ఇన్వెస్టర్ల సమ్మిట్ జగన్మాయేనా?.. విద్యుత్ రంగంలో లక్షల కోట్ల పెట్టుబడులు అంటే నమ్మేదెలా?
posted on Mar 4, 2023 @ 10:20AM
పేక మేడలు కట్టేసి వాటినే అద్భుత కట్టడాలుగా నమ్మమంటున్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్. తాను సర్వ నాశనం చేసిన విద్యుత్ రంగంలోనే భారీ పెట్టుబడులు వచ్చాయని చెబుతూ.. ఇక రాష్ట్రం వెలుగుల మయం అయిపోతుందంటున్నారు. ఔను జగన్ రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని తన అవినీతి సామ్రాజ్య విస్తరణకు ఒక పావుగా మార్చుకున్నారు. జగన్ విద్యుత్ ప్రాజెక్టుల పేరుతో కోట్లాది రూపాయల కాంట్రాక్టులను అస్మదీయులు, బినామీలకు కట్టపెట్టారు. ఇందు కోసం విద్యుత్ వినియోగదారులను నిలువుదోపిడీ చేయడానికి కూడా వెనుకాడలేదు. సర్దుబాటు పేరుతో విద్యుత్ వినియోగ దారుల మీద మూయలేని భారాన్ని మోపుతున్నారు. 2021-22 వార్షిక సంవవత్సరంలో డిస్కంలు కొనుగోలు చేసిన విద్యుత్ కొనుగోళ్ల సర్దుబాటును 2023-24 లో వసూలు చేసుకునేందుకు ఏపీ ఈఆర్సీ డిస్కంలకు అనుమతి ఇవ్వడం ఇందుకు తార్కానం.
రూ.3,082 కోట్ల సర్ధుబాటు ఛార్జీలతో కలిపి మరో రూ.456 కోట్ల సరఫరా నష్టాలను కూడా వినియోగదారుల నుంచి వసూలు చేయాలు చేయ డానికి రెడీ అయిపోయింది జగన్ సర్కార్. అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్ల కాలంలో రాష్ట్రంలో ఇప్పటికే 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన సర్కార్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అప్పులు తెచ్చి మరీ అవసరం లేకుండా హిందుజాకు చెల్లించేందుకు వినియోగదారులపై రూ.49,106 కోట్ల భారం మోపారు. అంతే కాకుండా తన బినామి కంపెనీ అయిన షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ కు రూ.2,629 కోట్లు విలువైన బిల్లులు చెల్లించారు. దీంతో జగన్ రెడ్డి నాలుగేళ్లలో ప్రజలపై మోపిన మొత్తం భారం అక్షరాలా 55,273 కోట్ల రూపాయలు.
జగన్ రెడ్డి ప్రభుత్వంలో విద్యుత్ డిస్కంలు తిరిగి లేవలేని అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. 2019 లో అధికారంలోకి వచ్చే నాటికి 18,022 కోట్ల రూపాయలుగా ఉన్న డిస్కంల అప్పు. 2022 డిసెంబర్ నాటికి .50,004 కోట్ల రూపాయలకు చేరుకుంది. అంటే, జగన్ మూడున్నరేళ్లలో డిస్కంల పేరుతో 31,981 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ప్రభుత్వం డిస్కంలకు చెల్లించాల్సిన సబ్సిడీ బకాయిలు రూ.31,277 కోట్లు. 2019-22 మధ్య కాలంలో బహిరంగ మార్కెట్ లో రూ. 12,200 కోట్ల విలువైన విద్యుత్ కొనుగోలు చేశారు. కొనుగోళ్లలో కమిషన్ల కోసం రూ.60 వేలు ఖరీదు ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లను రూ.1.30 వేలు పెట్టి షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ నుంచి కొన్నారు. మూడున్నరేళ్లలో కేవలం షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ కు రూ.2,629 కోట్లు రూపాయల బిల్లులు చెల్లించారు. వాస్తవ పరిస్థితి ఇదైతే.. విశాఖ లో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ లో రాష్ట్ర విత్త మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అవాస్తవాలు వినిపించి జనాలను నమ్మించే విఫల యత్నం చేశారు.
వాస్తవానికి గ్లోబల్ సమ్మిట్ లో తొలి రోజు జగన్ సర్కార్ గ్రీన్ ఎనర్జీ రంగంలో పలు ఎంవోయూలు కుదుర్చుకుంది. ఆ ఒప్పందాల డొల్ల తనం గురించి తరువాత చెప్పుకుందా.. మొదలు అసలు గ్రీన్ ఎనర్జీ గురించి మాట్లాడే అర్హత జగన్ రెడ్డికి ఇసుమంతైనా లేదనడానికి, చంద్రబాబునాయుడి హయాంలో ఐదేళ్లలో 14,655 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను నెలకొల్పి ఇతర రాష్ట్రాలకు అమ్మే స్థాయి రాష్ట్ర విద్యుత్ రంగం ఎదిగింది. ఆ 14, 655 మెగావాట్ల విద్యుత్ లో 7 వేల మెగావాట్ల సోలార్, విండ్ విద్యుత్ ప్లాంట్లే. అదే జగన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత గ్రీన్ ఎనర్జీ ప్లాంట్లను నిర్వీర్యం చేశారు. పరిశ్రమలకు పవర్ హాలిడేలు ప్రకటించారు. సోలార్, విండ్ పీపీఏలను రద్దు చేశాడు. వారు సరఫరా చేసిన విద్యుత్ కు రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదు. పెట్టుబడులు పెట్టిన పారిశ్రామికవేత్తలు కోర్టులను ఆశ్రయించాల్సి వచ్చింది.
చంద్రబాబు హయాంలో రెన్యువబుల్ ఎనర్జీలో రాష్ట్రం దేశంలోనే నంబర్ 1 స్థానంలో ఉంటే నేడు అట్టడుగు స్థానానికి పడిపోయింది. జగన్ నాలుగేళ్ల పాలనలో రాష్ట్రంలో ఒక్క యూనిట్ అదనపు విద్యుత్ ఉత్పత్తి జరిగిన దాఖలాలు లేవు. బాబు హయాంలో మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రంగా ఉన్న ఏపీ జగన్ నాలుగేళ్ల పాలనలో విద్యుత్ కోతల రాష్ట్రంగా మారిపోయింది. ఇప్పుడు తగుదునమ్మా అని విశాఖ గ్లోబల్ సమ్మిట్ లో విద్యుత్ రంగంలో 8.35 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని ప్రకటిస్తున్నారు. అంటే లక్షా 50 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఒప్పందాలు కుదుర్చుకున్నామని జగన్ సర్కార్ ప్రకటిస్తోంది. వాస్తవానికి రాష్ట్రంలో పీక్ డిమాండ్ అందులో సగానికి సగం కూడా ఉండదు. మరి డిమాండ్ లేని రంగంలో ఇన్వెస్టర్లు భారీగా ఒప్పందాలు ఎందుకు కుదుర్చుకున్నారంటే జగన్మాయ అనే చెప్పాలి.
భారీగా ఒప్పందాలు కుదుర్చుకున్నామని ప్రకటనలు గుప్పించుకోవడానికే తప్ప ఈ ఒప్పందాలలో ఏవి గ్రౌండ్ అవుతాయంటే ఎవరూ నోరు మెదపరు. రైతు భరోసా అంటూ తెనాలిలో ముఖ్యమంత్రి జగన్ బటన్ నొక్కుడు లాంటివే ఈ ఒప్పందాలు కూడా అనుకోవాలి. ఇక ఇన్వెస్టర్ల సదస్సుకు వచ్చిన డిలిగేడ్స్ ఇన్ని వేల మంది అన్ని వేల మంది అంటూ చేసుకున్న ప్రచారంలోని డొల్లతనం ఏమిటో ఐ ప్యాక్ సాక్షిగా నిన్ననే బయటపడింది.