కొడాలి నాని, వల్లభనేని వంశీకి జగన్ పంగనామాలు.. సర్వేల పేరుతో నోటికెట్?
posted on Feb 16, 2024 8:44AM
ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా వెలువడకుండానే.. ఈ అధికార పార్టీ ఓటమిని అంగీకరించేసినట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికలలో జగన్ ప్రభుత్వానికి ఘోర పరాభవం తప్పదని ఇప్పటికే పలు సర్వేలు కుండబద్దలు కొట్టాయి. దీనికితోడు సీఎం అంతర్గతంగా నిర్వహించుకున్న సర్వేల్లోనూ ఇవే ఫలితాలు వెల్లడైనట్లు తెలిసింది. దీంతో అలర్ట్ అయిన జగన్మోహన్ రెడ్డి పలు నియోజక వర్గాల్లో సిట్టింగ్ లకు షాకిచ్చారు. ఇన్నాళ్లు.. మళ్లీ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిని నేనే అని చెప్పుకుంటూ వచ్చిన పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు జగన్ రాత్రికిరాత్రే షాకిచ్చారు. కొందరికి అసలే టికెట్ ఇవ్వనని తేల్చిచెప్పగా.. మరికొందరికి ఇతర నియోజకవర్గాల్లో అవకాశం కల్పించారు. అయితే, తాజాగా ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర విషయం చర్చనీయాంశంగా మారింది. జగన్ కు అత్యంత విశ్వాసపాత్రులుగా, నమ్మిన బంట్లుగా గుర్తింపు పొందిన కొడాలి నాని, వల్లభనేని వంశీలకు సైతం జగన్ సర్వేల పేరుతో షాకిచ్చేందుకు రెడీ అయిపోయారన్న ప్రచారం వైసీపీ సర్కిల్స్ లోనే జోరుగా సాగుతోంది.
వైసీపీలో లోక్ సభ, అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జిల మార్పు వ్యవహారం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఆరు జాబితాలను సీఎం జగన్ మోహన్ రెడ్డి సూచనలతో వైసీపీ నేతలు విడుదల చేశారు. ఇందులో మొత్తం 32 మంది ఎమ్మెల్యేలు, ఎనిమిది మంది ఎంపీలపై వేటు వేసిన జగన్.. మరో రెండు రోజుల్లో ఏడో జాబితాను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన ఆరు జాబితాల్లో కొడాలి నాని, వల్లభనేని వంశీ పేర్లు లేకపోవటం వైసీపీ శ్రేణులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గత ఎన్నికల్లో కొడాలి నాని గుడివాడ నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వల్లభనేని వంశీ టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించి ప్లేటు ఫిరాయించి వైసీపీకి మద్దతు ఇస్తూ వస్తున్నారు.
కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇద్దరూ కూడా మూడు రోజుల క్రితం సీఎం జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. సీఎం జగన్ అంతర్గతంగా చేయించిన సర్వేల వివరాలను వారి ముందు ఉంచినట్లు, సర్వేల్లో వారిద్దరూ ఓడిపోతారని తేలినట్లు వైసీపీ వర్గీయుల్లో చర్చ జరుగుతుంది. కొడాలి నాని గతంలో మంత్రిగా ఉన్న సమయంలోనూ, ఇప్పుడూ టీడీపీ, జనసేన పార్టీలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ జగన్ మెప్పును పొందుతున్నారు. కొడాలి నానికి టికెట్ ఇవ్వకపోతే వైసీపీ శ్రేణుల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న కారణంతో నానికి గుడివాడ నుంచి మరోసారి టికెట్ ఇచ్చినా.. వంశీకి జగన్ మొడిచేయి చూపించడం ఖాయమని వైసీపీ వర్గీయుల్లో చర్చ జరుగుతున్నది. కొడాలి నాని వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటినుంచి చంద్రబాబు, లోకేశ్, పవన్ తో పాటు చంద్రబాబు కుటుంబంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. పలు సందర్భాల్లో హద్దులు దాటి బూతులు సైతం మాట్లాడిన విషయం తెలిసిందే. నాని భాషపై తెలుగు రాష్ట్రాల్లో విస్తృత చర్చజరుగుతుంది. ఈ క్రమంలో నానిపై గుడివాడ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నదని జగన్ సర్వేల్లో తేలినట్లు సమాచారం.
వల్లభనేని వంశీకి వైసీపీ నుంచి గన్నవరం టికెట్ ఇచ్చే విషయంలో జగన్ ఆసక్తి చూపడం లేదని పార్టీ వర్గాల నుంచే అందుతున్న సమాచారం. గన్నవరం కాకుండా వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని వంశీకి జగన్ సూచించినట్లు కూడా ఆ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిననాటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా, అలాగే గన్నవరం ప్రజల్లో వల్లభనేని వంశీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. జగన్ సొంతంగా చేయించుకున్న సర్వేల్లోనూ ఇదే విషయం వెల్లడైనట్లు సమాచారం. ఏడో విడత జాబితాలో గన్నవరం నుంచి వంశీకి కాకుండా మరో వ్యక్తికి ఇంచార్జి బాధ్యతలను జగన్ అప్పగిస్తారని, వంశీకి సర్వేల పేరుతో హ్యాండివ్వడం ఖాయమన్న చర్చ ఏపీ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది.
తెలుగుదేశం పార్టీకి గన్నవరం నియోజకవర్గంలో బలమైన ఓటుబ్యాంక్ ఉంది. ఆ ఓటు బ్యాంకును వైసీపీ వైపుకు తిప్పుకోవాలంటే తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తిని తీసుకొచ్చి బరిలోకి దించాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో నూజివీడు తెలుగుదేశం నేతపై వైసీపీ అధిష్టానం గురిపెట్టినట్లు సమాచారం. అయనను వైసీపీలోకి తీసుకొచ్చి గన్నవరం నుంచి బరిలోకి దింపాలని జగన్ వ్యూహంగా తెలుస్తోంది. తెలుగుశం నుంచి వైసీపీలోకి వస్తారని జగన్ అండ్ కో భావిస్తున్న వ్యక్తి గతంలో గన్నవరం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు. దీంతో ఆయనను గన్నవరం బరిలో నిలపడం ద్వారా వైసీపీ ఓటు బ్యాంకుతో పాటు తెలుగుదేశం ఓటు బ్యాంకుకూడా కలిసివస్తుందన్నది జగన్ ప్లాన్ గా వైసీపీ వర్గీయులు చెబుతున్నారు. అదే జరిగితే వల్లభనేని వంశీ రాజకీయ భవిష్యత్తు ఏమిటనేది ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.