సెక్యులర్ ఎండకి మైనార్టీ గొడుగు! హిందూత్వ ఎండకి యజ్ఞాల గొడుగు!
posted on Aug 1, 2017 @ 2:18PM
భారతదేశంలో మోదీ శకం మొదలయ్యాక చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. అందులో ప్రధానమైంది సెక్యులర్ నినాదాల వైఫల్యం! నిన్న మొన్నటి వరకూ దేశంలోని అన్ని పార్టీలు సెక్యులరిజమ్ కి ఎక్కడలేని ప్రాముఖ్యతని ఇచ్చేవి. అలా చేయకూడదని కాదు. కాని, ఎన్నికల్లో గెలవటానికి, పొత్తులు పెట్టుకోటానికి, విడిపోటానికి, సీఎం కూర్చీలు లాక్కోటానికి ఇలా అన్నిటికి సెక్యులర్ పదం అడ్డుపెట్టుకునే వారు. అలాగే మైనార్టీ జపం చేస్తూ పబ్బం గడిపేసేవారు. కాని, రాను రాను ఇటు హిందువుల్లోనూ, అటు మైనార్టీల్లోనూ సెక్యులర్ మాయాజాలంపై స్పష్టత వస్తోంది. ఊరికే సెక్యులరిజం అంటూ మైనార్టీ సంక్షేమం అంటూ నినాదాలు, ఉపన్యాసాలు చేస్తే జనం నమ్మటం లేదు. ఈ విషయం తెలుగు రాష్ట్రాల్లో బాగా గ్రహించిన నేత జగన్ అనే చెప్పుకోవాలి!
పోయిన ఎన్నికల్లో జగన్ ప్రతిపక్షానికే పరిమితం కావటానికి చాలా కారణాలున్నాయి. వాటిల్లో ఒకానొకటి మత కోణం. పైకి పెద్దగా చర్చ జరగకపోయినా వైఎస్ హయాంలో క్రిస్టియన్ ముద్ర బాగా పడిపోయింది. తరువాత వైఎస్ సతీమణి, జగన్ తల్లి విజయమ్మ కూడా బైబిల్ చేతిలో పట్టుకుని ప్రచారం చేయటం మరింత దృష్టిని ఆకర్షించింది. ఇలాంటి పరిణామాల కొంతమేర నష్టం తప్పలేదు వైసీపికి. హిందూత్వ భావజాలం వున్నవారు జగన్ని ఎంత మాత్రం నమ్మే పరిస్థితి లేకపోయింది. ఆ లోపాన్ని ఇప్పుడు యువనేత సరి చేసుకునే పనిలో పడ్డట్టు కనిపిస్తోంది!
జగన్ ముఖ్యమంత్రి అయ్యేదాకా సహస్ర చండీయాగం నిర్విఘ్నంగా జరుగుతుందని ఓ న్యూస్ వచ్చింది. భూమన కరుణాకర్ రెడ్డి దీన్ని నిర్వహిస్తారని కూడా తెలుస్తోంది. హైద్రాబాద్ లో జరిగే ఈ చండీ యాగం జగన్ ఎన్నికల్లో గెలిచాక పూర్ణాహుతితో ముగుస్తుందట! ఇలా యాగాలు, యజ్ఞాలు చేస్తే అధికారం దక్కుతుందా? ఇది మరో చర్చ! కాకపోతే, ఇందులోని రాజకీయ కోణం మాత్రం హిందూ వ్యతిరేక ముద్ర పోగొట్టుకోవటం. త్వరలో తిరుమలకి కాలినడకన కూడా జగన్ వెళ్లనున్నారట. అంతే కాదు, సోషల్ మీడియాలో ప్రస్తుతం హిందూ స్వామీజీ ఒకాయనకి జగన్ పాదాభివందనం చేస్తోన్న ఫోటో హల్ చల్ చేస్తోంది!
ఇలాంటి ఒత్తిడి కేవలం జగన్ మీదే కాదు. మొత్తం దేశంలో చాలా మంది రాజకీయ నేతల మీద వుంది. మోదీ సారథ్యంలోని బీజేపి ప్రతీ చోటా హిందూత్వ ఎజెండాను సైలెంట్ గా అమలు చేస్తోంది. గోవుల చుట్టు జరుగుతోన్న రాజకీయం మనకు తెలిసిందే. వీటన్నిటితో రాను రాను రాజకీయ నేతలకి ఇఫ్తార్ విందులకి హాజరైనట్టు హిందూత్వ ప్రదర్శన కూడా అనివార్యం అవుతోంది. జగన్ యజ్ఞాలు, యాగాలు, పుష్కర స్నాన, పిండ ప్రదానాలు, తిరుమల కాలినడక స్ట్రాటజీలు వర్కవుట్ అయితే… ముందు ముందు మరింత మంది నేతలు తమ కాషాయ కోణం బయటపెట్టే అవకాశం వుంది! ఆఫ్ట్రాల్… రాజకీయం అంటే ఏ ఎండకి ఆ గోడుగు పట్టడమే కదా!