మెగాస్టార్ పవర్‌స్టార్ అయ్యేనా? ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారు?
posted on Aug 22, 2021 @ 7:02PM
హ్యాపీ బర్త్‌డే మెగాస్టార్ చిరంజీవి. బర్త్‌డే విషెష్‌తో తెలుగురాష్ట్రాలు హోరెత్తిపోతోంది. ఆదివారం మొత్తం మెగా సందడే. ఆచార్య, గాడ్‌ఫాదర్, భోళాశంకర్‌ల చర్చే. ప్రముఖులంతా చిరంజీవికి శుభాకాంక్షలు చెప్పారు. ఫ్యాన్స్ అంతా పోస్టులు, స్టేటస్‌లు, పాటలతో తమ అభిమానం చాటుకున్నారు. సోషల్ మీడియా మొత్తం మెగాస్టార్ మేనియానే. గ్రీన్ ఛాలెంజ్‌తో సోషల్ కాజ్ సైతం పెద్ద ఎత్తున కొనసాగింది. అంతా బాగుంది.. మెగాస్టార్ పుట్టినరోజు వేడుకలు బ్రహ్మాండంగా సాగాయి. అంతేనా.. అసలైన ఫ్యాన్స్ ఇంతే కోరుకుంటున్నారా? ఆచార్యతో అడ్జస్ట్ అయిపోతారా? గాడ్‌ఫాదర్‌తో గమ్మున ఉండిపోతారా? భోళాశంకర్ భజన చేసుకుంటూ రిలాక్స్ అవుతారా? కానే కాదు.. సినీ ఫ్యాన్స్ అలా కాంప్రమైజ్ అవుతారేమో కానీ.. పొలిటికల్ ఫ్యాన్స్ మాత్రం చిరంజీవిని ఇంకెక్కడో చూడాలనుకుంటున్నారు.. అన్నయ్యను అందనంత ఎత్తున ఊహించుకుంటున్నారు.. ఆయన్ను ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటున్నారు కానీ.. మెగాస్టార్ మాత్రం అందుకు ఇప్పుడే సిద్ధంగా లేనంటున్నారు. సినిమాలతో యమా బిజీగా ఉంటున్నారు. మరి, మెగాస్టార్ పవర్ కేవలం సినిమాల వరకేనా? పాలిటిక్స్‌లో మళ్లీ 'పవర్' చూపించే రోజులు రావంటారా?
కొణిదెల శివశంకర వరప్రసాద్. కేంద్ర మాజీమంత్రి. టాలీవుడ్ బిగ్‌బాస్. తెలుగు రాష్ట్రాలలో ఫుల్ క్రేజ్. దేశంలోనూ మంచి పాపులారిటీ. అభిమానగణం మెండు. రాజకీయాల్లో రాణించడానికి అన్ని అర్హతలూ ఉన్నాయి. అయినా, ఏవో కారణాలతో ఆయన పొలిటికల్ కెరీర్ కన్ఫ్యూజన్‌గా మారింది. ప్రజారాజ్యంతో ఉదయించే సూర్యుడిగా వెలుగొందుతారని అనుకున్నారంతా. వైఎస్సార్ ఆపరేషన్‌కు కాంగ్రెస్‌లో కలిసిపోయి కేంద్ర మంత్రి అయ్యారు. కట్‌చేస్తే.. రాష్ట్ర విభజనతో పాటూ ఆయన రాజకీయ ఉన్నతీ ముక్కలుచెక్కలైంది. ఆ తర్వాత చిరంజీవి మళ్లీ రాజకీయాల్లో మెరిశారు. వరుస హిట్‌లతో మునుపటి చరిష్మా సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన టెక్నికల్‌గా కాంగ్రెస్‌లోనే ఉన్నా.. రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
చిరంజీవి పాలిటిక్స్‌లో యాక్టివ్ లేకున్నా.. సినీ పాలిటిక్స్‌లో మాత్రం అందరికన్నా ముందున్నారు. టాలీవుడ్ సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు. లాక్‌డౌన్ టైమ్‌లో సినీ కార్మికులను ఆదుకున్నారు. పరిశ్రమ అభివృద్ధికి చొరవ తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఇటు తెలంగాణ సర్కారు, అటు ఏపీ ప్రభుత్వానికి అత్యంత సన్నిహితుడిగా మారారు. కల్వకుంట్ల-కొణిదెల ఫ్యామిలీల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. చిరంజీవి-జగన్ క్లోజ్ రిలేషన్ మెయిన్‌టెన్ చేస్తున్నారు. అపాయింట్‌మెంట్ లేకుండానే ఇద్దరు సీఎంలను కలిసేంత సాన్నిహిత్యం ఏర్పడింది. తెలంగాణ పాలిటిక్స్‌లోకి చిరంజీవి వచ్చే అవకాశం లేకున్నా.. పరోక్షంగా కేసీఆర్‌కు సపోర్ట్‌గా ఉంటున్నారు. ఇక, ఏపీ రాజకీయాల్లో మెగాస్టార్ రోల్ ఇంట్రెస్టింగ్‌గా మారింది.
ఏపీ పాలిటిక్స్‌లో ఇప్పటికీ మెగాస్టార్.. ట్రంప్‌కార్డ్‌గానే ఉన్నారు. ఏపీ రాజకీయాలను శాసించలేకపోయినా.. ప్రభావితం మాత్రం చేయగలరు. అందుకే, చిరంజీవిని ట్రాప్ చేసేలా జగన్ ఆయనతో ఈమధ్య కాలంలో రాసుకుపూసుకు ఉంటున్నారని అంటున్నారు.. తమ్ముడు పవన్‌కల్యాన్ జనసేన పార్టీ నుంచి కాచుకోడానికి.. అన్నయ్య చిరంజీవితో నరుక్కొస్తున్నారని భావిస్తున్నారు. కావాలనే చిరంజీవిని పలుమార్లు కలుస్తూ.. ఏపీ టాలీవుడ్‌పై చర్చిస్తూ.. చిరంజీవి-జగన్ మంచి ఫ్రెండ్స్ అనే మెసేజ్ పబ్లిక్‌లోకి వెళ్లేలా చూసుకుంటున్నారు. ఇదంతా జగన్ ఆడుతున్న మైండ్‌గేమ్ అంటున్నారు. చిరంజీవిని వైసీపీ తరఫున రాజ్యసభకు పంపుతారనే ప్రచారానికీ తాడేపల్లి వర్గాల లీకులే కారణమని చెబుతున్నారు. జనసేన నుంచి రక్షణకే మెగాస్టార్‌ను సేఫ్‌గార్డ్‌గా ముందుంచుతున్నారని విశ్లేషిస్తున్నారు.
ఇక ఈసారి ప్రధాని కావాలని ఆశపడుతున్న రాహుల్‌గాంధీ సైతం ఏపీలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్‌ను మళ్లీ పట్టాలెక్కించాలని భావిస్తున్నారు. అందుకోసం ఏపీ మొత్తం సెర్చ్ లైట్ పెట్టి వెతికితే.. ఒక్క చిరంజీవి మాత్రమే వారికి ఆశాకిరణంలా కనిపిస్తున్నారు. అందుకే, చిరంజీవిని మళ్లీ కాంగ్రెస్‌లో యాక్టివ్ చేసే బాధ్యతను రాహుల్‌గాంధీ.. ఉమెన్‌చాందీకి అప్పగించారని చెబుతున్నారు. తెలంగాణలో రేవంత్‌రెడ్డి మాదిరిగా.. చిరంజీవిని ఏపీపీసీసీ చీఫ్ చేసి.. పత్తా లేకుండా పోయిన కాంగ్రెస్‌కు ఓ రూపు తీసుకురావాలని చూస్తున్నారు. అక్రమాస్తుల కేసులో జగన్‌రెడ్డి జైలుక వెళితే.. వైసీపీలో ఉన్నవారంతా ఒకప్పటి కాంగ్రెస్ వాదులే కాబట్టి.. వారిని మళ్లీ వెనక్కి లాగి.. చిరంజీవి నాయకత్వంలో కాంగ్రెస్‌కు మళ్లీ ప్రాణం పోయాలనేది రాహుల్ అండ్ టీమ్ ఐడియా. మరి, అది సాధ్యమా? అంటే... అనుమానమే. వచ్చే రెండేళ్ల వరకూ సినిమా షెడ్యూళ్లతో బిజీగా ఉన్నారు మెగాస్టార్. ప్రస్తుతం లైమ్‌లైట్‌లో ఉన్న ఆయన.. మళ్లీ పొలిటికల్ లైట్‌లోకి వస్తారా? ఏపీ పాలిటిక్స్‌లో ఫుల్ జోష్ మీద తమ్ముడు పవన్‌కల్యాణ్ ఉండగా.. మళ్లీ ఈ అన్నయ్య ఎంట్రీ అవసరమా? సినిమాల్లో మెగాస్టార్.. మళ్లీ పొలిటికల్‌గా యాక్టివ్ అయి 'పవర్'స్టార్‌గా మారుతారా? ఏమో......