ఏపీలో టీడీపీదే అధికారం.. అసెంబ్లీ ఎన్నికలపై తేల్చేసిన మరో సర్వే..
posted on Aug 21, 2021 @ 4:28PM
2019లో ఏపీలో వార్ వన్‌సైడ్. టీడీపీకి దిమ్మతిరిగేలా 151 స్థానాలతో ఘన విజయం సాధించింది వైసీపీ. ఒక్క ఛాన్స్ అని వేడుకున్న జగనన్నను నమ్మి జనం గెలిపించారు. ఆ ఒక్క ఛాన్స్ అయిపోయింది. కొత్త మురిపం పోయింది. మరి, జగనన్నకు సెకండ్ ఛాన్స్ ఇస్తారా? జగన్ పాలనపై జనం సంతృప్తిగా ఉన్నారా? మరోసారి గెలిపించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? ఇలా ఆసక్తికర సర్వే ఒకటి జరిగింది. ఇటీవల జరిగిన ఇండియా టుడే-- మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్‌లో సీఎం జగన్ ర్యాంక్ 11కి పడిపోగా.. కేవలం 6 అంటే 6 శాతం మంది మాత్రమే జగన్ బెస్ట్ సీఎం అన్నారంటే ఆయన గ్రాఫ్ ఏ రేంజ్‌లో పతనమైందో అర్థం చేసుకోవచ్చు. ఆ కలవరింత నుంచి కోలుకోకముందే.. లోకల్ యాప్ సర్వే మరింత షాకింగ్ రిజల్ట్స్ ప్రకటించింది. ఆ సర్వేలో జగనన్న గెలుపు అంచున వేలాడి.. ఓటమి వైపు జారిపోయారు. వైసీపీతో టీడీపీ హోరాహోరీ పోరాడి.. ఒక్కటంటే ఒక్క శాతం ఓటింగ్‌తో విజయం కైవసం చేసుకోవడం సంచలనంగా మారింది. ఆనాడు జగన్ ఒక్క ఛాన్స్‌తో గట్టెక్కితే.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని లోకల్ సర్వే తేల్చి చెప్పింది.
రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న ప్రశ్నకు టీడీపీకే ఎక్కువ ఓట్లు వేశారు ఏపీ జనాలు. టీడీపీ అధికారంలోకి వస్తుందని 44 శాతం మంది చెప్పగా.. వైసీపీ అధికారంలోకి వస్తుందని 43 శాతం మంది భావించారు లోకల్ యాప్ యూజర్లు. ఇక, బీజేపీ-జనసేన అధికారంలోకి వస్తుందని 13.05 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 51 శాతానికి పైగా ఓట్లు రాగా టీడీపీ 37 శాతం ఓట్లు వచ్చాయి. అంటే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కంటే వైసీపీకి 14 శాతానికి పైగా ఓట్లు పోలయ్యాయి. అయితే రెండేళ్లలోనే సీన్ మారిపోయింది. 14 శాతం ఓట్లతో వెనకబడిన టీడీపీకి.. తాజా సర్వేలో లీడ్ రావడం షాకింగ్ గా మారింది. రానున్న రోజుల్లో వైసీపీ ఓట్ల శాతం మరింతగా తగ్గవచ్చని సర్వే నిర్వహించిన ప్రతినిధులు అంచనా వేశారు. ఈ లెక్కన వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నది లోకల్ యాప్ సర్వే ద్వారా స్పష్టమవుతోంది. ఇటీవలి ఇండియా టుడే సర్వేలో సైతం కేవలం 6శాతం మంది మాత్రమే జగన్ బెస్ట్ సీఎం అని చెప్పడం.. ప్రజల్లో దారుణంగా పడిపోయిన జగన్ పరపతికి నిదర్శనం.
ఏపీలో ఏ ఒక్కరిని కదిలించినా అప్పులపైనే చర్చ. మద్యపాన నిషేధం ఏమైందని ప్రశ్న. ఉచిత ఇసుక ఎక్కడికి పోయిందంటూ నిలదీత. కరోనా కట్టడిలో ఎందుకు విఫలమయ్యారని మండిపాటు. ఒకటో తారీఖు జీతాలు ఏవంటూ ఉద్యోగుల కడుపుమంట. ధరల పెరుగుదల, ఆలయాలు, దళితులు, మహిళలపై దాడులేంటంటూ ఆగ్రహం. తిట్లు, కేసులు, అరెస్టులపై అసహ్యం. కొవిడ్ టైమ్‌లో పరీక్షలు, పాఠశాలలపై ఆక్రోషం. ఇలా, సీఎం జగన్‌రెడ్డి పాలనపై ఏ ఒక్క వర్గం కూడా సంతృప్తిగా లేదరే విషయం ఇండియా టుడే, లోకల్ యాప్ సర్వేలతో తేలిపోయింది. వచ్చే అసెంబ్లీలో జగన్‌కు గట్టి బుద్ధి చెప్పనున్నారని స్పష్టం అవుతోంది. ఒక్క ఛాన్స్ అంటే అమరావతిని నట్టేట ముంచి.. ప్రజలను ఆగమాగం చేస్తున్న జగన్ పాలనపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆ వ్యతిరేకతే ఇలా సర్వేల రూపంలో బయటికొస్తోంది.
అదే సమయంలో చంద్రబాబు పాలనను, జగన్ ఆగడాలను పోల్చి చూసుకుంటున్నారు ప్రజలు. చంద్రబాబు హయాంలో అంతర్జాతీయ కంపెనీలు ఏపీకి క్యూ కడితే.. జగన్ ఏలుబడిలో కొత్త పరిశ్రమలు కాదుకదా, ఉన్న పరిశ్రమలే పారిపోయే పరిస్థితి దాపురించిందని మండిపడుతున్నారు. జాబ్ లెస్ క్యాలెండర్‌పైనా నిరుద్యోగులు కడుపుమంటతో రగిలిపోతున్నారు. సంక్షేమం పేరుతో ఆంధ్రప్రదేశ్‌ని సంక్షోభంలోకి నెట్టేసిన జగన్ పాలనపై పెదవి విరుస్తున్నారు. అందుకే, మళ్లీ ఎన్నికలు వస్తే.. టీడీపీకే ఓటు వేస్తామని.. చంద్రబాబునే సీఎం చేస్తామని.. సర్వేల్లో తేల్చి చెబుతున్నారు ఏపీ ప్రజలు. జగన్‌కు ఒక్క ఛాన్స్ మాత్రమే ఇచ్చామని.. మరో ఛాన్స్ ఇచ్చే సమస్యే లేదని సర్వేలతో స్పష్టం చేస్తున్నారు. ఇండియా టుడే.. లోకల్ యాప్.. వరుస సర్వేల ఫలితాలు టీడీపీలో కొత్త ఉత్సాహం నింపుతున్నాయి. తెలుగు తమ్ముళ్లలో సరికొత్త జోష్ కనబడుతోంది. అదే సమయంలో వైసీపీలో ఆందోళన, తాడేపల్లి ప్యాలెస్‌లో కలకలం చెలరేగుతోంది.