కారణంగానే రాష్ట్ర విభజన జరిగిందని.. అలాంటిది మళ్లీ ఈ అంశంపై మాట్లాడడమంటే.. అగ్గి రాజేయడమేనని.. ఇంకా చెప్పాలంటే తేనెతుట్టె పై రాయి వేసినట్లేనన్న అభిప్రాయం పోలిటికల్ సర్కిల్‌లో వ్యక్తమౌతోంది. వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలు చేయడం.. ఆ తర్వాత మంత్రి బోత్స సత్యనారాయణ ప్రెస్ మీట్ పెట్టి.. వైవీ వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చినా.. జరగాల్సిన నష్టం జరిగిపోయిందనే చర్చ సైతం నడుస్తోంది.
ఇక వైవీ సుబ్బారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఓ రేంజ్ లో విమర్శలు, సెటైర్లు గుప్పిస్తున్నారు. విభజన బిల్లులో ఉమ్మడి రాజధాని పదేళ్లు అని చెప్పినా.. ఐదేళ్లకే ఏపీకి వెళ్లిపోయి.. అక్కడి నుంచి పాలన సాగిస్తున్నది. అలాగే ప్రతిపక్ష పార్టీలు టీడీపీ, జనసేప, బీజేపీలు వైవీ వ్యాఖ్యలపై వ్యంగ్యంగా స్పందిస్తున్నాయి.
ఏదీ ఏమైనా.. రాష్ట్ర విభజన జరిగిపోయింది. ఆ సమయంలో కేంద్రం ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ కూడా సరిగ్గా అమలు కాకపోవడంతో.. ఏపీ రాష్ట్రాభివృద్ధితోపాటు ఆర్థికాభివృద్ధి సైతం కుంటుపడింది. ఈ విషయాన్ని గమనించిన ప్రజలు సైతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారని పోలిటిల్ సర్కిల్‌లో సైతం ఓ చర్చ అయితే హల్‌చల్ చేస్తోంది.