పోలవరం ప్రాజెక్ట్ భద్రమేనా? సొరంగాలు కుంగిపోవడంతో కలకలం..
posted on Oct 27, 2021 @ 10:22AM
ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ భద్రమేనా? నిర్మాణ పనులు నాణ్యతతోనే జరుగుతున్నాయా?ఈ అనుమాననే కొన్ని రోజులుగా వస్తోంది. ప్రాజెక్టు నిర్మాణాల్లో వరుసగా నాణ్యత లోపాలు కనిపిస్తుండం జనాలకు ఆందోళన కల్గిస్తోంది. ముఖ్యంగా గత రెండున్నర ఏండ్లుగా జరుగుతున్న పనుల్లో సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే వాటిని ప్రభుత్వం ఖండిస్తున్నా.. వరుసగా జరుగుతున్న ఘటనలతో మాత్రం భయాలు అలానే ఉన్నాయి.
తాజాగా పోలవరం ప్రాజెక్టు పనుల్లో భాగంగా తవ్విన జంట సొరంగాలు ప్రమాదంలో పడటం కలకలం రేపుతోంది. ఇటీవలి వర్షాలకు రాళ్లు జారిపడుతుండటంతో ఒక సొరంగం మట్టి, రాళ్లతో పూడుకుపోయింది. లైనింగ్ పనుల్లో నాణ్యతాలోపమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా తోటగొంది-మామిడిగొంది గ్రామాల మధ్య జంట సొరంగాలు తవ్వారు. ఇటీవలి వర్షాలకు మామిడిగొంది వైపు తవ్విన సొరంగం పైభాగాన ఉన్న కొండ 30 మీటర్ల మేర కుంగిపోయి గొయ్యి ఏర్పడింది.
ప్రాజెక్టు కుడి కాలువ సామర్థ్యం పెంచాలని, జంట సొరంగాల వెడల్పు పెంచాలని సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి గతంలో సూచించడంతో సెంట్రల్ డిజైనింగ్ ఆర్గనైజేషన్ అప్రూవల్ కోసం అధికారులు వేచి చూశారు. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు కొండపై మట్టి కరిగి రాళ్లు కిందకి జారడంతో సొరంగం సగం మేరకు పూడుకుపోయింది. ఆ రాళ్ల కింద ఏర్పాటుచేసిన లైనింగ్ సైతం కుంగిపోయింది. లైనింగ్‌లో వాడిన స్టీల్ సామర్థ్యం చాలకపోవడం ఇందుకు కారణంగా తెలుస్తోంది. సొరంగాల తవ్వకంలో లైనింగ్ వేసుకుంటూ వెళ్లాల్సి ఉండగా అధికారులు ఆ ప్రయత్నం చేసిన దాఖలాలు లేవు. సొరంగం ఆరంభంలో మాత్రమే సుమారు 20 మీటర్ల మేర లైనింగ్ వేశారు.
సొరంగాల తవ్వకంలో జాప్యం వల్ల కొండలపై వర్షపు నీరు కిందకు దిగి అంతర్భాగంలో రాళ్లు జారిపడుతున్నాయి. లైనింగ్ లేకుండా ఈ పనులు చేయడం ప్రమాదకరమే అయినా.. కొందరు కార్మికులు అక్కడే పనిచేస్తున్నారు. లైనింగ్ లేకుండా ఇలాగే పనులు ఇలాగే కొనసాగిస్తే.. సొరంగం ఎగువన ఉన్న హెడ్ రెగ్యులేటర్ నుంచి 20 వేల క్యూసెక్కుల జలాలు ప్రవహిస్తేజంట సొరంగాల లైనింగ్ సామర్ధ్యం నిలుస్తుందా? అన్న ప్రశ్నలు వస్తున్నాయి.