తెరాసలో అసమ్మతి ఆరున్కొక్కరాగం.. కారు పార్టీలో కలహాల కాపురం
posted on Sep 12, 2022 @ 12:37PM
తెలంగాణలో అధికార పార్టీయే రెండు పాత్రలు పోషిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అవును నిజమే రాష్ట్రంలో టీఆర్ఎస్ వర్సెస్ టీఆర్ఎస్ అనే పరిస్థితి ఉంది. ఆశ్చర్యం లేదు.. ప్రస్తుతం తెలంగాణలో అధికారపార్టీ నాయకులే ప్రతిపక్షం పాత్ర కూడా పోషిస్తున్నారు. గులాబీ దళంలో అంతర్గత విభేదాలు రోజురోజుకూ తార స్థాయికి చేరుకుంటున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నాయకులకు, ప్రజాప్రతినిధులకు, సర్పంచ్ లకు, సీనియర్లకు మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉందని తెరాస శ్రేణులే చెబుతున్నాయి.
ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గల్లో టిఆర్ఎస్ కు సొంతపార్టీ నేతలే ప్రతిపక్ష నేతలుగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. దీంతో అధికారిక, పార్టీ కార్యక్రమాలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. తాండూరులో మొదలైన ఈ కుమ్ములాటలు ఆ జిల్లా అంతటా పాకాయి. రెండు వర్గాలుగా విడిపోయిన గులాబీ శ్రేణులు బహిరంగంగా కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. ఇటీవల తాండూరులో నిర్వహించిన పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్న రాష్ర్టమంత్రి హరీశ్ రావు, అక్కడి ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిలపై అసహనం వ్యక్తంచేయడం స్థానిక పరిస్థితులకు అద్దం పట్టింది.
జిల్లాలోనూ ఇదే సీన్ కొనసాగుతోంది. తాండూరు, పరిగి, వికారాబాద్, కొడంగల్, కొల్లాపూర్, మహేశ్వరం, మేడ్చెల్, ఉప్పల్, భువనగిరి, నకిరేకల్, మునుగోడు ఇలా ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ వర్గ పోరు పతాక స్థాయిలో సాగుతోంది. పార్టీ కార్యక్రమాలకు వైరి వర్గాలు విడివిడిగా హాజరుకావడం.. వ్యక్తిగత దూషణలకు దిగడం పరిపాటిగా మారింది. మరో వైపు వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ తరఫున పోటీ చేయాలనుకుంటున్న ఆశావహుల సంఖ్యా రోజురోజుకూ పెరుగుతోంది. సాధారణంగా ఎక్కడైనా పాలక, ప్రతిపక్షాలు గొడవలు పడుతుంటాయి. అధికార పక్షం అవునంటే.. ప్రతిపక్షం కాదంటుంది. ప్రతిపక్షం ఇదంటే అధికార పక్షం అదంటుంది కానీ పలు జిల్లాలోని టిఆర్ఎస్ నాయకుల పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తోంది.
అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ తరపున పోటీ చేయాలనుకుంటున్న ఆశావహుల సంఖ్య భారీగానే ఉన్నది. అధికార పార్టీ ప్రస్తుత ప్రజాప్రతినిధులతో సొంత పార్టీకి చెందిన నేతలు పోటీ పడుతున్నారు. మాటల యుద్ధానికి తెరలేపుతున్నారు. పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు ఒకరినొకరు బహిరంగంగా దూషించుకుంటున్నారు. రానున్న ఎన్నికల్లో టిక్కెట్టు నాదంటే.. నాదేనంటూ బహిరంగ ప్రకటనలకు చేస్తున్నారు. పార్టీ కూడా రెండు గ్రూపులుగా విడిపోతుంది. రానున్న ఎన్నికల్లో అధికార పక్షాన్ని సొంత పార్టీలో టిక్కెట్టు ఆశావాహులే ఓడించే పరిస్థితి పలు నియోజకవర్గాలలో నెలకొన ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కొన్ని నియోజకవర్గాల్లో టిక్కెట్టు రానివారంతా పార్టీలు మారి టీఆర్ఎస్ అభ్యర్థులకు ప్రత్యర్థులుగా నిలబడే అవకాశాలు మెండుగా ఉన్నాయనీ టీఆర్ఎస్ శ్రేణులే చెబుతున్నాయి. కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేంద్ర రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి మధ్య కొంతకాలంగా కోల్డ్ వార్ కొనసాగుతోంది. వికారాబాద్ లో మున్సిపల్ చైర్పర్సన్ దంపతులు పట్నం వర్గంతో జత కట్టడంతో స్థానిక ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ కు వర్గ పోరు మొదలైంది. ఇక ఎమ్మెల్యే వర్గీయులు ఇటీవల జెడ్పీ చైర్పర్సన్ పట్నం సునీతారెడ్డి కాన్వాయ్ ను అడ్డుకోవడంతో పార్టీ కేడర్ మధ్య విభేదాలు రోడ్డెక్కాయి. పరిగి నియోజకవర్గంలోనూ డీసీసీబీ చైర్మన్ మనోహర్రెడ్డి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు. దీంతో ఇక్కడ కూడా అధికార పార్టీలో అంతర్గత పోరు మొదలైంది.
ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డిలు రెండు వర్గాలుగా విడిపోయి ఎవరికి వారు రానున్న ఎన్నికల్లో టిక్కెట్టు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎవరికి వారే వేరువేరుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కొల్లాపూర్ లో జూపల్లి కృష్ణారావు, బీరం హర్షవర్థన్ రెడ్డిల మధ్య విభేధాలు రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిందే. నకిరేకల్ నియోజకవర్గంలో చిరుమర్తి లింగయ్య, వేముల వీరేశంకు మధ్య వార్, అలాగే భువనగిరి నియోజకవర్గంలో చింతల వెంకటేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డిల మధ్య టిక్కెట్టు పోరు, మహేశ్వరంలో తీగల క్రిష్ణారెడ్డి, మంత్రి సబితా ఇంద్రారెడ్డిల మధ్య విభేదాలు ఇలా ఎక్కడ చూసినా తెరాసలో అంతర్గత కుమ్ములాటలు, వర్గ విభేదాలు పార్టీకి తలనొప్పులుగా మారాయి. త్వరలోనే ఉప ఎన్నిక జరుగబోతున్న మునుగోడులోనూ రెండు వర్గాలు టిక్కెట్టు విషయంలో తీవ్ర స్థాయిలో పోటీ పడుతుండటంతో అక్కడ ఇంకా ఎవరికీ టికెట్ ఖరారు చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితి పార్టీ ప్రతిష్టను ప్రజలలో పలుచన చేస్తున్నది.