ఉట్టికెగరలేనమ్మస్వర్గానికి నిచ్చెనేసినట్లేనా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ
posted on Oct 7, 2022 @ 1:44PM
ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి నిచ్చెనేసిందట.. అలా ఉంది.. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్ రాష్ట్ర సమితిగా పేరు మార్చి జాతీయ పార్టీ అనడం. ఎవరు ఔనన్నా కాదన్న టీఆర్ఎస్ ఒక ప్రాంతీయ పార్టీ.. ఎంత గొప్పలు చెప్పుకున్నా.. దేశ్ కీ నేతా అంటూ దేశ వ్యాప్తంగా ప్లెక్సీలూ పోస్టర్లూ ఏర్పాటు చేసి మీడయాలో ప్రచారం చేసినా కేసీఆర్ ఇప్పటి వరకూ ప్రాంతీయ పార్టీ నాయకుడే. ఆయన క్షేత్ర స్థానం తెలంగాణయే. ఇక తెలంగాణ నుంచి జాతీయ స్థాయికి ఎగరాలంటే.. ముందుగా ఆయనకు కావలసింది.. లోక్ సభ స్థానాలు. తెలంగాణలో ఉన్నవి కేవలం 17 లోక్ సభ స్థానాలు మాత్రమే. 2019 సార్వత్రిక ఎన్నికలలో ఆయన పార్టీ గెలిచింది తొమ్మిది స్థానాలు మాత్రమే.
దేశ వ్యాప్తంగా ఉన్న లోక్ సభ స్థానాలు 542. అంటే తెలంగాణ నుంచి జాతీయ స్థాయిలో చక్రం తిప్పుదామని ఏకంగా పార్టీ పెట్టిన కేసీఆర్ కు తన సొంత రాష్ట్రంలో ఉన్నవి కేవలం 17 లోక్ సభ స్థానాలు. సరే ఆయన కరిష్మాతో వచ్చే సార్వత్రిక ఎన్నికలలో రాష్ట్రంలోని 17 లోక్ సభ స్థానాలలోనూ తన పార్టీ అభ్యర్థులను గెలిపించుకోగలిగినా మొత్తం లోక్ సభ స్థానాలలో ఆయనకు వచ్చే స్థానాల సంఖ్య ఎక్కువలో ఎక్కువ మూడు శాతానికి మించదు. ఈ పరిస్థితుల్లో జాతీయ పార్టీ పెట్టి నెగ్గుకు వద్దామని కేసీఆర్ భావించడం నేల విడిచి సాము చేయడంలాగే ఉందని పరిశీలకులు అంటున్నారు. తెరాస అధినేతగా, తెలంగాణ ముఖ్యమంత్రిగా ఈ ఎనిమిదేళ్లలో ఆయన ఎన్నడూ ప్రాంతీయ వాదాన్ని దాటి ఒక్క అడుగు పక్కకు వేసి దేశం మొత్తం అనే యోచన చేసిన దాఖలాలు లేవు.
దేశం విషయం ఎందుకు పొరుగున ఉన్న సాటి తెలుగు రాష్ట్రం ఏపీ గురించి ఒక్క మంచి ముక్క చెప్పిన పాపాన పోలేదు. ఎంత సేపూ ఎన్నికలు , గెలుపు వ్యూహాలతో ఆంధ్ర, తెలంగాణ మధ్య ఎడాన్ని పెంచడానికే ప్రయత్నించారు. నీళ్లు, ప్రాజెక్టులు, విభజన సమస్యల పరిష్కారం ఇలా ఏ విషయాన్ని తీసుకున్నా ఏపీకి న్యాయం జరగడానికి అవకాశం లేని ఎత్తుగడలనే అవలంబించారు.
తెలంగాణా చాలా చిన్న రాష్ట్రం. కేవలం 17 లోక్ సభా స్థానాలు ఉన్నాయి. లోక్ సభ మొత్తం సీట్ల సంఖ్య 542. అందులో కేవలం మూడు శాతమే లోక్ సభ స్థానాలున్న రాష్ట్రం నుంచి ఒక నాయకుడు ఏకంగా దేశాన్నే ఏలాలని యత్నం చేయడాన్ని ‘ఉట్టి ఎక్కగలిగామ( తెలంగాణలో అధికారం)నే సంబరంతో స్వర్గానికి నిచ్చెన వేసిన చందంగా ఉందని పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. తెలంగాణా రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చేసి, జాతీయ రాజకీయాల్లో తనకు కీలక పాత్ర దొరికినట్లు కేసీఆర్ సంబరాలు చేయడం వినోదాన్ని కలిగిస్తోందంటున్నారు. నిజమే దేశంలోని అత్యంత ధనిక పార్టీలలో తెరాస ఒకటి. అందులో సందేహం లేదు. గత ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ కానీ, జాతీయ రాజకీయాలలో అత్యధిక కాలం చక్రం తిప్పి, ఎక్కువ కాలం అధికారంలో ఉన్న గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కానీ ఆ విషయంలో అంటే ధనిక పార్టీ అన్న విషయంలో కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ తో పోటీలో లేవు.
అందుకే జాతీయ పార్టీ సారథిగా ఆయన పర్యటనల కోసం ఏకంగా సొంత విమానాన్నే కొనుగోలు చేయడానికి కేసీఆర్ నిర్ణయించారు. అంతేనా దేశ వ్యాప్తంగా అన్ని భాషలూ, రాష్ట్రాలలో పెద్ద ఎత్తునప్రకటనలు జారీ చేయగలిగారు. నిజమే అధికారికంగా టీఆర్ఎస్ బ్యాంక్ ఖాతాల్లో రూ. 860 కోట్లున్నాయి. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో వైట్ మనీకి కనీసం పది పదిహేను రెట్ల నల్లధనం ఉండడం సహజమేనని అంటుంటారు. అందుకే పార్టీ పేరు పెట్టక ముందే ఢిల్లీలో ఓ భారీ భవంతిని తీసుకొని రంగులతో కేసీఆర్ ముస్తాబు చేయించారు. దేశవ్యాప్తంగా తిరిగేందుకు సొంత విమానం కూడా ఏర్పాటు చేసుకోగలిగారు.
అయితే.. జాతీయ రాజకీయాల్లో ఎలా ముందుకు వెళ్లాలనే విషయంలో కేసీఆర్ కు స్పష్టత ఉన్నట్లు మాత్రం కన్పించడం లేదంటున్నారు రాజకీయ పరిశీలకులు. జాతీయ రాజకీయ పార్టీని స్థాపించి కేసీఆర్ మోడీని ఢీ కొనాలని నిర్ణయించారు. బలవంతుడైన శత్రువును ఢీకొనవలసి వచ్చినప్పుడు చుట్టు పక్కల వారందరినీ కలుపుకొని జట్టు కట్టాలి. మోడీతో శత్రుత్వం ఉన్న ప్రాంతీయ పార్టీలను, కాంగ్రెస్, కమ్యూనిస్టులు వంటి జాతీయ శక్తులను సమీకరించాలి. కానీ కేసీఆర్ ఆ ప్రయత్నం చేయలేదు. జాతీయ పార్టీ అంటే కనీసం ఆరేడు రాష్ట్రాల్లో సొంతంగా పోటీచేసే శక్తి ఉండాలి. ఆ శక్తి కేసీఆర్ కు లేదని ప్రత్యేకంగా చెప్పక్కర లేదంటున్నారు. పొరుగు రాష్ట్రాలు ఆంధ్ర, మహారాష్ట్ర, కర్ణాటకలలో కూడా కేసీఆర్ కు ఏమాత్రం పట్టు ఉన్న దాఖలా లేదు. డీఎంకే పార్టీ పలుమార్లు ఆంధ్రలో పోటీ చేసింది. కానీ ఒక్కసారి కూడా డిపాజిట్ దక్కించుకున్న చరిత్ర లేదు. కేసీఆర్ పరిస్థితి అంతకంటే మెరుగ్గా ఉండే అవకాశం లేదంటున్నారు. సాటి తెలుగురాష్ట్రం అయిన ఏపీలోనే ఆయనకు ఆదరణ లభించే అవకాశాలు మృగ్యం. అటువంటి కేసీఆర్ జాతీయ పార్టీకి ఇతర ప్రాంతాలలో ఆదరణ లభిస్తుందని ఎలా భావించగలం అని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద.. జాతీయ పార్టీ ప్రకటన ద్వారా కేసీఆర్ దుస్సాహసానికి పాల్పడ్డారనే అంటున్నారు.
ఆ సంగతి పక్కనపెట్టి, ఆంధ్రప్రదేశ్ విషయంలో కేసీఆర్ కొత్త పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది అని పరిశీలిస్తే ఆయనతో కలిసి వచ్చేవారు ఒక్కరూ కన్పించడం లేదని అంటున్నారు. ఏపీలోని రెండు ప్రధాన పార్టీలు వైసీపీ, టీడీపీ కేంద్రంలో మోడీతో స్నేహం కోసం తహతహలాడుతున్నాయి. ఆ పార్టీల అధినేతలు మోడీని ఎదిరించే సాహసం చేయరు. అందుకే ఎన్నికల పొత్తు లేకపోయినా, బీజేపీతో కలిస్తే తనకు బలమైన ముస్లింలలో అసంతృప్తి వస్తుందని తెలిసినా మూడేళ్లుగా లోక్ సభ, రాజ్యసభలలో బీజేపీ వైపే జగన్ నిలబడుతున్నారు. మోడీ అడగకుండానే మద్దతు ఇస్తున్నారు. చంద్రబాబు పరిస్థితి కూడా అందుకు భిన్నంగా లేదంటున్నారు. ఒకసారి మోడీని ధిక్కరించి, జాతీయ రాజకీయాల్లో వేలు పెట్టి విఫలం అయ్యారు. అందువల్ల అలాంటి దుస్సాహసం మరోసారి చేసే అవకాశం ఉండకపోవచ్చు.
కేసీఆర్ ఉద్యమం, టీఆర్ఎస్ పుట్టుక ఆంధ్రుల మీద ద్వేషంతో నడిచినవే. ఆంధ్రులు తమ నీళ్లు దొంగిలిస్తున్నారని, తమ ఉద్యోగాలు ఎత్తుకుపోతున్నారని, తమ నిధులు తరలిస్తున్నారని ఆగం చేసి మరీ కేసీఆర్ తెలంగాణా రాష్ట్రం సాధించారు. ఆంధ్రుల ప్రయోజనాలకు విరుద్ధ పోకడ గల పార్టీకి ఆంధ్రలో కాలుపెట్టే ఛాన్స్ లభిస్తుందని ఊహించడానికి కూడా వీలుకాదు. అందువల్ల కేసీఆర్ కొత్త పార్టీకి ఏపీలో ఎలాంటి బలమూ రాకపోవచ్చని అంటున్నారు. రాజకీయ నిరుద్యోగులు ఎవరైనా అక్కడక్కడా బీఆర్ఎస్ పార్టీ శాఖలు ప్రారంభించవచ్చు. కానీ అవి పేరుకు మాత్రమే అంటున్నారు. రాష్ట్ర విభజనకు ముందు ఆంధ్రులను కేసీఆర్ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని మా రాష్ట్రానికి వస్తావ్ బిడ్డా అంటున్నారు ఆంధ్ర ప్రజలు.