40 ప్రాంతాల్లో ముగిసిన ఐటీ రైడ్స్... వేలకోట్ల కల్కి ఆస్తుల లెక్కలు ఇవే...
posted on Oct 22, 2019 @ 11:13AM
కల్కి ఆశ్రమాల్లో ఐటీ రైడ్స్ కొలిక్కి వచ్చాయి. చిత్తూరు, చెన్నై, హైదరాబాద్, బెంగళూరుల్లో జరిపిన తనిఖీలు ముగింపుకొచ్చాయి. మొత్తం 40 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించిన ఐటీ టీమ్స్... ఇప్పటివరకు 300మందిని విచారించారు. కల్కి ఆశ్రమాల్లో గుట్టలుగుట్టలుగా పడివున్న నగదును, బంగారాన్ని ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 40కోట్ల ఇండియన్ కరెన్సీ, అలాగే 22కోట్ల విదేశీ కరెన్సీని సీజ్ చేశారు. ఇక, కల్కి విలాసవంత భవనమైన వైట్ లోటస్‌లో పెద్దఎత్తున వజ్రాలు, బంగారం, దేశ, విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. అలాగే, కీలక భూ డాక్యుమెంట్లతోపాటు హార్డ్ డిస్క్ లు, పెన్ డ్రైవ్ లను అధికారులు తమ వెంట తీసుకెళ్లారు. అదేవిధంగా ఆశ్రమ సిబ్బంది స్టేట్ మెంట్స్ చేశారు. అలాగే ఎప్పుడు విచారణకు పిలిచినా రావాలంటూ ఆశ్రమ ప్రముఖులను ఆదేశించారు. అయితే, 85కోట్ల రూపాయలు హవాలా ద్వారా వచ్చినట్లు గుర్తించిన ఐటీ అధికారులు.... 5వందల కోట్ల లావాదేవీలకు లెక్కలు దొరకడం లేదని అంటున్నారు.
ఇక, చిత్తూరు జిల్లా వరదయ్యపాళెం ఆశ్రమంలో 105 కోట్ల రూపాయల విలువైన 90 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. అలాగే హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు అకౌంట్ లో 115కోట్ల డిపాజిట్లు, 61 కోట్ల విలువైన బోగస్ షేర్లు, డివిడెండ్ వడ్డీలు 100కోట్ల మేర ఉన్నట్లు గుర్తించారు. చైనా, సింగపూర్, అమెరికా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్లు ఆధారాలు దొరికాయి. అలాగే విదేశీ కరెన్సీని దారి మళ్లించినట్లు గుర్తించారు. కల్కీ... ఇండియాలోనే కాకుండా అరబిక్ దేశాలతో పాటు కెన్యా, ఆఫ్రికాలోనూ వేలాది ఎకరాల భూములను కొనుగోలు చేసినట్టుగా ఐటీ తనిఖీల్లో తేలింది. ఇక... కల్కి భగవాన్ తనయుడు కృష్ణాజీ, కోడలు ప్రీతి, ట్రస్ట్ సీఈవో లోకేష్ దాసాజీలను అదుపులోకి తీసుకుని విచారించారు.
ఐటీ దాడులపై కల్కి ఆశ్రమం స్పందించింది. ఆశ్రమంపై ఐటీ దాడులు జరిగాయని... అధికారులకు పూర్తిగా సహకరించామని సునీల్ దాసాజీ తెలిపారు. వారడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పామన్నారు. తదుపరి విచారణకు సహకరిస్తామని అన్నారు. ఐటీ దాడుల తర్వాత ఆశ్రమంలో కార్యకలాపాలు యధావిధిగా జరుగుతున్నాయని వెల్లడించారు. అయితే, కల్కీ భగవాన్‌గా చెప్పుకుంటున్న విజయ్‌కుమార్ ప్రస్తుతం అజ్ఞాతంలో ఉండగా, అతని కుమారుడి నుంచి కూడా సరైన సమాధానాలు రాలేదని తెలుస్తోంది.