Read more!

ఈ చట్టాలు మాకొద్దు..!

 

 

 

ఐర్లాండ్ లో గర్భస్రావం చేయడం చట్టపరంగా నేరం. ఈ చట్టం మూలంగా ఓ భారతీయ మహిళ అన్యాయంగా ప్రాణాలు కోల్పోయింది. బెంగళూరుకు చెందిన 31 సంవత్సరాల సవితా హలప్పనావర్ కి 17వారాల గర్భం తర్వాత అనుకోకుండా ఇబ్బంది మొదలైంది. స్వతహాగా తనుకూడా ఓ డాక్టరే.. కాకపోతే ఆమె డెంటిస్ట్..

 

చనిపోవడానికి కొద్ది సేపటికి ముందు నేరుగా గాల్వే యూనివర్సిటీ ఆసుపత్రికెళ్లిన సవిత తన పరిస్థితిని వివరించి, కడుపులో నొప్పి భరించలేకపోతున్నాను వెంటనే అబార్షన్ చేయమని అడిగింది. సవిత ఎంత మొత్తుకున్నా అక్కడ డాక్టర్లు ఆమెకి అబార్షన్ చేయడానికి అంగీకరించలేదు.

 

ఐరిష్ చట్టాలప్రకారం అబార్షన్ చేయడం నేరమంటూ డాక్టర్లు కనికరం లేకుండా ప్రవర్తించారు. పరిస్థితి చేయిదాటిపోయింది. సవిత ప్రాణాలు పోగొట్టుకుంది. కళ్లముందే ఆమె చనిపోతున్నా భర్త, బంధువులు ఏమీ చేయలేని దయనీయమైన పరిస్థితి.

 

క్యాథలిక్ దేశంలో అబార్షన్లు చేయడం సరికాదన్న గుడ్డి నమ్మకంతో అక్కడి ప్రభుత్వం గర్భస్రావాల్ని నిషేధిస్తూ చట్టం చేసింది. ఇప్పుడు సవిత మరణంతో నైనా అక్కడి ప్రభుత్వం కళ్లు తెరవాలని, తల్లి ప్రాణాల్ని నిలబెట్టేందుకు అబార్షన్ చేయడం తప్పుకాదన్న విషయాన్ని తెలుసుకోవాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు.

 

సవిత ప్రాణాల్ని బలిగొన్న చట్టాల్ని నిరసిస్తూ ఐర్లండ్ ప్రజలు పెద్ద ఎత్తున పార్లమెంట్ ముందు ర్యాలీ నిర్వహించారు.  సవిత మృతికి నిరసనగా లండన్‌లోని ఐర్లాండ్ రాయబార కార్యాలయం ముందు ప్రజలు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో సవిత మృతి పట్ల విచారణ జరిపాలని ఐర్లాండ్ ఆరోగ్య శాఖా మంత్రి జేమ్స్ అధికారులకు ఆదేశించారు. దీనిపై ఐర్లాండ్ ప్రధాని మాట్లాడుతూ.. సవిత మరణం పట్ల నివేదిక అందిన వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.