బాబాయ్ పై గొడ్డలి పోటు ఎవరిది?.. అసలు పెద్దలు ఎవరు?
posted on Nov 14, 2021 @ 12:30PM
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కారు డ్రైవర్ దస్తగిరి కన్ఫెషన్ స్టేట్‌మెంట్ ప్రకంపనలు స్పష్టిస్తోంది. వివేకా హత్య జరిగిన తీరును వివరిస్తూ కన్ఫెషన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు డ్రైవర్ దస్తగిరి. అందులో బడా నేతల పేర్లు ప్రస్తావించారు. దస్తగిరి కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో సీఎం జగన్ సన్నిహితుడు, కడప ఎంపీ అవినాష్‌రెడ్డి పేరును కూడా ప్రస్తావించారు. ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, గుజ్జుల ఉమాశంకర్‌రెడ్డితో కలిసి వివేకాను హత్య చేసినట్టు దస్తగిరి స్టేట్‌మెంట్ ఇచ్చారు. వివేకా హత్యకు ఎర్ర గంగిరెడ్డి ప్లాన్ చేసినట్టు కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తర్వాత అవినాష్ ఇంటి దగ్గర వాగ్వాదం జరిగిందని స్టేట్‌మెంట్‌లో తెలిపారు. తనను కావాలనే ఓడించారని, మీ కథ తేలుస్తానంటూ అవినాష్‌రెడ్డి, భాస్కరరెడ్డి, డి.శంకర్‌రెడ్డిలకు వివేకా వార్నింగ్ ఇచ్చినట్లు కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు.
వివేకా హత్య కేసులో దస్తగిరి ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్‌మెంట్ ఏపీలో సంచలనంగా మారింది. టీడీపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. వైఎస్ వివేకా హత్య కేసుపై మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘బాబాయిది గుండె పోటు అని చెప్పి నమ్మించాలని చూశారు, గొడ్డలి పోటు అని బయటపడింది. కుక్కను చంపారు, బాబాయిపై వేటు వేసి కుట్లు వేశారు?... ఇంతకీ బాబాయ్ హత్య వెనక ఉన్న అసలు పెద్దలు ఎవరు?.. అందిన సొమ్ములు, వాడిన ఆయుధాలు ఎక్కడివో ప్రజలకు చెప్పే ధైర్యం ఉందా?’’ అంటూ దేవినేని ఉమా ట్వీట్ చేశారు.
వివేకా హత్య కేసుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. బాబాయ్‌ని లేపేసి నారాసుర రక్తచరిత్ర అంటూ చంద్రబాబుపై నీ దొంగ పేపర్లో రాయించిన అబ్బాయి జగనూ... సుపారీ రూ.40 కోట్లు, గొడ్డలి వేట్లు నీ ఇంటివేనట కదా! ఇప్పుడేం రాయిస్తారు మీ పత్రికలో..!’’ అని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు లోకేష్ ఒక ప్రకటన విడుదల చేశారు.