జగన్ ఫ్లెక్సీల చిచ్చు ఎందుకు పెట్టినట్లు
posted on Apr 8, 2013 @ 2:50PM
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీ బ్యానర్ల డ్రామా మొదలుపెట్టినప్పుడు అందరూ ఆశ్చర్య పోయినప్పటికీ మొదట అదేదో పొరపాటున జరిగి ఉండవచ్చని అందరు అనుకొన్నారు. కానీ, అదేమి పొరపాటునో లేక కాకతాళీయంగా మొదలుపెట్టలేదని, ఆ పార్టీ పక్కా ప్రణాలికతోనే రంగంలోకి దిగిందని అందరికి అర్ధం అయింది. అయితే, అది అందరూ ఊహిస్తున్నట్లుగా తన ప్రత్యర్ధి తెలుగుదేశం పార్టీలో చిచ్చు పెట్టడానికి మాత్రమే కాకుండా, దానిలో వేరే ఆలోచనలు ప్రయోజనాలు కూడా ఇమిడి ఉన్నాయి.
తమ అధినేత జగన్ మోహన్ రెడ్డి చుట్టూ నానాటికి బిగుసుకొంటున్నసీబీఐ మరియు ఈ.డీ. కోర్టుల ఉచ్చువలన అతను ఇంత త్వరగా జైలు నుండి బయటపడే అవకాశం లేదని గ్రహించిన ఆ పార్టీ, ఇటువంటి వ్యూహంతో ప్రజలని, ముఖ్యంగా తన పార్టీ తన కార్యకర్తలని ఏమార్చే ప్రయత్నం చేస్తోంది. తమ అధినేత ఇప్పట్లో జైలు నుంచి బయటకి రాడని తెలిస్తే కార్యకర్తలలో పార్టీ పట్ల విశ్వాసం సడలిపోయే ప్రమాదం ఉంది. అంతే కాకుండా ఇప్పటికీ నాయకత్వ సమస్యతో సతమతమవుతున్న ఆ పార్టీలో జగన్ ఇప్పట్లో విడుదల కాడని తెలిస్తే కొత్త సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంది.
ఇక సీబీఐ కూడా తన జోరు పెంచి వరుసగా చార్జి షీట్లు దాఖలు చేస్తుండటం, కేవీపీ, పెన్నా సిమెంట్స్ ప్రతాప్ రెడ్డి, రఘురామ రాజు వంటి వారిని విచారణ చేస్తుండటం ద్వారా ఆ మరింత మంది నాయకుల మెడలకి సీబీఐ కేసులు చుట్టుకోనున్నాయనే మీడియా ప్రచారంతో మొదలయిన కలకలం కూడా ఆ పార్టీకి చాలా ఇబ్బందికర పరిస్థితులను సృష్టించింది. జగన్ మోహన్ రెడ్డికి చెందిన సాక్షీ మీడియా ఒక్కటీ ఒకవైపు, మిగిలిన మీడియా అంతా మరో వైపు నిలవడంతో మీడియాలో ఆ పార్టీకి అనుకూల ప్రచారం కంటే వ్యతిరేఖ ప్రచారమే ఎక్కువగా ఉంటోంది. యావత్ మీడియాలో జగన్ అరెస్టు వ్యవహారం, అక్రమస్తుల కేసులు, అతని కంపెనీల ఆస్తుల జప్తులు వగైరా వార్తలే ఎక్కువగా వస్తుండటంతో క్రమంగా ఆ ప్రభావం పార్టీ కార్యకర్తల మీద పడి వారి మనోధైర్యం కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. అందువల్ల, అటువంటి విషయాలనుండి వారి దృష్టిని మళ్లించే ప్రయత్నంలో భాగంగానే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ ఫ్లెక్సీ బ్యానర్ వ్యూహం రచించి, దిగ్విజయంగా అమలు చేస్తోంది.
ఈ పధకంతో స్వామీ కార్యం, స్వకార్యం రెండూ కూడా పూర్తవుతాయనేది ఆ పార్టీ ఆలోచన. నిజాయితీగా చెప్పుకోవాలంటే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తన వ్యూహం అమలు చేయడంలో విజయవంతం అయిందనే చెప్పవచ్చును. కానీ,ఆ పార్టీ ఈ డ్రామాను కలకాలం కొనసాగించడం కష్టం కనుక అప్పుడు మళ్ళీ ఇటువంటిదే మరో కొత్త ఉపాయం కోసం ఆలోచించక తప్పాడు.